గంగమ్మ తల్లీ శాంతించు..

ABN , First Publish Date - 2020-10-22T07:25:32+05:30 IST

‘గంగమ్మ తల్లీ.. శాంతించు.. ’ అంటూ మంత్రులు, మేయర్‌ వేడుకొన్నారు. బుధవారం పురానాపూల్‌ వద్ద మూసీనదిలో శాస్త్రోక్తంగా గంగమ్మశాంతి పూజ

గంగమ్మ తల్లీ శాంతించు..

మూసీనదికి పూజలు

పాల్గొన్న మంత్రులు, మేయర్‌


అఫ్జల్‌గంజ్‌/హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘గంగమ్మ తల్లీ.. శాంతించు.. ’ అంటూ మంత్రులు, మేయర్‌ వేడుకొన్నారు. బుధవారం పురానాపూల్‌ వద్ద మూసీనదిలో శాస్త్రోక్తంగా గంగమ్మశాంతి పూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ చేతుల మీదుగా జరిగిన ఈ పూజలో హోం మంత్రి మహమూద్‌ అలీ, గ్రేటర్‌ బల్దియా మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నేత నందకిషోర్‌ వ్యాస్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


గంగమ్మతల్లికి ముక్కుపుడక, గాజులు, దుస్తులు, పసుపు, కుంకుమ, గంగతెప్పలు సమర్పించారు. జల ప్రళయాన్ని నిలువరించడమే శాంతి పూజల ముఖ్యోద్దేశమని తలసాని పేర్కొన్నారు. జలప్రళయంతో అనేక మంది బాధితులయ్యారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


1908లో మూసీనది ఉగ్రరూపం వల్ల లక్షమంది నిరాశ్రయులయ్యారని, 15 వేల మంది మృతి చెందారని గుర్తుచేశారు. నాడు నిజాం రాజు మీర్‌మహబూబ్‌ అలీఖాన్‌ గంగమ్మకు కానుకలు సమర్పించి శాంతి పూజలు చేశారని, ఆ వెంటనే పరిస్థితి చక్కబడిందని తెలిపారు. తొలుత పురానాపూల్‌లోని మూసఖాద్రి దర్గా వద్ద చాదర్‌, ఆపై అమ్మవారికి బోనాలు సమర్పించారు. 


చింతచెట్టుకు ప్రత్యేక పూజలు

1908లో మూసీనదికి వచ్చిన వరద ఉధృతికి కొట్టుకుపోతున్న దాదాపు 150 మంది.. అఫ్జల్‌గంజ్‌లో ఉన్న అఫ్జల్‌పార్క్‌ చింతచెట్టును ఆసరా చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అంతటి ప్రాముఖ్యం కల్గిన చింతచెట్టుకు మేయర్‌ బొంతు రాంమోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు, వైద్యులను మేయర్‌  సత్కరించారు. 


Updated Date - 2020-10-22T07:25:32+05:30 IST