ముంచెత్తిన వాన.. భద్రాద్రి వద్ద 35అడుగులకు గోదావరి నీటిమట్టం

ABN , First Publish Date - 2020-08-14T19:15:25+05:30 IST

అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా అన్ని మండలాల్లో

ముంచెత్తిన వాన.. భద్రాద్రి వద్ద 35అడుగులకు గోదావరి నీటిమట్టం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెగని ముసురు

ఉప్పొంగిన వాగులు, వంకలు, ప్రాజెక్టులు

మత్తడి పోస్తున్న చెరువులు 

తాలిపేరు ప్రాజెక్టు 18గేట్లు ఎత్తివేత

ఖమ్మంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు

వానధాటికి నగరంలో కూలిన ఐదు రేకుల ఇళ్లు

ఏడుగురికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం


ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి): అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా అన్ని మండలాల్లో ముసురు కొనసాగింది. దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎడతెగని వర్షాలతో ఇరు జిల్లాల్లోని పలు వాగులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఖమ్మం జిల్లాలో గడిచిన 24గంటల్లో 57.1మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కారేపల్లి మండలంలో 121.2మి.మీ వర్షాపాతం నమోదైంది. ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు 14అడుగులవద్ద ప్రవహిస్తోంది.  ఖమ్మం నగరంలో బుర్హాన్‌పురంలో ఐదు రేకుల ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఏన్కూరు మండలంలోని జన్నారం-అంజనాపురం మధ్య వాగుపొంగి రహదారిపై నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లోనూ రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లంకాసాగర్‌, బేతుపల్లి ప్రాజెక్టుల్లో 16అడుగులకు నీరు చేరడంతో అలుగునుంచి నీరు బయటకు వెళుతోంది. వైరా ప్రాజెక్టు నీటిమట్టం 19.6అడుగులకు చేరడంతో అలుగు పడింది. బోనకల్‌ మండలంలోని కలకోట చెరువుతోపాటు పలు మండలాల్లోని చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తిచేలల్లో వర్షం నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పత్తిచేలు ఎర్రబారే ప్రమాదం ఉంది.


భద్రాద్రి జిల్లాలో 88.9మి.మీ వర్షపాతం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండోరోజూ వాన జోరు కొనసాగింది. జిల్లాలో గురువారం 88.9మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండంలోని కిన్నెరసాని జలాయశాయనికి భారీగా వరదనీరు రావడంతో జలాశయం నీటి మట్టం 405.70అడుగులకు చేరుకొంది. గురువారం ఉదయం నుంచి 6గేట్లుఎత్తి 17వేల క్యూసెకులనీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకోవడంతో 4గేట్లు ఎత్తి 5,220క్యూసెకుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజక్టు భారీ వరదనీరు చేరడంతో 18గేట్లు ఎత్తి 60వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లోని సింగరేణి ఓసీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయ ఏర్పడింది. 


భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఎగువనుంచి భారీగా వరద వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6గంటలకు ప్రవాహం 35అడుగులకు చేరుకుంది. స్నానఘట్టాలు ఇప్పటికే నీట మునిగాయి.  రాబోయే 48గంటల్లో భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్న నేపధ్యంలో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశముంది. మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43అడుగుల స్థాయిని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలోకి నీరు చేరింది.  

Updated Date - 2020-08-14T19:15:25+05:30 IST