కాలు దువ్విన కోళ్లు.. చేతులు మారిన కోట్లు

ABN , First Publish Date - 2022-01-17T06:45:19+05:30 IST

పండుగ మాటున కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి.

కాలు దువ్విన కోళ్లు.. చేతులు మారిన కోట్లు
అలంపురంలో జోరుగా కోడిపందేలు

యథేచ్ఛగా కోడి పందేలు.. జూద క్రీడలు

మేము సైతం అంటూ నిడమర్రులో కోడిపందేలాడిన మహిళలు

పలు చోట్ల పందేలను వీక్షించిన సినీ ప్రముఖులు

పండుగ మాటున కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి.  కోట్లాది రూపాయలు చేతులు మారాయి.  పలు చోట్ల సినీ, ఇతర ప్రముఖులు పందేలను వీక్షించారు. బరుల్లో జూద క్రీడలతో పాటు మద్యం ఏరులై పారింది. కొన్నిచోట్ల జరిగిన ఘర్షణల్లో   కత్తిపోటు ఘటనలు జరిగాయి. బరులపై పోలీసులు అక్కడక్కడా దాడులు జరిపినా పందెగాళ్లు తగ్గేదేలే అంటూ పందేలకు సై అన్నారు. 

నిడదవోలు, జనవరి 16 : నిడదవోలు పట్టణంతో పాటు, మండలంలో పండుగ మూడు రోజులు కోడి పందేలు జోరుగా సాగాయి. మద్యం ఏరులై పారింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీస్‌ అధికార్లు, సిబ్బంది మఫ్టీలో కోడి పందేలను వీక్షించేందుకు నిడదవోలు రావడం విశేషం. శింగ వరంలో కోడి పందేలను ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య వీక్షించా రు. ఆయనతో పాటు పలువురు సినీ సాంకేతిక నిపుణులు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారులు  విచ్చేసి కోడిపందేలను వీక్షించారు.

తణుకు: సంక్రాంతి సందర్భంగా మొదటి రెండు రోజులు కేవలం కోడి పందేలు మాత్రమే జరిగాయి. కనుమ నాడు అన్ని ఆటలకు అవకాశం రావ డంతో కొంత మేర ఊపందుకున్నాయి.  ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు పోలీసులు బరులు మూయించడంతో ఎక్కువ  సమయం పందేలు జరగలేదు.

ఇరగవరం: కె.ఇల్లిందలపర్రు, తూర్పువిప్పర్రు, ఓగిడి, అయినపర్రు, కత్తవపాడు, కావలిపురం, రేలంగి గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. సంక్రాంతి రోజున పోలీసుల దాడులతో గుండాట, పేకాట శిబిరాలు వెలవెల బోయాయి.  కనుమరోజు యథేచ్ఛగా సాగాయి. ఈ ఏడాది కరోనా ప్రభావం, సరైన రవాణా సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి కోడి పందేలను చూసేందుకు ప్రజలు తక్కువగా వచ్చారని పలువురు  చెబుతున్నారు.

అత్తిలి: కోడిపందేలు మూడో రోజూ కొనసాగాయి. గుమ్మంపాడు, అత్తిలి,  కేఎస్‌ గట్టు తదితర గ్రామాల్లో పందేల జోరు కొన సాగింది. గుమ్మంపాడులో పేకాట, గుండాట యథేచ్ఛగా సాగింది. బరులు కిటకిటలాడాయి. 

తాడేపల్లిగూడెం రూరల్‌: తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు, జూద క్రీడలతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. బరుల వద్ద జూదగాళ్లు రెచ్చిపోయారు. పడాల బరిలో పడాల, యాగర్లపల్లికి చెందిన యువకులు కత్తులతో దాడి చేసుకునే స్థాయికి ఘర్షణలు చోటు చేసుకున్నా యి. అదే విధంగా పలు బరుల్లో చెదురు మదురు ఘర్షణలు జరిగాయి. 

పెంటపాడు:  మండలంలో కోడి పందేలు జోరుగా సాగాయి.  పెంటపాడు, పడమరవిప్పర్రు, జట్లపాలెం, మీనవల్లూరు, బి. కొండేపాడు, అలంపురం, ప్రత్తిపాడు, దర్శిపర్రు గ్రామాల్లో  బరులు వెలిశాయి.  జూద క్రీడలు సాగాయి. లక్షల రూపాయలు చేతులు మారాయి. బరుల వద్ద మద్యం ఏరులై పారింది.

ఉంగుటూరు: కైకరం, నారాయణపురం, ఉంగుటూరు, బాదంపూడి, వెల్లమిల్లి తదితర గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.  లక్షలాది రూపాయలు చేతులు మారాయి.

కోడి పందేలాడిన మహిళలు..

నిడమర్రు :  మగువలు మగవారితో దేనిలోను తగ్గేదేలేదంటు న్నారు. అది కోడి పందెమైనా, పేకాటైనా తాము పాల్గొంటామంటూ ముందుకు వస్తున్నారు. సంక్రాంతి నాడు మందలపర్రు బరిలో మగువలు కోసం నిర్వా హకులు ప్రత్యేక సమయం కేటాయించడంతో స్థానిక మహిళలతో పాటు భీమవరం, హైదరాబాద్‌, బెంగుళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా  కోడిపందేలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  సుమారు 100 మంది మహిళలు కోడిపందేలలో పాల్గొని వేలల్లో పందేలు కాశారు. 



Updated Date - 2022-01-17T06:45:19+05:30 IST