‘రాజకీయ దురుద్దేశంతోనే జైలుకు పంపారు’

ABN , First Publish Date - 2022-01-12T17:56:36+05:30 IST

‘రాజకీయ దురుద్దేశంతోనే నన్ను జైలుకు పంపారు.. అకారణంగా బళ్లారి ప్రజలకు, ఊరికి దూరం చేశారు.. అది కాలం తీర్పు అనుకుంటాను.. నాకు తెలిసినంత వరకూ ఎవరికీ అన్యాయం చేయలేదు.. చిన్నతప్పు

‘రాజకీయ దురుద్దేశంతోనే జైలుకు పంపారు’

- బళ్లారిని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చదిద్దాలనుకున్నా 

- బీజేపీకి అఖండ మెజార్టీ సాధించా 

- జన్మదిన వేడుకల్లో మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి


బళ్లారి(కర్ణాటక): ‘రాజకీయ దురుద్దేశంతోనే నన్ను జైలుకు పంపారు.. అకారణంగా బళ్లారి ప్రజలకు, ఊరికి దూరం చేశారు.. అది కాలం తీర్పు అనుకుంటాను.. నాకు తెలిసినంత వరకూ ఎవరికీ అన్యాయం చేయలేదు.. చిన్నతప్పు కూడా చేయలేదు.. బహుశా గత జన్మలో చేసిన తప్పునకు ఇప్పుడు కొంతకాలం పశ్చాత్తాప పడ్డాను..’ అని కర్ణాటక మాజీ మంత్రి, గనుల అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. బళ్లారి జిల్లాను దేశంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలనేదే తన ఆశయం అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి 55వ జన్మదిన వేడుకలు బళ్లారిలో మంగళవారం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. బళ్లారిలోని ఏపీఎంసీ మార్కెట్‌ పక్కన ఉండే కాకర్లతోటలో బుడా అధ్యక్షుడు పీ పాలన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ 55 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో గాలి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాను బళ్లారి అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించానని, దేశంలోనే బళ్లారిని ఒక సుందర నగరంగా చూడాలని కలలు కన్నానన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, బళ్లారి నగరం చూట్టూ రింగ్‌రోడ్డు, నగరమంతా తారు, సీసీ రోడ్లు వేయాలని భావించానని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నపుడు అనేక అభివృద్ధి పనులు చేశానని, అపుడు చేసిన పనులేనని, తిరిగి బళ్లారిలో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదన్నారు. దక్షిణ భారతదేశంలోనే బీజేపీ అధికారంలోకి రావడానికి అవసరమయిన ఎమ్మెల్యేలను బళ్లారి జిల్లా నుంచి 10 స్థానాలకు 10 స్థానాలు గెలిపించి ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా బీజేపీకి బళ్లారిలో మంచి రోజులు వస్తాయని తెలిపారు. బుడా అధ్యక్షడు పాలన్న తన సోదరుల్లో ఒకడన్నారు. గతంలో బీజేపీ జెండా కట్టాడానికే కాకర్లతోటలో ఎవరూ ముందుకు రాని రోజుల్లో ఆయన ముందుకు వచ్చి పార్టీ జెండా కట్టారని కొనియాడారు. కార్యక్రమంలో వీరితో పాటు మాజీ ఎంపీ శాంత, నాయకులు దివాకర్‌, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.


గాలి జనార్దన్‌రెడ్డికి కనకం.. కాసులతో తులాభారం

మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి తన జన్మదినం రోజు మరోసారి ప్రజల్లో చర్చకు వచ్చారు. ఆయన తన 55వ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం బళ్లారి దుర్గామాత ఆలయంలో తులాభారం తూగారు. ఆయన అభిమాని, బుడా అధ్యక్షుడు పీ పాలన్న గాలి జనార్దన్‌రెడ్డి పూర్తిస్థాయిలో బళ్లారిలో ఉండేలా కోర్టు తీర్పు వస్తే దుర్గామాతకు ఆయన తూకం కానుకలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఈ మేరకు గాలి జనార్దన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బంగారు నాణేలు, వెండినాణేలు, రూ. 10 నాణేలు, కొన్ని మాణిక్యాలు, ధాన్యాలతో కలిపి తులాభారం అమ్మవారికి సమర్పించారు. ఆయన సతీమణి గాలి అరుణ, తనయుడు కీర్తిరెడ్డి, సోదరుడు, బళ్లారి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన కుమారుడు కీర్తిరెడ్డి సినీహీరో అవుతున్నాడని తెలిపారు. ఇప్పటికే కీర్తిరెడ్డి తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడని వివరించారు. 

Updated Date - 2022-01-12T17:56:36+05:30 IST