‘బీమా’కు ‘ఫ్యూచర్’ గుడ్‌బై...

ABN , First Publish Date - 2022-01-28T20:31:43+05:30 IST

బీమా వ్యాపారానికి ఫ్యూచర్ గ్రూప్ స్వస్తి చెప్పింది. భారీ రుణభారంతో కుంగిపోయిన ఫ్యూచర్ గ్రూప్... వాటిని తీర్చే మార్గాల కోసం వెదుకుతోంది.

‘బీమా’కు ‘ఫ్యూచర్’ గుడ్‌బై...

అప్పుల తిప్పలు తీర్చే క్రమంలో... 

25 % వాటాను రూ. 1,252 కోట్లకు విక్రయించే దిశగా...

హైదరాబాద్ : బీమా వ్యాపారానికి ఫ్యూచర్ గ్రూప్ స్వస్తి చెప్పింది. భారీ రుణభారంతో కుంగిపోయిన ఫ్యూచర్ గ్రూప్... వాటిని తీర్చే మార్గాల కోసం వెదుకుతోంది. రుణదాతలకు చెల్లించాల్సిన నిధుల   కోసం, జనరెలి ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ అయిన ఫ్యూచర్ గ్రూప్... జనరల్లి ఇండియా ఇన్సూరెన్స్‌లో 25 % వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఇటలీకి చెందిన జేవీ పార్ట్‌నర్‌ జనరెలి ఇన్సూరెన్స్ గ్రూపునకు 25 % వాటాను రూ. 1,252 కోట్లకు విక్రయించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు వినవస్తోంది.


ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ మార్చిలో దాదాపు రూ. 2,200 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక... వాటా అమ్మకం తర్వాత... ఫ్యూచర్ గ్రూప్ వాటా 51 % నుంచి 26 % కు తగ్గనుంది. జెనరలి వాటా 74 శాతానికి పెరగనుంది. బీమా జేవీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి అనుమతించిన గరిష్ట పరిమితి ఇది. అంటే, దీనికి మించి ఒక్క వాటాను కూడా జెనరాలి పెంచుకోవడం సాధ్యపడదు. ఇక... సాధారణ బీమా జేవీలో మిగిలిన తన  26డ % వాటాను విక్రయించడానికి కూడా ఫ్యూచర్‌ గ్రూప్‌ నిర్ణయించింది. ఈ స్టేక్‌ కొనే ఇండియన్‌ కంపెనీ కోసం ప్రస్తుతం అణ్వేషిస్తోంది. 


ఇటాలియన్ గ్రూప్‌తో కలిసి రెండు జేవీలను ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ నడుపుతున్న విషయం తెలిసిందే. వీటిలో... ఒకటి.. సాధారణ బీమా బిజినెస్ కాగా‌, రెండోది జీవిత బీమా బిజినెస్‌. రెండో దాంట్లో ఫ్యూచర్ గ్రూపునకు ప్రస్తుతం 33 % వాటా ఉంది. ఈ మొత్తం 33 % వాటాను విక్రయించేందుకు కూడా ఫ్యూచర్ గ్రూప్ వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. బీమా వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా రూ. 3 వేల కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. 

Updated Date - 2022-01-28T20:31:43+05:30 IST