నిధులు మళ్లించడానికి వీల్లేదు

ABN , First Publish Date - 2021-04-01T07:11:20+05:30 IST

వివిధ పథకాల అమలు కోసం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సొంత అవసరాలకు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట

నిధులు మళ్లించడానికి వీల్లేదు

  • ప్రతి పథకానికో నోడల్‌ ఏజెన్సీ.. ప్రత్యేకంగా ఖాతా
  • 40 రోజుల్లో రాష్ట్రం తన వాటా సొమ్ము జమ చేయాలి 
  • కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు కొత్త నిబంధనలు


న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వివిధ పథకాల అమలు కోసం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సొంత అవసరాలకు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించి నిధులు, విడుదల, వినియోగానికి కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం కొత్త నిబంధనలు రూపొందించింది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. నిధుల విడుదల ఇకపై కఠినతరంకానుంది. నిబంధనల ప్రకారం... ప్రతి కేంద్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీని నియమించాలి.


ప్రతి పథకానికీ ప్రత్యేకంగా వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాను తెరవాలి. ఈ ఖాతాలకు నేరుగాకాకుండా రిజర్వు బ్యాంకులోని రాష్ట్రాల ఖాతాలో కేంద్రం తన వాటా నిధులను జమ చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల్లో ఆ నిధులను నోడల్‌ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి. కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఆ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలో జమ అయిన నిధులను ఆ ఒక్క పథకం అమలుకు తప్ప మరే ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టం చేశాయి. వడ్డీల కోసం నిధులను వినియోగించుకోకుండా రాష్ట్రాలు అలాగే ఉంచుతున్న ఉదంతాలున్నాయని కేంద్ర ఆర్థిక శాఖవర్గాలు పేర్కొంటున్నాయి. 


ఈ నేపథ్యంలో నోడల్‌ ఏజెన్సీ ఖాతా నుంచి ఇతర ఖాతాలకు లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, టర్మ్‌ డిపాజిట్లకు, కార్పొరేట్‌ ఫండ్‌కు మళ్లించడాన్ని ఆర్థిక శాఖ నిషేధించింది. సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలోని సొమ్ముతో వచ్చే వడ్డీలను భారత సంచిత నిధిలో జమ చేయాలని సూచించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు నిధుల విడుదలలోనూ ఆర్థిక శాఖ మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత తొలుత 25 శాతానికి మించి నిధులు ఇవ్వొవద్దని స్పష్టం చేసింది.


కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు రాష్ట్రాలు విడుదల చేసే వాటాతో కలిపి కనీసం 75 శాతం నిధులు ఖర్చు చేస్తేనే తదుపరి 25 శాతం వారీగా నిఽధులు ఇవ్వాలని సూచించింది. కేంద్రం దాదాపు 30 పథకాలు అమలు చేస్తుండగా.. ఉపాధి హామీ పథకం, మధ్యాహ్న భోజన పథకం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, జాతీయ జీవనోపాధి మిషన్‌, ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్‌ పథకం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ వంటివి ప్రధాన మైనవి.


ఖాతాలు పీఎ్‌ఫఎంఎ్‌సకు అనుసంధానం

పథకాలకిస్తున్న నిధుల నిర్వహణ, ఆ నిధులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వంలోని పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎ్‌ఫఎంఎ్‌స)కు నోడల్‌ ఏజెన్సీ ఖాతాలను అనుసంధానం చేయనున్నారు. దీంతో రోజువారీగా కేంద్రానికి వ్యయాలపై లెక్కలు అందుతాయి. పథకాల అమలుపై ప్రతి నెల సమీక్షించాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆర్థిక శాఖ నిర్ధేశించింది.


Updated Date - 2021-04-01T07:11:20+05:30 IST