హిందూత్వపై గాంధీ పోరు

ABN , First Publish Date - 2022-01-29T09:14:37+05:30 IST

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తొలిరోజులవి. 1915 ఏప్రిల్‌లో ఆయన ఢిల్లీలోని సెయింట్. స్టీఫెన్స్ కళాశాలలో విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు...

హిందూత్వపై గాంధీ పోరు

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తొలిరోజులవి. 1915 ఏప్రిల్‌లో ఆయన ఢిల్లీలోని సెయింట్. స్టీఫెన్స్ కళాశాలలో విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. అప్పటికి కొద్ది వారాల క్రితం పూణేలో మరణించిన తన గురువు గోపాలకృష్ణ గోఖలే గురించి గాంధీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘గోఖలే హిందూ మతస్థుడు. అయితే ఉత్తమ ధార్మికుడు. ఒక హిందూ సన్యాసి ఆయన వద్దకు వచ్చి ముస్లింలను అణచివేసేలా హిందువుల రాజకీయ ఉన్నతికి కృషి చేయాలని ప్రతిపాదించారు. తన సూచనకు మద్దతుగా హిందూ మతపరమైన అనేక కారణాలను వెల్లడించారు. ఆ వ్యక్తికి గోఖలే ఇలా సమాధానమిచ్చారు: ‘‘ఒక హిందువుగా ఉండేందుకు మీరు కోరుతున్నవన్నీ నేను చేసి తీరవలసి వస్తే, దయచేసి ఈ గోఖలే హిందూ మతస్థుడు కాదని విదేశీ పత్రికలలో రాయండి’’.’


ఇరవయ్యో శతాబ్ది తొలి దశకాలలో కొంతమంది హిందూ రాజకీయవేత్తలతో పాటు పలువురు హిందూ మత పెద్దలు జన సంఖ్యాధిక్యత దృష్ట్యా భారతదేశ రాజకీయాలు, పరిపాలనలో ఆధిపత్య పాత్ర వహించేందుకు హిందువులకు హక్కు ఉందని వాదించారు. ఈ అభిప్రాయాన్ని గాంధీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన మార్గదర్శి గోఖలే వలే, గాంధీ కూడా భారత్‌ను ఒక హిందూ జాతిగా నిర్వచించేందుకు నిరాకరించారు. గోఖలే మాదిరిగానే గాంధీ సైతం హిందువులు, ముస్లింల మధ్య సామరస్య సేతువులను నిర్మించేందుకు నిరంతరం కృషి చేశారు. ఈ నిష్పాక్షిక వైఖరి, ప్రగాఢ మానవతా దృక్పథం హిందూ మత దురభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దేశ నాయకుడుగా గాంధీ ప్రజాజీవితం పొడుగునా ఆ మహాత్ముడిని వారు వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతిమంగా, 74 సంవత్సరాల క్రితం ఇదే వారం ఆయన్ని అంతమొందించారు.


హంతకుడు నాథూరామ్ గాడ్సేకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో 1940 దశకం తొలినాళ్ల నుంచి, 1948 జనవరి 30న గాంధీని హత్య చేసేంతవరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేందుకు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలను ధీరేంద్ర కె. ఝా ఇటీవల తన ‘గాంధీస్ అసాసిన్’ అన్న పుస్తకంలో సవివరంగా వెల్లడించారు. గాంధీ హత్యలో తమ ప్రమేయం ఏమీ లేదన్న సంఘీయుల వాదన సత్య శోధనలో నిలవదని ఆయన స్పష్టం చేశారు. సంఘ్‌తో గాడ్సేకు వ్యక్తిగత అనుబంధాలకు ఆవల ప్రగాఢ సైద్ధాంతిక సంబంధం ఉంది. ఈ దేశ రాజకీయ, సాంస్కృతిక జీవితంలో హిందువులకు మాత్రమే సర్వోన్నత స్థానం ఉండితీరాలన్న గాడ్సే వాదనతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాడు ఏకీభవించింది; నేడు సైతం సంపూర్ణంగా విశ్వసిస్తోంది. ముస్లింలు, క్రైస్తవుల కంటే హిందువులే మరింత స్వతస్సిద్ధ భారతీయులనే భావన స్ఫూర్తితో సంఘ్‌ పరివార్ ఆలోచనలు, ఆచరణలు సాగుతున్నాయి. ఇవి గాంధేయ చింతనకు, ఆచరణకు పూర్తిగా విరుద్ధమైనవి.


భారతదేశం హిందువులది మాత్రమే కాదని, అన్ని మతాల వారికీ దానిపై సమాన హక్కులు ఉన్నాయని గాంధీ విశ్వసించారు. ఆయన నైతిక దార్శనికత, రాజకీయ కార్యాచరణలో ఈ సమ్మిళిత భారత్ భావన సంపూర్ణంగా ప్రతిఫలించింది. ఆయన రాసిన ‘కాంగ్రెస్ నిర్మాణాత్మక కార్యక్రమం’ అనే ఒక చిన్న పుస్తకాన్ని ఈ సందర్భంగా పరిశీలించవలసి ఉంది. ‘మత సామరస్యమే’ కాంగ్రెస్ కార్యక్రమంలో మొదటి అంశమని 1945లో ప్రచురితమైన ఆ పుస్తకంలో మహాత్ముడు రాశారు. అంటరానితనం నిర్మూలన, ఖాదీ ప్రచారం, మహిళాభ్యున్నతి, ఆర్థిక సమానత్వ సాధన (ఇవి సైతం ఆయన ఔదలదాల్చిన లక్ష్యాలు, ఆదర్శాలు) మొదలైన వాటికి ‘మత సామరస్యం’ తరువాతే ప్రాధాన్యమివ్వాలని ఆయన పేర్కొన్నారు. గాంధీ ఇంకా ఇలా రాశారు: ‘మత సామరస్యాన్ని సాధించేందుకు ప్రతి కాంగ్రెస్‌వాది తన మతం ఏదైనప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్, యూదు తదితర మతాల ఉపదేశాలు, ఆచారాలకు సముచిత స్థానం కల్పించాలని’ ఆయన ఉద్బోధించారు. భారత్‌లో నివశిస్తున్న కోట్లాది ప్రజలలో ప్రతి ఒక్కరితో ప్రతి కాంగ్రెస్‌వాది తాదాత్మ్యత చెందాలి. ఇందుకు ప్రతి కాంగ్రెస్‌వాది తన స్వీయమతేతర వ్యక్తులతో వ్యక్తిగత స్నేహ సంబంధాలను కలిగివుండాలి. సొంత మతాన్ని గౌరవించిన విధంగానే ఇతర మతాలను గౌరవించడం తన విధ్యుక్త ధర్మంగా ప్రతి కాంగ్రెస్‌వాది భావించాలి’.


రెండు సంవత్సరాల అనంతరం బ్రిటిష్ ఇండియాను మత ప్రాతిపదికన రెండు దేశాలుగా విభజించడాన్ని నిరోధించడంలో మహాత్ముడు విఫలమయ్యారు. అయితే ఆయన నైరాశ్యంలో మునిగిపోలేదు. కర్మ వాదంతో సాంత్వన పొందడానికి ప్రయత్నించలేదు. పగ, ప్రతీకార భావాలను దరిచేరనివ్వలేదు. భారత్‌లో ఉండిపోవడానికి నిర్ణయించుకున్న ముస్లింలకు సమానహక్కులు, సమ పౌరసత్వాన్ని కల్పించేందుకు మహాత్ముడు తన సర్వశక్తులను వినియోగించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు 1947 సెప్టెంబర్‌లో కలకత్తాలోను, 1948 జనవరిలో ఢిల్లీలోను ఆయన నిరాహారదీక్షలు నిర్వహించారు. వీటి గురించి చాలామంది ఎంతో విస్తృతంగా రాశారు. ఇంతగా సుప్రసిద్ధం కాని, అయితే సమప్రాధాన్యం గలది మరొకటి ఉంది. అది, 1947 నవంబర్ 15న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇచ్చిన ఉపన్యాసం. ‘మీరందరూ కాంగ్రెస్ మౌలిక ధర్మాన్ని సత్యనిష్ఠతో పాటించాలి. హిందువులు, ముస్లింలను సమైక్యపరచాలి. కాంగ్రెస్ గత అరవై సంవత్సరాలుగా ఈ ఆదర్శానికి కట్టుబడి కృషి చేస్తోంది. హిందువుల ప్రయోజనాల కోమే తాను పాటుపడతానని కాంగ్రెస్ ఎన్నడూ చెప్పలేదు. కాంగ్రెస్ పుట్టిననాటి నుంచి ఔదలదాల్చిన ఆదర్శానికి భిన్నంగా మనం ఇప్పుడు వ్యవహరించడం పూర్తిగా అధర్మం. కాంగ్రెస్ సమస్త భారతీయుల సంస్థ. ఈ దేశంలో నివసిస్తున్న వారు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు ఎవరైనా సరే ఈ దేశంలో నివసిస్తున్న వారి పట్ల కాంగ్రెస్ ఎటువంటి భేదభావం చూపదు. అది ప్రతి ఒక్కరి పక్షాన నిలబడే సంస్థ’.


సర్వమత సమానత్వాన్ని విశ్వసించి, భారత్ సమస్త భారతీయులది అనే భావనను దేశ ప్రజలలో నెలకొల్పినందునే గాంధీని హతమార్చారు. గాంధీ మరణానంతరం తాము చేయవలసినదేమిటో చర్చించుకోవడానికి ఆయన అనుయాయులు సేవాగ్రాంలో సమావేశమయ్యారు. వారి చర్చలలో ఆరెస్సెస్ ప్రస్తావన ప్రముఖంగా చోటు చేసుకుంది. హంతకుడు గాడ్సే ఆ సంస్థ సభ్యుడు అనే కారణంతో కాకుండా సర్వసంఘ్ చాలక్ ఎమ్‌ఎస్ గోల్వాల్కర్, గాంధీ హత్యకు ముందు రోజుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఆ గాంధేయుల సమాలోచనల్లో సంఘ్ ప్రస్తావన అనివార్యమయింది. 1948 మార్చిలో జరిగిన ఆ సమావేశంలో వినోబా భావే మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంపూర్ణంగా ఫాసిస్ట్ స్వభావంతో వ్యవహరించే సంస్థ అని విమర్శించారు. ‘సంఘ్ సభ్యులు ఇతరులను విశ్వాసంలోకి తీసుకోరు. గాంధీజీ సూత్రం సత్యం. సంఘీయుల సూత్రం అసత్యంగా కనిపిస్తుంది. ఈ అసత్యమే వారి తాత్త్వికత, కార్యాచరణకు ప్రాతిపదికగా ఉన్నదని’ వినోబా భావే అన్నారు. గాంధీ నాయకత్వంలోని జాతీయోద్యమానికి, హిందూత్వ భావజాల ప్రతిపాదకుల మధ్య ఉన్న తేడాను వినోబా ఇలా విశదీకరించారు: ‘ఆరెస్సెస్ పద్ధతులు మన పద్ధతులకు పూర్తిగా విరుద్ధమైనవి. దేశ స్వాతంత్ర్యం కోసం మనం జైలుకు వెళ్ళినప్పుడు వారు సైన్యంలోనూ, పోలీసు విభాగంలోనూ చేరారు. హిందువులు–ముస్లింల మధ్య అల్లర్లు జరగడానికి ఎక్కడ ఆస్కారముంటుందో అక్కడ వారు అత్యంత శీఘ్రంగా ప్రత్యక్షమవుతారు. వారి వ్యవహారం తమకు ప్రయోజనకరమని బ్రిటిష్ పాలకులు భావించారు. సంఘీయులను ప్రోత్సహించారు. ఆ నైతిక మద్దతు పర్యవసనాలను ఇప్పుడు మనం ఎదుర్కోవలసి ఉంది’.


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను సన్నిహితంగా పరిశీలించిన గాంధీ అనుయాయులలో పలువురు వినోబా భావే అవగాహనతతో ఏకీభవించారు. వారిలో ఒకరు కె.జి. మష్రువాలా. ఆరెస్సెస్ నాయకులు తమ సంస్థ భావజాలం గురించి మరాఠీ భాషలో రాసిన వివిధ పుస్తకాలను మష్రువాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వినోబా వలే గాంధీ ఆంతరంగిక బృందంలో సభ్యుడైన మష్రు వాలా 1948 డిసెంబర్ 19 ‘హరిజన్’ పత్రికలో ఇలా రాశారు: ‘సంఘ్ వ్యవహారాలను నేను చాలా సంవత్సరాలుగా పరిశీలిస్తూ వస్తున్నాను. ఆ సంస్థ పట్ల నా అనుమానాలు అంతకంతకూ బలపడ్డాయి’. ‘హిందూ మతాన్ని ప్రేమించు, ఏ మతాన్నీ ద్వేషించవద్దు’ అనేది సంఘ్ నినాదం. అయితే నా అభిప్రాయంలో ఆ నినాదంలోని రెండో భాగం నిజం కాదు. ముస్లింలను ద్వేష భావంతోను, ఏవగింపుతోను చూడాలనే సంఘ్ గురించి నేను విన్నవీ, కన్నవీ, చదివినవీ అన్నీ ముస్లింల పట్ల ద్వేషభావాన్ని కలిగించేవిగా ఉన్నాయి. వారి పట్ల ఏవగింపును ప్రోత్సహిస్తున్నాయి. మష్రువాలా సరిగానే చెప్పారు. ముస్లింల పట్ల విద్వేషం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన సూత్రం. ఆ సంస్థకు సుదీర్ఘకాలం పాటు సర్ సంఘ్ చాలక్‌గా ఉన్న ఎమ్‌ఎస్ గోల్వాల్కర్ రచనల్లో అది సమృద్ధంగా వ్యక్తమయింది. 1948లో వలే 2022లోనూ మైనారిటీ వర్గాలను ఉద్దేశపూర్వకంగా నిందించే హిందూత్వ భావజాలం, బహుళత్వ, సమ్మిళిత గాంధీవాదం మధ్య పెద్ద వ్యత్యాసం అలానే ఉండిపోయింది. అప్పటి వలే ఇప్పుడూ భారతీయులు ఆ రెండిటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసివుంది. మనమెంత వివేకశీలురమూ, ధైర్యవంతులమో, లేదా విజ్ఞత, సాహసమూ చూపగలమో అన్న దానిపైనే మన సమున్నత భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య భవిష్యత్తు ఆధారపడి ఉన్నది.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-01-29T09:14:37+05:30 IST