Advertisement
Advertisement
Abn logo
Advertisement

గంగమ్మ వాయనం

తాంబేలు మీద తామరాకు పడ్డది

తామరాకు మీద 

ఎగిరి చందమామ పడ్డది

నెలవొంక నెలవయ్యి దిగుతుంది

తెడల మీద గంగమ్మ వాయనం

తేలిపోతుంది

కంచ కదులుతుంది పక్కన

మర్నాగి మరో నాత్రి మేలుకుంది

పొద పొద దాటి గడియ పొద్దును 

                       లేపింది

తాటికమ్మల చాటున రొమ్ములు

పొంగిన లొట్లు

గుండుకు వొరిగి

పద మెత్తుకుంటే

గాలి రథమెక్కిన రెక్కల పాట

వొడి వొడిగ తిరిగి

ఏ వొడి చేరిందో

పాత గుడిలో

పండు వెన్నెల పడుకొని ఉంది

గాలి దుమారంలో

కంపఎట్టాలు కొట్టుక పోయినయి

నిప్పులు కక్కిన శ్వాసని

నిశ్శబ్దం నీడన చేర్చుకుంది

ఎవరో పిలిచినట్టు అలికిడి

పిలిచిన మొకం

మెల్ల మెల్లగ

చెట్లల్లోకి చెరువులోకి

పిట్ట గొంతులోకి జారుకుంది

ప్రియా..

నిన్ను చూడడనికి

ఎన్ని సార్లు వెన్నెల నన్ను కన్నదో 

యుద్దం నుంచి, ఇంటి నుంచి 

గాంధర్వ తోవలెంట

నడుస్తున్నా

ప్రియా....

తోడుకున్న కల గడ్డకట్టిన జాబిలి

చెరువా చెలగపిట్టల చేనా

చెలరేగి ఉన్నయి

నీటి కింద

ఆకాశం పరుచుకొని ఉంది

చాపలు జెన యిడిసి పోతే

చెరువు ఊయలయ్యి ఊగుతుంది

కట్ట కింద

కలలు దున్నిన

కాంచన కల్లం

ఎప్పటికి అమ్మని

అమ్మలేని

దివ్య ఆస్తులను

ఎవరు రాసి పోయిన్రో నా పేర.

మునాసు వెంకట్‌

99481 58163


Advertisement
Advertisement