చెన్నైకు అమరరాజా తరలింపు వదంతి మాత్రమే: గల్లా జయదేవ్

ABN , First Publish Date - 2021-08-14T00:19:07+05:30 IST

చెన్నైకు అమరరాజా తరలింపు అనేది వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు.

చెన్నైకు అమరరాజా తరలింపు వదంతి మాత్రమే: గల్లా జయదేవ్

చిత్తూరు: చెన్నైకు అమరరాజా తరలింపు అనేది వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటామని చెప్పారు. గత నెల రోజులుగా పత్రికలు, చానళ్లలో ఒక వార్త వస్తోందని, మంచైనా చెడైనా ఇంతవరకూ దానిపై తాము స్పందించలేదని తెలిపారు. విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతామని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం తర్వాత స్పందిస్తామని గల్లా జయదేవ్‌ వివరించారు. 


జగన్‌ సర్కారు ‘రాజకీయ కక్ష’ను భరించలేక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరిగింది. పరిస్థితి మారకపోతే, మరింతగా దిగజారితే మొత్తం ప్లాంటును మరో రాష్ట్రానికి తరలించక తప్పదని భావించినట్లు సమాచారం. అమరరాజా బ్యాటరీస్‌ మూసివేతకు ఏపీ సర్కారు కంకణం కట్టుకున్నట్లు బయటకి పొక్కడంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ నుంచి గల్లా జయదేవ్‌కు వర్తమానం వచ్చినట్లు తెలిసింది. ‘‘మధ్యవర్తులు ఎవరూ అక్కరలేదు. మీకు అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా రాష్ట్రానికి రండి. అన్ని వసతులు కల్పిస్తాం. ఇప్పుడు మీకున్న సదుపాయాలకంటే ఎక్కువే ఇస్తాం. ఇక మీదే ఆలస్యం’’ అని స్టాలిన్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది.


అమరరాజా తరలింపుపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే

అమరరాజా బ్యాటరీస్‌ చిత్తూరు జిల్లా నుంచో, రాష్ట్రం నుంచో వెళ్లిపోవాలని కోరుకోవడంలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రానికి ఆర్థికంగా లాభం చేకూర్చి, ఎందరో నిరుద్యోగులకు ఉపాధి చూపే పరిశ్రమలు ఇక్కడే ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రభుత్వ నిబంధనలను పరిశ్రమలు పాటించాల్సిన అవసరం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-14T00:19:07+05:30 IST