అందుకే మ్యాక్స్‌వెల్‌ను అందరూ వదిలేస్తున్నారు: గంభీర్

ABN , First Publish Date - 2021-04-07T19:37:37+05:30 IST

మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ పదునైన వ్యాఖ్యలు చేశాడు.

అందుకే మ్యాక్స్‌వెల్‌ను అందరూ వదిలేస్తున్నారు: గంభీర్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ పదునైన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తరఫున బరిలోకి దిగినపుడు అదరగొట్టే మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడని, అందుకే అన్ని ఫ్రాంఛైజీలు అతడిని వదిలేస్తున్నాయని విమర్శించాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మ్యాక్స్‌వెల్ గురించి గంభీర్‌ మాట్లాడాడు. 


`మ్యాక్స్‌వెల్‌పై ఆర్‌సీబీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నిజానికి మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం దండగ. 2014 మినహా ఏ ఐపీఎల్‌ సీజన్‌లోనూ మ్యాక్సీ మంచి ప్రదర్శన చేయలేదు. అందుకే అతణ్ని అన్ని ఫ్రాంఛైజీలు వదులుకుంటున్నాయి. అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగానే ఏడాదికో ఫ్రాంఛైజీ మారుతున్నాడు. అతను ఆసీస్‌ జట్టుతో పాటు అక్కడి లీగ్‌ల్లో మాత్రమే బాగా ఆడుతాడు. దాంతో కొన్ని ఫ్రాంఛైజీలు భారీ ధర చెల్లించి అతడిని దక్కించుకుంటాయి. తీరా మైదానంలోకి దిగాక అతను పెద్దగా ఆకట్టుకోడు. ఈ విషయం తెలియక మ్యాక్సీని ఆర్‌సీబీ రూ.14.25 కోట్లు పెట్టి తీసుకుంది. మ్యాక్సీ తరహాలోనే విధ్వంసకర ఆటగాడైన ఆండ్రీ రసెల్‌ ఎప్పట్నుంచో కేకేఆర్‌కు మాత్రమే ఎందుకు ఆడుతున్నాడు. అతను ప్రతీ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టే కేకేఆర్‌ అతణ్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కనీసం ఈ సీజన్‌లోనైనా మ్యాక్సీ మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నాన`ని గంభీర్ చెప్పాడు. 

Updated Date - 2021-04-07T19:37:37+05:30 IST