Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డు స్ఫూర్తితో మరింత ముందుకు

సిద్దిపేట టౌన్‌, నవంబరు 27: స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్దామని సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలో విపంచి కళానిలయంలో స్వచ్ఛసర్వేక్షణ్‌లో జాతీయ అవార్డు సాధించినందుకు సిబ్బందితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీకి అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇదే తరహాలో కార్మికులు సహకారం అందించాలని కోరారు. మున్సిపల్‌ కార్మికులకు, పాలకవర్గం, అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల కృషి అభినందనీయమని, వారి శ్రమకు తగిన గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రతిజ్ఞ చేశారు.


వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలి 

 సిద్దిపేట పట్టణంలోని 1, 2వ వార్డుల్లో సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి శనివారం పర్యటించారు.  ఆయా వార్డు కౌన్సిలర్లు విజేందర్‌రెడ్డి, నాయిని చంద్రంలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనర్‌ మాట్లాడుతూ.. ఈ వార్డుల్లో సీసీ రోడ్లు వేయించాలని,  మురికి కాలువలు నిర్మించాలని సిబ్బందిని ఆదేశించారు. 


విద్యార్థులను భాగస్వాములుగా చేయాలి

గజ్వేల్‌, నవంబరు 27: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విద్యార్థులను భాగస్వాములుగా చేయాలని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, కమిషనర్‌ వెంకటగోపాల్‌ పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్‌లతో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతలో మున్సిపాలిటీని ముందు వరుసలో నిలిపేందుకు విద్యార్థినీ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement
Advertisement