‘ఊపిరి’పోసిన గాంధీ

ABN , First Publish Date - 2021-03-06T07:06:47+05:30 IST

గాంధీ ఆస్పత్రికి 170 ఏళ్ల ఘన చరిత్ర ఉంది.

‘ఊపిరి’పోసిన గాంధీ

సివిల్‌ నుంచి కరోనా ఆస్పత్రి దాకా సుదీర్ఘ పయనం


35 వేల కరోనా బాధితుల డిశ్చార్జి

1851 నుంచి ఆస్పత్రి ప్రస్థానం 

170 ఏళ్లలో ఎందరికో సేవలు

20 పడకల నుంచి 1800 పడకల వరకూ అభివృద్ధి


హైదరాబాద్‌ సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రికి 170 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. సివిల్‌ ఆస్పత్రిగా, తర్వాత కంటోన్మెంట్‌ ఆస్పత్రిగా, అనంతరం బోధనాస్పత్రిగా, ఇప్పుడు కరోనా ఆస్పత్రిగా, మళ్లీ జనరల్‌, కరోనా వైద్య సేవల ద్వారా ఎందరికో ఊపిరి పోసింది. మొదటి సారి బైపాస్‌ సర్జరీ చేసిన ఘనత దక్కించుకున్న ఈ ఆస్పత్రి వేలాది మంది కరోనా బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. జబ్బు ఏంటో, చికిత్స ఎలా చేయాలో తెలియని రోజుల్లో కూ డా ఇక్కడ కరోనా బాధితులకు వైద్యం అందించారు. 


170 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు

1851లో ప్రారంభమైన గాంధీ ఆస్పత్రికి 170 ఏళ్లు. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించిం ది. గత సంవత్సరం గాంధీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కరోనా వైర్‌సకు చికిత్స అందించారు. ఆ ఆస్పత్రి ప్రస్థానంలో ఇది గొప్ప ముందడుగు. 1976లో మొదటి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ గాంధీ ఆస్పత్రిలోనే నిర్వహించారు. సుమారు వెయ్యి వరకూ గుండె శస్త్రచికిత్సలు చేశారు. 


35 వేల పాజిటివ్స్‌ డిశ్చార్జి

35 వేల మంది కరోనా బాధితులకు చికిత్సలు అందించిన ఘనత గాంధీ ఆస్పత్రికే దక్కింది. జీవితంపై ఆశలు వదులుకున్న ఎందరికో ఊపిరినిచ్చింది. రెండు వారాల నుంచి రెండు నెలలు, మూడు నెలల వరకు కొందరికి ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. రాష్ట్రంలో ఏ మూలన కరోనా సోకినా ఇక్కడికే వచ్చేవారు. దాదాపు ఏడాదిగా ఆస్పత్రిలో అనుమానితులు, పాజిటివ్స్‌కు చికిత్సలు అం దించారు. కరోనా వచ్చిన గర్భిణులకు పురుడు పోయాలంటే ఇక్కడికే తీసుకొచ్చేవారు. ప్రస్తుతం సా ధారణ రోగులతో పాటు కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. 


1800 పడకలు 

తొలినాళ్లలో కొన్ని నెలల పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు చేయలేదు. అందరికీ  ఏకైక ఆస్పత్రి గాంధీనే. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో పడకల స్థాయిని 1800 వరకూ పెంచారు. వేలాది మంది బాధితులు వస్తుండడంతో అవి కూడా సరిపోయేవి కావు. మొదట్లో చికిత్స పూర్తయిన రోగులకు రెండు సార్లు నిర్ధారణ పరీక్ష చేయాల్సి వచ్చేది. ఒకసారి నెగెటివ్‌, మరోసారి పాజిటివ్‌ వస్తే డిశ్చార్జి చేసేవారు కాదు. అలాంటి వారు కొందరు రెండు, మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందేవారు. రోగుల తాకిడి పెరగడంతో గతేడాది జూన్‌ 29న ఆస్పత్రిలో ప్రతీ ఒక్క మంచంపై పాజిటివ్‌ బాధితుడు ఉన్నాడు. బాధితులకు వైద్యంతో పాటు పౌష్టికాహారం ఇచ్చేవారు. రంజాన్‌ సమయంలో ఉపవాసం పాటించే రోగులకు ప్రత్యేక ఆహారం అందించారు. ఓ వైపు చికిత్సలు అందిస్తూనే, మరో వైపు పారిశుధ్య కార్మికులు, పీజీ విద్యార్థులు, నర్సుల ఆందోళనలను ఎదుర్కొంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 103 ఏళ్ల వ్యక్తి వరకూ గాంధీలో కరోనా చికిత్స అందించారు. మధుమేహం, గుం డె జబ్బులు, అవయవమార్పిడిలు, కాలేయం, కిడ్నీ బాధితులు, ఊపిరిత్తుల సమస్యలతో ఇబ్బంది పడే వారికి వైద్యం చేశారు. 


కరోనా వైద్య సేవలు ఇలా....

మార్చి 2న మొదటి కొవిడ్‌ కేసు నమోదు

21న నోడల్‌ కేంద్రంగా గాంధీ ఆస్పత్రి 

నాటి నుంచి నేటి వరకు 35 వేల మంది డిశ్చార్జీ

ఐసీయూలో 7 వేల పడకల ఏర్పాటు 

7 వేల మందికి డయాలసిస్‌ 

కరోనా సోకిన 950 మంది గర్భిణులకు ప్రసవాలు 

800 మంది పిల్లలకు కూడా కరోనా చికిత్స. వారిలో 400 మంది నవజాత శిశువులు.

300 మంది బాధితులకు సర్జరీలు. 

కోమార్బిటి్‌సతో బాధపడుతున్న 6 వేల మందికి చికిత్స 

68 మంది గాంధీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 


మరణాలు తక్కువే

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితులలో మరణించిన వారు తక్కువ మందే ఉన్నారు. మొదట్లో ఒకరి తర్వాత మరొకరు చనిపోతుండడంతో వారిని బతికించడానికి వైద్యులు అనేక ప్రయత్నాలు చేశారు. బృందాలుగా కొత్త జబ్బుపై అనేక చర్చలు జరిపి కొత్త కొత్త వైద్య విధానాలతో మెరుగైన చికిత్సలు అందించారు. ఆస్పత్రిలో చేరిన కొందరు 30 రోజుల పాటు చికిత్సలు పొందిన తర్వాత చనిపోయారు. మధుమేహం, కేన్సర్‌, గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో పలువురు చనిపోయారు. అయినప్పటికీ 1.5 శాతం మంది మాత్రమే చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 


ఏసియాలోనే మొదటి ఆస్పత్రి భవనం

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఎనిమిది అంతస్తులతో 30 ఎకరాల విస్తీర్ణంలో ముషీరాబాద్‌ జైలు ఆవరణలో ఏర్పాటైంది. ఇది ఏసియాలోనే అత్యంత పెద్దదైన ఆస్పత్రిగా నిలిచింది. దాదా పు 25 స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ విభాగాలు ఆస్పత్రిలో ఉన్నాయి. కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్యం అందించడానికి వార్డులు, విభాగాలు ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ సర్జన్లు, హౌస్‌సర్జున్లు ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఇక్కడ అధునాతన వైద్య సంపత్తి ఉంది. 


ఆర్‌ఎంఓ క్వార్టర్‌లో వ్యాక్సిన్‌ కేంద్రం 

అడ్డగుట్ట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలోని 8వ అంతస్తులో కరోనా వ్యాక్సిన్‌ వేసేవారు. శుక్రవారం నుంచి ఆస్పత్రి ఆవరణలోని ఆర్‌ఎంఓ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు 8వ అంతస్తుకు రావడం కష్టతరం కావడంతో ఈ మార్పు చేసినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు.  

Updated Date - 2021-03-06T07:06:47+05:30 IST