ఎవరికీ ఇబ్బంది లేకుండా గణేశ్‌ ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-08-09T09:17:40+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గణేశ్‌ ఉత్సవాలను ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు...

ఎవరికీ ఇబ్బంది లేకుండా గణేశ్‌ ఉత్సవాలు

  • ప్రభుత్వానికి సహకరించాలి
  • విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టాలని లేదు: తలసాని
  • ఆంక్షలు పెట్టొద్దన్న భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి
  • కుదరని ఏకాభిప్రాయం..అసంపూర్తిగా సమావేశం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గణేశ్‌ ఉత్సవాలను ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వానికి నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఎత్తు విషయంలో ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని, అందరి ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తోందని తెలిపారు. కరోనా నేపథ్యంలో.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శనివారం మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులతో తలసాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. విగ్రహాల ఎత్తుతోపాటు వివిధ అంశాలపై ప్రభుత్వం, సమితి ప్రతినిఽధుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ఎత్తు, తదితర అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు కోరారు.


నిమజ్జనానికి మునుపటి స్థాయిలో కాకపోయినా.. చిన్న క్రేన్లను ఏర్పాటు చేయాలన్నారు. కాగా, మండపాల వద్ద నలుగురైదుగురి కంటే ఎక్కువ ఉండకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని మరో ప్రతినిధి అభిప్రాయపడ్డారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వ స్థాయిలో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో మరోసారి సమావేశమై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌, రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, రాజాసింగ్‌, ముఠా గోపాల్‌, వెంకటేష్‌, ప్రకా్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


కళాకారులకు నష్టం చేయొద్దు: రాజాసింగ్‌

గణేశ్‌ విగ్రహాల ఎత్తు విషయంలో కళాకారులకు ప్రభుత్వం నష్టం చేయొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. విగ్రహాల ఎత్తు మూడు అడుగులు మించవద్దని ప్రభుత్వం చెబుతోందని, కానీ.. ఇప్పటికే ఖైరతాబాద్‌, బాలాపూర్‌లో ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన విగ్రహాలు ప్రతిష్ఠించాలని నిర్ణయించారని తెలిపారు. ఇప్పుడు మూడు అడుగులలోపు అంటే.. కళాకారులకు నష్టం జరుగుతుందని, విగ్రహాల ఎత్తుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 


Updated Date - 2020-08-09T09:17:40+05:30 IST