Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 6 2021 @ 18:06PM

గాంధీ-అంబేద్కర్‌ల దేశం గాడ్సే దేశంగా మారుతుందేమో? ముఫ్తీ

న్యూఢిల్లీ: దేశ ప్రజలు మేల్కనకపోతే గాంధీ-అంబేద్కర్‌ల దేశం గాడ్సే దేశంగా మారే ప్రమాదం ఉందని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న పర్యవసానాలు, కశ్మీర్ పరిస్థితులపై దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ వద్ద సోమవారం ఆమె నిరసన చేపట్టారు. ‘గాయాల కశ్మీర్’ అనే ఫ్లకార్డు చేతపట్టి.. కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘కశ్మీర్ చెరసాలగా మారింది. ప్రజలకు గొంతు లేకుండా పోయింది. 2019 ఆగస్టున కశ్మీర్‌కు భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370 నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఇక్కడి ప్రజలు ఎన్నో నిర్భందాలు, దాడులు ఎదుర్కొంటున్నారు. కానీ డబ్బులు తీసుకుని ప్రచారం చేసే మీడియా ద్వారా కశ్మీర్ లోయలో అంతా బాగానే ఉన్నట్లు చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజానికి కశ్మీర్‌లో నిరసన చేసే అవకాశం కూడా లేదు. అందుకే నేను దేశ రాజధానికి వచ్చాను’’ అని ముఫ్తీ అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘నాగాలాండ్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు. 13 మంది అమాయక ప్రజలు చనిపోయారు. కశ్మీర్‌లో ఇలాంటివి జరగట్లేదని ఎందుకు అనుకోకూడదు? కశ్మీర్‌లో ఏదైనా ఎన్‌కౌంటర్ జరిగి తీవ్రవాదో, ఉగ్రవాదో చనిపోతే ఎవరూ ప్రశ్నించారు. కానీ, అవే ఎన్‌కౌంటర్లలో ప్రజలు చనిపోతే ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తారు. నేను ఇక్కడికి వచ్చింది ఈ దేశ ప్రజలకు ఒక ముఖ్య సందేశం ఇవ్వడానికి. మనం తొందరగా మేల్కొనాలి. లేదంటే మహాత్మా గాంధీ-బాబాసాహేబ్ అంబేద్కర్‌ల ఈ దేశం గాడ్సే దేశంగా వాళ్లు (బీజేపీ) మార్చేస్తారు’’ అని అన్నారు.

Advertisement
Advertisement