Abn logo
Sep 20 2021 @ 00:20AM

శోభాయమానం

గంగమ్మ ఒడికి చేరుతున్న గణేశుడు

గంగమ్మ ఒడికి చేరిన గణేశుడు

సంగారెడ్డిలో ముగిసిన నిమజ్జనం

ఆకట్టుకున్న శకటాలు

ఉత్సాహంతో చిందేసిన చిన్నాపెద్ద


సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 19 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో గణేష్‌ నిమజ్జనోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్‌ చెరువులో ఉదయం నుంచి విగ్రహాలను నిమజ్జనం చేశారు. శోభాయమానంగా అలంకరించిన శకటాల్లో విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. చిన్నాపెద్ద తేడాలేకుండా భక్తులు శకటాల ఎదుట భజనలు, నృత్యాలు చేశారు. చైతన్య యువజన సంఘం, వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. నిమజ్జనం వీక్షించడానికి పట్టణవాసులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పాతబస్టాండ్‌ వద్ద గణేష్‌ ఉత్సవ కమిటీ (విశ్వహిందూ పరిషత్‌) ప్రతినిధులు శకటాలకు స్వాగతం పలికారు. పట్టణ శివారులోని శ్రీవైకుంఠపురంలో ప్రతీష్ఠించిన గణపతిని అక్కడి కొలనులోనే నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సంగారెడ్డి డీఎస్పీ బాలాజీనాయక్‌, సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.


సిద్దిపేటలో ఉత్సాహంగా నిమజ్జనం 

సిద్దిపేట రూరల్‌, సెప్టెంబరు 19: నవరాత్రి పూజల అనంతరం గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్లారు. సిద్దిపేట పట్టణంలో ఆదివారం వినాయక నిమ్మజ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే అందంగా అలంకరించిన శకటాల్లో గణేశుడి విబ్రహాలను ఉంచి ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. శకటాల ఎదుట భక్తులు కోలాటాలు, భజనలు, నృత్యాల్లో మునిగితేలారు. మండపాల నిర్వాహకులు శోభాయాత్ర పొడువునా భక్తులకు పులిహోర, ప్రసాదాలు పంచారు. భక్తులు కట్నాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,125 మండపాలను ఏర్పాటు చేయగా ఆదివారం ఒక్కరోజే 973 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ముందురోజు శనివారం రాత్ర వరకు 510 విగ్రహాలు నిమజ్జనం చేయబడ్డాయి. ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.