చైనాకు చెక్‌ పెట్టాల్సిందే

ABN , First Publish Date - 2021-06-14T07:36:25+05:30 IST

అధికార కాంక్షతో, ప్రపంచ నాయకత్వానికి తహతహలాడుతున్న చైనాకు చెక్‌ పెట్టాల్సిందేనని జీ7 దేశాల అధినేతలు తీర్మానించారు. కరోనా వైరస్‌ వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయిందనే...

చైనాకు చెక్‌ పెట్టాల్సిందే

  • కరోనా లీక్‌ అయ్యింది వూహాన్‌ ల్యాబ్‌ నుంచే!
  • చైనా వైరస్‌నిస్తే.. మనం వ్యాక్సిన్‌ అందిద్దాం
  • పేద దేశాలకు 100 కోట్ల డోసుల టీకాలు
  • పర్యావరణ పరిరక్షణకు నిధులను అందజేద్దాం
  • అందుకోసం.. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను విధిద్దాం
  • జీ7 దేశాల అధినేతల ఏకగ్రీవ తీర్మానం
  • కూటములతో ప్రపంచాన్ని శాసించలేరు: చైనా


లండన్‌, జూన్‌ 13: అధికార కాంక్షతో, ప్రపంచ నాయకత్వానికి తహతహలాడుతున్న చైనాకు చెక్‌ పెట్టాల్సిందేనని జీ7 దేశాల అధినేతలు తీర్మానించారు. కరోనా వైరస్‌ వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయిందనే అంశంపైనా సుదీర్ఘం గా చర్చలు జరిపారు. కరోనా మూలాలను శోధించాల్సిందేనని నిర్ణయించారు. దీనిపై ఐక్యరాజ్య సమితి, బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌ ఇచ్చిన నివేదికలపై చర్చించారు. ఇంగ్లండ్‌లోని కార్నివాల్‌ తీరంలో 3 రోజుల పాటు జరిగిన జీ7 సమ్మిట్‌ ఆదివారం ముగిసింది. ఇందులో జీ7 దేశాలు ప్రత్యక్షంగా పాల్గొనగా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా హాజరయ్యాయి. కరోనా నేపథ్యంలో ప్రపంచ పునర్నిర్మాణం, వాతావరణ మార్పులను అడ్డుకునే చర్యలపై జరిగిన ఈ సమ్మిట్‌లో ప్రధానంగా చైనాపైనే అగ్రనేతలు చర్చలు జరిపారు. సామ్రాజ్య కాంక్షతో ముం దుకు పోతున్న చైనా మార్కెటేతర ఆర్థిక విధానాలను తీవ్రం గా వ్యతిరేకించారు. ఈ విధానంలో నిజాయితీ, పారదర్శకత లోపిస్తున్నాయని దుయ్యబట్టారు. చైనాలో హక్కుల ఖననాన్ని ఖండించారు. జిన్‌జియాంగ్‌లో వుయ్‌ఘర్‌ ముస్లింలపై జరుగుతున్న హింసాకాండపైనా స్పందించారు. 

ఆ ప్రాంతంలో స్వేచ్ఛకు కృషి చేయాలని నిర్ణయించారు. స్వయం ప్రతిపత్తిగల హాంకాంగ్‌ నగరంపైనా చైనా పెత్తనాన్ని నిలదీస్తామన్నా రు. ప్రపంచానికి చైనా కరోనా వైర్‌సను అందిస్తే.. జీ7 దేశాలు వ్యాక్సిన్‌ ఇవ్వాలని తీర్మానించారు. పేద దేశాలకు 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందజేస్తామని ప్రకటించారు. అందులో అమెరికా వాటా 50 కోట్ల డోసులు కాగా.. బ్రిటన్‌ 10కోట్ల ఆస్ట్రాజెనెకా డోసులు అందజేస్తామని తెలిపింది. కరోనాపై అంతర్జాతీయ సహకారానికి సిద్ధమని ఈ సమ్మిట్‌ ప్రకటించింది. పేద దేశాలపై పెత్తనానికి చైనా వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకోవాలని.. ‘రోడ్‌ అండ్‌ బెల్ట్‌’తో ఆయా దేశాలకు డ్రాగన్‌ ఎరవేస్తోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించే క్రమంలో ఆఫ్రికా దేశాల్లో రైల్వేల అభివృద్ధి, ఆసియా దేశాల్లో పవన విద్యుత్తుకు ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది. ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణకు కంకణబద్ధమై పనిచేస్తామని తెలిపింది. అలాగని.. తమ సిద్ధాంతాలను బలవంతంగా ఆయా దేశాలపై రుద్దమని పేర్కొం ది. 2050 కల్లా కర్బన ఉద్గారాలను పూర్తి స్థాయిలో తగ్గించాలని తీర్మానించింది. కర్బన ఉద్గారాలను తగ్గించేలా పేద దేశాలకు ఆర్థిక సాయం అందించేందుకు పన్ను మినహాయింపుల నుంచి బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లను తొలగించాలని నిర్ణయించారు. వాటికి కనిష్ఠంగా 15ు పన్ను విధించి ఆ నిధులను పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని సూచించారు. చైనాతో ఆర్థికంగా పోటీపడాలని ఇతర ప్రజాస్వామ్య దేశాలకు పిలుపునిచ్చింది. 


ఇతర ముఖ్యాంశాలు

 భవిష్యత్తులో మహమ్మారులను ఎదుర్కొనేందుకు రాడార్‌ ఏర్పాటు, కొత్త వైర్‌సల గుర్తింపు వ్యవస్థ. అవి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకునే యంత్రాంగం ఏర్పాటుపై జీ7 తీర్మానించింది.

 ప్రపంచంలో ప్రతి చిన్నారి చదువుకునేలా సహకారాని కి ప్రతినబూనింది. నిధుల సమీకరణకు పంచవర్ష ప్రణాళిక ను నిర్ణయించుకోగా.. అమెరికా తన వాటాగా 43 కోట్ల బ్రిటన్‌ పౌండ్లు ఇస్తామని ప్రకటించింది.

 ప్రపంచ కర్బన ఉద్గారాల విడుద లో జీ7 దేశాల వాటా 20ుగా ఉందని, దీన్ని వీలైనంతగా తగ్గించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


భారత్‌ తటస్థ మిత్రపక్షం: మోదీ

జీ7లో భారత్‌ తటస్థ మిత్రపక్షమని ప్రధాని మోదీ చెప్పారు. ఆదివారం ఆయన జీ7 సమ్మిట్‌ రెండు సెషన్లలో వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘భారత్‌ ఒక ప్రజాస్వామ్య దేశం. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు కట్టుబడి ఉంటుంది. అధికారవాదం, ఉగ్రవాదం, తీవ్రవాదాలకు మేము వ్యతిరేకం’’ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌పై మేధోహక్కులు కూడదని పునరుద్ఘాటించారు. టెక్‌ సంస్థలు ఆరోగ్యకర సైబర్‌ స్పేస్‌ను సృష్టించాలన్నారు.


సమ్మిట్‌పై చైనా రుసరుసలు

అత్యంత శక్తిమంతమైన దేశాల కూటమి జీ7పై డ్రాగన్‌ దేశం చైనా ఎప్పటిలాగే రుసరుసలాడింది. మూడు రోజుల సమ్మిట్‌ లో తమనే టార్గెట్‌ చేసుకోవడాన్ని పరోక్షంగా తప్పుబట్టింది. ‘‘చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయింది’’ అని వ్యాఖ్యానించింది. చైనా ఆధిపత్యానికి కళ్లెం వేయాలని జీ7 దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో పై విధంగా స్పందించింది. చిన్నకూటములు ప్రపంచ దేశాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే రోజులు ఎప్పుడో పోయాయని, కాలం చెల్లిన సామ్రాజ్య వాద ధోరణిని ఆయా దేశాలు ఇంకా పట్టుకుని వేళాడుతున్నాయంటూ లండన్‌ లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. చిన్న-పెద్ద, బలమైన-బలహీనమైన, పేద-ధనిక దేశాలన్నింటినీ చైనా సమాన దృష్టితో చూస్తుందని పేర్కొంది.


ఆరు ప్రధాన తీర్మానాలు

  1. కరోనా మహమ్మారి అంతు చూడడం
  2. కరోనా వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం
  3. భవిష్యత్‌ తరాల శ్రేయస్సు కోసం కార్యక్రమాలు
  4. విశ్వసనీయ వాణిజ్యానికి సంస్కరణలు
  5. హరిత విప్లవంతో భూగోళాన్ని పరిరక్షించడం
  6. పర్యావరణ మార్పులను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం

Updated Date - 2021-06-14T07:36:25+05:30 IST