భారత పరపతి రేటింగ్‌ ‘బీఏఏ 3’

ABN , First Publish Date - 2020-06-02T06:05:11+05:30 IST

మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ భారత పరపతి రేటింగ్‌ను ‘బీఏఏ 3’కి తగ్గించింది. ఇది కనిష్ఠ పెట్టుబడి గ్రేడ్‌ను ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు భారతదేశానికి చెందిన విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీలకు దీర్ఘకాలానికి ‘బీఏఏ 2’ రేటింగ్‌ అమలులో...

భారత పరపతి రేటింగ్‌ ‘బీఏఏ 3’

  • తగ్గించిన మూడీస్‌

న్యూఢిల్లీ: మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ భారత పరపతి రేటింగ్‌ను ‘బీఏఏ 3’కి తగ్గించింది. ఇది కనిష్ఠ పెట్టుబడి గ్రేడ్‌ను ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు భారతదేశానికి చెందిన విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీలకు దీర్ఘకాలానికి ‘బీఏఏ 2’ రేటింగ్‌ అమలులో ఉంది. వృద్ధిలో క్షీణత, దిగజారుతున్న ఆర్థిక స్థితి నేపథ్యంలో రిస్క్‌లను నివారించడానికి చేపట్టిన విధానాల అమలులో గల సవాళ్లను పరిగణనలోకి తీసుకుని స్థానిక కరెన్సీ సీనియర్‌ అన్‌ సెక్యూర్డ్‌ రేటింగ్‌ తగ్గించినట్టు మూడీస్‌ తెలిపింది. దీంతోపాటు స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్‌ను కూడా పి-2 నుంచి పి-3కి కుదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై నెగిటివ్‌ వైఖరిని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఈ నెగిటివ్‌ రేటింగ్‌ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ వ్యవస్థలో గత తీవ్రమైన ఒత్తిడికి దర్పణం పడుతుంది. మూడీస్‌ ప్రస్తుతం ప్రకటించిన అంచనాలకు భిన్నంగా ఆర్థికరంగంలో శక్తి మరింత తీవ్రమైన స్థాయిలో, దీర్ఘకాలం పాటు దిగజారేందుకు ఈ ఒత్తిడి కారణం అవుతుంది. జంక్‌ హోదా కన్నా బీఏఏ 3 రేటింగ్‌ ఒకే ఒక మెట్టు పైన ఉంటుంది. 2017 నవంబరులో 13 సంవత్సరాల విరామం అనంతరం భారత పరపతి రేటింగ్‌ను మూడీస్‌ సంస్థ బీఏఏ 3 నుంచి బీఏఏ 2కి పెంచింది. 


Updated Date - 2020-06-02T06:05:11+05:30 IST