ఇంకా సీమాంధ్రుల చేతుల్లోనే Tollywood ఇండస్ట్రీ.. విభజించాల్సిందే..!

ABN , First Publish Date - 2021-10-26T12:07:18+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా సినిమా రంగం కొందరు సీమాంధ్రుల..

ఇంకా సీమాంధ్రుల చేతుల్లోనే Tollywood ఇండస్ట్రీ.. విభజించాల్సిందే..!

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా సినిమా రంగం కొందరు సీమాంధ్రుల చేతుల్లో కొనసాగుతోందని ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. కొన్ని కులాల వారే సినిమా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. విభజన చట్టం ప్రకారం సినిమా రంగం కూడా విడిపోవాలని  డిమాండ్‌  చేశారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ టీవీ ఫిలిం డెవల‌ప్మెంట్‌ జేఏసీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం తెలంగాణ కళాకారులకు 48 శాతం వాటా దక్కాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా రంగానికి స్థలం, ఇళ్లు ఇతర రాయితీలు ఇచ్చాయని, ఇందులో తెలంగాణ సినీ కళాకారులు, కార్మికులకు తగిన వాటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రకు చెందిన కొందరు పెద్ద దర్శకులు, హీరోలు, నిర్మాతలు సినిమా హాల్స్‌ను వారి చేత్లులో పెట్టుకుని సామాన్య కళాకారులు, హీరోలకు తగిన గుర్తింపు ఇవ్వకుండా, వారి సినిమాలు విడుదల కాకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రపురిలో కేటాయించిన ఇళ్లల్లో వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు. మా అసోసియేషన్‌తో పేద కళాకారులు, కార్మికులకు ఒరిగిందేమీ లేదన్నారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ మురళీధర్‌దేశ్‌పాండే, సుంకరి సత్యనారాయణ, మేకల శ్రీనివాస్‌, మాధురి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-26T12:07:18+05:30 IST