నీటి ప్రాజెక్టులకు నిధుల గండం!

ABN , First Publish Date - 2020-10-22T07:44:51+05:30 IST

రాష్ట్రంలో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ, దుమ్ముగూడెం, కంతనపల్లి వంటి అనేక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్‌ కేటాయింపులతోపాటు రుణాల

నీటి ప్రాజెక్టులకు నిధుల గండం!

బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు ఆలస్యం

కాళేశ్వరం ‘మూడో టీఎంసీ’ పనులకు ఇబ్బందే

వరుస కొర్రీలతో సమస్యలేనంటున్న అధికారులు

ఇప్పటికే 10వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు


రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల గండం ఏర్పడింది. గతంలో మాదిరిగా ప్రాజెక్టుల నిర్మాణాలకు సకాలంలో నిధులను సమకూర్చడం... అంత సులువైన అంశం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టులపై వరుసగా కొర్రీలు పడుతుండడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో అంచనాల మేరకు రుణాలు మంజూరు కావడం లేదు. మరోవైపు కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు వ్యయం చేయడానికీ ఇబ్బందులున్నాయి. ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.


హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ, దుమ్ముగూడెం, కంతనపల్లి వంటి అనేక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్‌ కేటాయింపులతోపాటు రుణాల రూపేణా గత ఆరేళ్లుగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం ఏటా సుమారు రూ.25-30వేల కోట్ల వరకూ నిధులను ఖర్చు పెడుతోంది. అలాగే, ఈ ఏడాది కూడా భారీగా వ్యయం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులు భావించారు.


అయితే, ఈ ఏడాది మొదట్లోనే కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. దాంతో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు నిలిచిపోయింది. అయితే, ఇప్పటికే కొన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు భారీగా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ఆదాయం తగ్గినా... ఈ రుణాలతో నిర్మాణ పనుల్ని ముందుకు తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఈ రుణాల మంజూరులోనూ పలు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నుంచి సుమారు రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించి.. ఇప్పటికే రూ.1,384 కోట్ల రుణాన్ని స్వీకరించారు. ఈ తరుణంలో ప్రాజెక్టుకు అనుమతులు లేవంటూ ఏపీ ఫిర్యాదు చేయడం, కృష్ణా బోర్డు కూడా డీపీఆర్‌ను సమర్పించాలని ఆదేశించడం, అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చ జరగడంతో రుణం విడుదలకు బ్రేక్‌ పడింది.


అనుమతుల్లేకుండా చేపట్టే ప్రాజెక్టులకు రుణం ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో ఆడిట్‌ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా గతంలో రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంకులు, సంస్థలు ప్రస్తుతం కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం తగ్గిందని తెలుస్తోంది. 


సీడబ్ల్యూసీ నిర్ణయమే కీలకం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ నీటి తరలింపు పనులకు ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అంచనాలున్నాయి. మూడో టీఎంసీ నీటి తరలింపు పనుల కోసం సుమారు రూ.25వేల కోట్లకుపైగా రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే, మూడో టీఎంసీ నీటి తరలింపు ప్రాజెక్టుపై వరుసగా కొర్రీలు పడుతున్నాయి.


ఈ పనులపై కేంద్ర ప్రభుత్వం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ లేఖలు రాసింది. ముఖ్యంగా ఈ పనుల కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? నిర్మాణ పనులకు ఏ మేర వ్యయమవుతుంది? ఎంత మేర ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది? వంటి సమాచారాన్ని పంపించాలని కోరింది. అలాగే, ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ దీనిపై చర్చ జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. ఇదిలా కొనసాగుతుండగా, ఎన్జీటీ కూడా దీనిపై తీర్పు ఇస్తూ, కేంద్రం సూచన మేరకు కాళేశ్వరం మూడో టీఎంసీ నీటి తరలింపు పనులు చేపట్టాలని సూచించింది. దీంతో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారనుంది.


ఒక వేళ సీడబ్ల్యూసీ ఈ ప్రాజెక్టుపై మరిన్ని కొర్రీలు వేస్తే.. నిర్మాణ పనులు ముందుకెళ్లడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన మరో విధంగా ఉంది. ఎన్జీటీ పేర్కొన్న విధంగా నీటి కేటాయింపులకు లోబడే దీనిని చేపట్టామని, కొత్తగా ఆయకట్టు రావడం లేదని.. ఈ పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అంచనా వేస్తోంది. రాష్ట్ర అంచనాకు భిన్నం గా కేంద్రం దీనిపై కొరీల్రు వేస్తే.... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడంలో కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు.


Updated Date - 2020-10-22T07:44:51+05:30 IST