రేషన్‌ బియ్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-09-20T09:53:11+05:30 IST

అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు...

రేషన్‌ బియ్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

దుండిగల్‌, సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ నర్సింహరావు వివరాలు వెల్లడించారు. తాండూరు ప్రాంతంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన లారీ డ్రైవర్లు మహ్మద్‌ ఇక్బాల్‌(24), మహ్మద్‌ అఫ్సర్‌(27), ఆటోడ్రైవర్లు అబ్దుల్‌ అఫ్జల్‌(38), జబ్బార్‌మియా(28), అబ్దుల్‌ నయీం(31), తోషిఫ్‌(20), మహ్మద్‌ ఆసిఫ్‌ (25)లు ముఠాగా ఏర్పడ్డారు. వారు  రోడా మేస్త్రీనగర్‌ ప్రాంతం నుంచి కర్నాటకకు రేషన్‌ బియ్యాన్ని ఆటో ట్రాలీలలో తరలిస్తుంటారు.  వీరి నుంచి రోడా మేస్త్రీనగర్‌కు చెందిన  ఎండీ అజార్‌, ఖయ్యూం, సలీం, ఫర్వేజ్‌,  ఎండీ అజ్మత్‌అలీ, నవీన్‌, శ్రీకాంత్‌, సమీర్‌లు క్రైం విలేకరులమని చెప్పి పలుసార్లు డబ్బులు తీసుకున్నారు. ఇటీవల రూ. లక్ష డిమాండ్‌ చేయగా, ఇవ్వలేదు. దీంతో ఈ నెల 15న రాత్రి రేషన్‌బియ్యం తరలిస్తుండగా విలేకరులమని చెప్పిన వారు పట్టుకున్నారు. రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారు కైసర్‌నగర్‌ చౌరస్తా వద్ద డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లగానే ముఠా సభ్యులు అజ్మత్‌అలీని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మిగిలిన వారు దుండిగల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఇన్నోవా కారు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-09-20T09:53:11+05:30 IST