పీహెచ్‌సీలకు నిధుల కటకట!

ABN , First Publish Date - 2022-01-28T07:43:48+05:30 IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు ప్రభుత్వం నుంచి రెండేళ్లుగా ఆస్పత్రి అభివృద్ధి నిధులు (హెచ్‌డీఎఫ్‌) విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ గాడి తప్పుతోంది.

పీహెచ్‌సీలకు నిధుల కటకట!

  • రెండేళ్లుగా పెండింగ్‌లోనే హెచ్‌డీఎఫ్‌ 
  • ప్రతి కేంద్రానికి 3 లక్షలపైనే బకాయిలు 
  • రాష్ట్రవ్యాప్తంగా బకాయిలు 27 కోట్లు
  • నిర్వహణ భారమంటున్న వైద్య సిబ్బంది


ఆసిఫాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు ప్రభుత్వం నుంచి రెండేళ్లుగా ఆస్పత్రి అభివృద్ధి నిధులు (హెచ్‌డీఎఫ్‌) విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ గాడి తప్పుతోంది. నిధులు రాక నిర్వహణ భారంగా మారుతోందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆరోగ్య కేంద్రాల స్థాయిని బట్టి జనాభా ప్రాతిపదికన హెచ్‌డీఎఫ్‌ కింద యేటా రూ.80వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నిధులతో ఆస్పత్రి, ఆరోగ్య కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ, స్టేషనరీ, అత్యవసర కొనుగోళ్లు, విద్యుత్‌ దీపాలు, ఫ్యాన్ల మరమ్మతులు, ఫ్రిజ్‌ల నిర్వహణ వంటి పనులకు ఖర్చు చేస్తున్నారు. చాలా చోట్ల ఆరోగ్య కేంద్రాలకు స్వీపర్లను కేటాయించక పోవటంతో ఈ నిధుల నుంచే కొంత మొత్తాన్ని దినసరి కూలి ప్రాతిపదికపై శానిటేషన్‌ సిబ్బందికి ఇచ్చి పనులు చేయిస్తున్నారు. అయితే, రెండేళ్లుగా నిధులు లేకపోవడంతో ఈ పనులన్నీ ఆగిపోతున్నాయి.


కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 885 పీహెచ్‌సీలుండగా ఇందులో 636 ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 249 ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలుండగా, రెండు సామాజిక ఆస్పత్రులున్నాయి. ఇందులో సామాజిక ఆసుపత్రిల నిర్వహణకు సంబంధించి వైద్య, విధాన పరిషత్‌ ద్వారా నిధులు ఎప్పటికప్పుడు సక్రమంగా విడుదలవుతున్నా, పీహెచ్‌సీల విషయానికి వచ్చే సరికి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్ల కాలపరిమితికి గాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూ.26.56 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆసిఫాబాద్‌ జిల్లాకు రూ.72.44 లక్షలు పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. 


వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో అసంతృప్తి

2019 వరకు హెచ్‌డీఎఫ్‌ నిధుల విడుదల సజావుగానే సాగింది. అయితే, 2020-21 నుంచి రెండేళ్ల కాల పరిమితి కి సంబంధించిన నిధులు విడుదల చేయక పోవటంతో ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారం వైద్యాధికారులపైనే పడుతోందంటున్నారు. ఒప్పంద ప్రాతిపదికపై పని చేస్తు న్న వైద్యాధికారులకు చెల్లిస్తున్న వేతనమే తక్కువగా ఉందనుకుంటే ఈ నిర్వహణ ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ కారణాల వల్లే మారుమూల ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు వైద్యులు నిరాసక్తత కనబరుస్తున్నారని చెబుతున్నారు. హెచ్‌డీఎఫ్‌ నిధులు రెండేళ్లుగా నిధులు నిలిచి పోవటంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిధుల విడుదల కోసం వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు, కలెక్టర్లు ప్రభుత్వానికి ఇప్పటికే పలు మార్లు బకాయి ల జాబితాలను అందజేసినట్టు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-28T07:43:48+05:30 IST