గంగవరానికి.. పెట్రోనెట్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2021-09-13T08:01:15+05:30 IST

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌పై చిన్నచూపు చూస్తున్నాయి.

గంగవరానికి.. పెట్రోనెట్‌ గుడ్‌బై

ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఒడిశాకు తరలింపు

4,500 కోట్లతో దీని ఏర్పాటుకు

2012లోనే పోర్టుతో ఒప్పందం

నాలుగేళ్లకే అందుబాటులోకి రావాలి

డిమాండ్‌ లేదంటూ నాడు పక్కనబెట్టారు

ఇప్పుడు గొప్ప డిమాండ్‌ ఉందంటూ

గోపాల్‌పూర్‌ వద్ద నెలకొల్పేందుకు రెడీ

కాకినాడ, కృష్ణపట్నం టెర్మినల్స్‌దీ ఇదే గతి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌పై చిన్నచూపు చూస్తున్నాయి. ఒక్కటొక్కటిగా తరలిపోతున్నాయి. తాజాగా విశాఖ సమీపంలోని గంగవరం రేవు వద్ద తలపెట్టిన ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ప్రాజెక్టును.. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ కంపెనీ ఒడిశాకు తరలిస్తోంది. ఆ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌ రేవు వద్ద ఏటా 45 లక్షల టన్నులు వార్షిక దిగుమతి సామర్థ్యంతో కొత్తగా ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ తాజా వార్షిక నివేదిక ఈ విషయం పేర్కొంది. గంగవరం వద్ద ఏటా 50 లక్షల టన్నుల దిగుమతి సామర్థ్యంతో రూ.4,500 కోట్లతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకు పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ 2012లోనే గంగవరం పోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి ఈ ప్రాజెక్టు 2016 నాటికే అందుబాటులోకి రావాలి. అయితే దేశ తూర్పు ప్రాంతంలో ఎల్‌ఎన్‌జీకి సరైన డిమాండ్‌ లేదనే సాకుతో 2019లో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. ఇపుడు రెండేళ్లు తిరక్కుండానే బాగా డిమాండ్‌ ఏర్పడిందంటూ గోపాల్‌పూర్‌ పోర్టు వద్ద టెర్మినల్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 


అతీగతీ లేని మిగతా టెర్మినల్స్‌

ఆంధ్రలోని గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం రేవుల వద్ద ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ ఏర్పాటుకు గతంలో అనేక సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్‌తో కలిసి కృష్ణపట్నం వద్ద 50 లక్షల టన్నుల వార్షిక దిగుమతి సామర్థ్యంతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకూ పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగా మారింది. కాకినాడ పోర్టు వద్ద మరో ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తలపెట్టిన ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టుదీ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ఏటా 50 లక్షల నుంచి కోటి టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతి సామర్ద్యంతో ఫ్లోటింగ్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టుపై తొలుత ఆసక్తి కనబరచిన షెల్‌, ఇంజీ అనే కంపెనీలు మధ్యలోనే వైదొలగడంతో గెయిల్‌ ఈ ప్రాజెక్టును మూలనపడేసింది.

Updated Date - 2021-09-13T08:01:15+05:30 IST