అంగన్‌వాడీ కేంద్రాలు మరింత మెరుగు

ABN , First Publish Date - 2021-12-04T05:49:59+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అంగన్‌వాడీ కేంద్రాలు మరింత మెరుగు
మంథనిలో శిక్షణ పొందుతున్న అంగన్‌వాడీ టీచర్లు

- సులువు కానున్న టీచర్ల సేవలు

- త్వరలో టీచర్లకు 4జీ సెల్‌ఫోన్లు

- ఎప్పటికప్పుడు వివరాల నమోదు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఇతరత్రా పనులను సులువుగా చేసేందుకు వీలుగా టీచర్లకు 4జీ సెల్‌ఫోన్లను అందించేందుకు ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. మాన్యువల్‌గా గాకుండా వాళ్లు రోజువారీగా చేసే పనులకు సంబంధించిన అన్ని వివరాలను ఈ ఫోన్లలోనే నమోదు చేయాల్సి ఉంటుంది. కాగితాలపై వివరాలను రాసి సూపర్‌వైజర్లకు పంపించాల్సిన అవసరం ఇకనుంచి ఉండదు. అలాగే వాళ్లు ప్రతిరోజు కేంద్రానికి వెళుతున్నారా, లేదా అని ఉన్నతాధికారులకు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. టీచర్లు ఖచ్చితంగా కేంద్రంలోనే ఉండి వివరాలను సెల్‌ఫోన్‌లోని యాప్‌లో నమోదు చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

జిల్లాలో 706 కేంద్రాలు..

జిల్లాలో 701 అంగన్‌వాడీ కేంద్రాలు, 5 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో 300 అంగన్‌వాడీ కేంద్రాలు, 5 మినీ కేంద్రాలున్నాయి. మంథని ప్రాజెక్టులో 196, రామగుండం ప్రాజెక్టులో 205 కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక టీచర్‌, ఒక ఆయా ఉంటారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతో ప్రాథమిక విద్యను అందిస్తారు. అలాగే బాలింతలు, గర్భిణులకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తుంటారు. అంగన్‌వాడీ కేంద్రాలను క్రమేణా డిజిటలైజేషన్‌ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు ఆరు రకాల సేవలకు సంబంధించి రికార్డుల్లో రాసేవారు. ఆ రికార్డును సూపర్‌వైజర్లకు, వాళ్లు సీడీపీఓలకు, అక్కడినుంచి జిల్లా సంక్షేమ అధికారికి పంపించే వాళ్లు. ఇక నుంచి అలాగాకుండా టీచర్లకు అందించే 4జీ సెల్‌ఫోన్లలో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్‌వాడీ కేంద్రాలన్నింటికీ గత ఏడాది జియోట్యాగింగ్‌ చేశారు. దీంతో ఏ కేంద్రం ఎక్కడ ఉందో సెల్‌ఫోన్‌ ద్వారా తెలిసిపోతుంది. టీచర్లకు అందించే సెల్‌ఫోన్లకు ప్రత్యేక కోడ్‌ నంబర్లను ఇచ్చారు. ఆ నంబర్ల ఆధారంగానే ఆయా కేంద్రాల టీచర్లకు సెల్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఫోన్లలో ఆరు రకాల సేవలను నమోదు చేస్తుంటారు. తల్లీపిల్లలకు అనుబంధ పోషకాహారం అందజేయడం, చిన్నారులు పాఠశాలకు వెళ్లేలా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక శిక్షణ ఇవ్వడం, సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య అవగాహన కల్పించడం, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్‌ ఆహారం అందించడంతో పాటు అవగాహన పెంపొందించడం, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వారిని ఉన్నత వైద్యశాలకు పంపించే వివరాలను  ఎంపీఆర్‌ (మంత్లీ ప్రొగ్రెస్‌ రిపోర్టు), ఎఫ్‌సీఆర్‌(ఫుడ్‌ కన్సాలిడేషన్‌ రిపోర్టు)ను అధికారులకు పంపుతారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సెల్‌ఫోన్లు ప్రాజెక్టు కార్యాలయాలకు చేరాయి. వాటిని టీచర్లకు పంపిణీ చేయాల్సి ఉన్నది. వాటి నిర్వహణపై టీచర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయించాలని అధికారులు భావించినప్పటికీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్‌ వల్ల నిలిపివేశారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారులు వారికి నేరుగా అందించనున్నారని సమాచారం. 

Updated Date - 2021-12-04T05:49:59+05:30 IST