కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా గాంధీ

ABN , First Publish Date - 2020-03-27T10:58:42+05:30 IST

గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కరోనా బాధితులకు చికిత్స అదించేందుకే పరిమితం చేయాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ఇందులోని ఇతర విభాగాలను ఉస్మానియా, కింగ్‌ కోఠి ఆస్పత్రులకు

కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా గాంధీ

ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయండి...

మూడో దశ రాకుండా చర్యలు చేపట్టాలి

అత్యవసరమైతే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ చికిత్స

వైద్య సిబ్బందికి సెలవులు రద్దు: మంత్రి ఈటల


హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కరోనా బాధితులకు చికిత్స అదించేందుకే పరిమితం చేయాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ఇందులోని ఇతర విభాగాలను ఉస్మానియా, కింగ్‌ కోఠి ఆస్పత్రులకు తరలించాలని, నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వారు, ఆశ వర్కర్లు, ఇతర మెడికల్‌ సిబ్బందికి సెలవులు పూర్తిగా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి ఒకవేళ మూడో దశకు చేరితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై  వైద్య శాఖ ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగితే చికిత్స కోసం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రైవేటు ఆస్పత్రులనూ ఉపయోగించుకోవాలని, ఇందుకు సంబంధించిన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమయ్యే సిబ్బంది, వైద్య పరికరాలపైనా చర్చించారు. ముందుగా వైద్యుల కోసం స్వీయ రక్షణ కిట్స్‌ను సాధ్యమైనన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.


ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలోని కమిటీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించిన మంత్రి.. ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై, హోం క్వారంటైన్‌లో ఉన్న వారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి రెండో దశలోకి చేరుకుందని, 26వ తేదీ మధ్యాహ్నం వరకు 44 కేసులు నమోదైనట్లు తెలిపారు. అదృష్టవశాత్తు వీరిలో ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని వెల్లడించారు. వైరస్‌ సోకిన వారిలో ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్లు ఉన్నారని తెలిపారు. వీరిద్దరూ ఇటీవలే దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వచ్చారని చెప్పారు. వారిని కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.


వెంటిలేటర్ల తయారీకి అనుమతివ్వండి

వైద్యుల కోసం స్వీయ రక్షిత పరికరాలు, రోగుల కోసం వెంటిలేటర్స్‌, ఐసీయూ పరికరాలను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో, బీడీఎల్‌, ఈఎ్‌సఐ సంస్థల్లో తయారు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. వీలు కాని పరిస్థితుల్లో ఆ పరికరాలను రాష్ట్రానికి అందించాలని కోరారు. కరోనా వ్యాప్తి, అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌ నుంచి బయటికి రాకుండా చూడాలని కోరారు. అనంతరం ఈటల మాట్లాడుతూ మందులు, వైద్య పరికరాలు, నిత్యావసర వస్తువులు రాష్ట్రాల సరిహద్దులు దాటేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆయా వాహనాలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-27T10:58:42+05:30 IST