గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ వార్డులో మేం పనిచేయలేం!

ABN , First Publish Date - 2020-03-27T13:04:42+05:30 IST

కోవిడ్‌ భయంతో గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఆయాలు, సెక్యూరిటీగార్డులు స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నారు...

గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ వార్డులో మేం పనిచేయలేం!

సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా సిబ్బంది ఫిర్యాదు 

హైదరాబాద్/అడ్డగుట్ట: కోవిడ్‌ భయంతో గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఆయాలు, సెక్యూరిటీగార్డులు స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నారు.... కరోనా వార్డులో పనిచేయలేమంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నర్సులు, ఆయాలు, పారిశుధ్య కార్మికులు అందరూ ఇబ్బందులు పడుతున్నాం.... కరోనారోగులకు 24 గంటలూ  సేవలందిస్తాం.... తమ జాగ్రత్తలకోసం ఎవరూ చెప్పడంలేదు. ఇంటికెళ్తే భర్త, పిల్లలతో భయం. బయటికొస్తే కాలనీవాసులకు భయపడాల్సి వస్తోంది. ఆస్పత్రిలో నర్సులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలి’ అని ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు ప్రభుత్వాన్ని డిమాండుచేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు గురువారం లిఖిత పూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. డ్యూటీ కోసం ఆస్పత్రికి వచ్చేందుకు తమ భర్తలు బైకులపై తీసుకొస్తున్నారని, వారు తిరిగెళ్తుంటే  పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ భర్తలకు రవా ణా పాసులు ఇవ్వాలని కోరుతున్నారు. 


పాడు బంగ్లాలో ఉండలేం..

గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆర్‌ఎంఓ1 క్వార్టర్‌లో ఉండాలని ఆదేశించారని తాము ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బది కోరుతున్నారు. అప్పుడే కరోనారోగులకు సేవలు చేస్తూ ఇంటికెళ్లకుండా ఈక్వార్టర్‌లోనే ఉంటామని వారు అభిప్రాయపడుతున్నారు.


డ్యూటీ షిఫ్టులు మార్చండి..

రోజూ కరోనా వైరస్‌ వార్డులో సేవలు చేయలేకపోతున్నామని, ప్రమాదకరమైన వార్డులో రెండు రోజులకోసారీ నర్సుల డ్యూటీలు మార్చితే బాగుంటుందని నర్సులు కోరుతున్నా రు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న తమకు సెలవులు ఇవ్వాలని ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్‌ నర్సులు కోరుతున్నారు. ఎంత జాగ్రత్త తీసుకున్నా భయంగా ఉంది. తాము కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని కొందరు నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ విషయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-03-27T13:04:42+05:30 IST