నిధులు కేంద్రానివి.. ఫొటోలు టీఆర్‌ఎస్‌ నేతలవి..

ABN , First Publish Date - 2021-10-22T05:32:49+05:30 IST

కేంద్ర నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులపై టీఆర్‌ఎస్‌ ఫోటోలు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

నిధులు కేంద్రానివి.. ఫొటోలు టీఆర్‌ఎస్‌ నేతలవి..
హుజూరాబాద్‌ మండలంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

- గడీల రాజ్యం కావాలా... పేదోళ్ల రాజ్యం కావాలా ఆలోచించండి

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 21: కేంద్ర నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులపై టీఆర్‌ఎస్‌ ఫోటోలు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,  ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌, తుమ్మనపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లె, కనుకులగిద్దె గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌లో అగ్గిపెట్టె మంత్రి హరీష్‌రావు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం పేదోళ్లే బలిదానాలు చేశారన్నారు. వారిని ఆత్మహత్యల వైపు ప్రేరేపించిన కేసీఆర్‌ మాత్రం నేడు రాజ్యమేలుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వచ్చే నెల 2న ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ బాక్స్‌లు బద్దలు కావాలని, ఈటల రాజేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ ఆస్తులను అమ్ముతోందని టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. భూములను అమ్ముతున్నది టీఆర్‌ఎస్సేనని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పుల పాలు చేస్తున్న ఆ పార్టీ  నాయకులు బీజేపీపై సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి వెచ్చించే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఆత్మహత్యలు పెరిగాయని, రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులతో పాటు చివరకు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేటీఆర్‌ బినామీ సంస్థ నిర్వాహకం వల్లే 24మంది ఇంటర్‌ విద్యార్థులు మృతి చెందారని, సీఎం కేసీఆర్‌ ఏనాడు దీని గురించి మట్లాడలేదన్నారు. ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వకపోగా, లాఠీ చార్జీ చేయించారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన కేసీఆర్‌ తన కుటుంబంలో మాత్రం ఐదుగురికి కొలువులు ఇచ్చుకున్నాడన్నారు. ఎన్నికలు వస్తే డబ్బులతో ఓట్లు కొనాలని, దొంగ ఉత్తరాలు సృష్టించి గట్టెక్కాలని చూస్తున్నార్నారు. హైద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో తన పేరు మీద దొంగ లేఖ సృష్టించి బండి సంజయ్‌ వల్లే వరద సహాయం ఆగిందని ప్రచారం చేశారన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్‌ చేస్తే తోక ముడిచారన్నారు. దళితబంధుపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిరుద్యోగభృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకే ఈటల రాజేందర్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. హుజూరాబాద్‌ ప్రజలకు ఆపద వస్తే ఆదుకునే వ్యక్తి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడీల రాజ్యం కావాలా... పేదోళ్ల రాజ్యం కావాలా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాముల కుమార్‌,  ప్రధాన కార్యదర్శి వినయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:32:49+05:30 IST