Abn logo
Aug 14 2020 @ 09:31AM

వదలని వాన.. హైదరాబాద్‌లో కుండపోత..!

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల గురువారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. మూడు రోజులుగా నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముసురుతో పాటు చల్లని గాలులు వీయడంతో నగరవాసులు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోయారు. గురువారం సాయంత్రం వరకు నగరంలో 9.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 


ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని రాజా డీలక్స్‌ చౌరస్తా, పార్సిగుట్ట, వీఎస్టీ రోడ్లలో వర్షం నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలైన బాపూజీనగర్‌, అంబేద్కర్‌నగర్‌ గుడిసెవాసులు, వినోభానగర్‌ తదితర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంబర్‌పేట నియోజకవర్గంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో రహదారులు జలమయంగా మారాయి. నల్లకుంట డివిజన్‌లోని ఛే నెంబర్‌ చౌరస్తాలో వర్షం నీరు నిలిచిపోవడంతో వాహదానదారులు, పాదచారులు నానా ఇక్కట్లకు గురయ్యారు. ముఖ్యంగా తిలక్‌నగర్‌, ఛే నెంబర్‌ చౌరస్తా, ఫీవర్‌ ఆసుపత్రి చౌరస్తా తదితర ప్రాంతాలలో మెయిన్‌ రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కురిసిన వర్షంతో ప్రధాన, అంతర్గత రహదారుల్లో వర్షపునీరు నిలిచింది.


పార్శిగుట్టలో కూలిన చెట్టు

పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ భారీచెట్టు  నేలకొరిగింది. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో చెట్టు వేళ్లతో సహా పైకి లేచింది. చెట్టుకొమ్మలు కరెంట్‌ తీగలపై పడ్డాయి. కూలిన సమయంలో అక్క డ ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. 


మెహిదీపట్నంలో...

మెహిదీపట్నంలో గురువారం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మెహిదీపట్నం, సంతో్‌షనగర్‌ కాలనీ, గుడిమల్కాపూర్‌, కార్వాన్‌, నానాల్‌నగర్‌తోపాటు ఆయా ప్రాంతాల్లో వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 


అత్యధికంగా వర్షపాతం ఇక్కడే..

మండలం మిల్లీమీటర్లలో

చార్మినార్‌ 18.03

రాజేంద్రనగర్‌ 18.03

శేరిలింగంపల్లి 18.00

ఆసిఫ్‌నగర్‌ 17.00

మారేడుపల్లి 16.08

బాలానగర్‌ 16.05

ఖైరతాబాద్‌ 16.03

సరూర్‌నగర్‌ 16.03

సికింద్రాబాద్‌ 16.00

ఉప్పల్‌ 15.08

కాప్రా 15.08

మల్కాజిగిరి 15.08

నాంపల్లి 15.08

Advertisement
Advertisement