పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన మనుబోతు.. గ్యాంగ్‌స్టర్ మృతి..

ABN , First Publish Date - 2020-09-28T22:18:57+05:30 IST

పోలీస్ ఎస్కార్ట్ వాహనం మనుబోతును ఢీకొట్టి తిరగబడడంతో ఓ గ్యాంగ్‌స్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు ఉత్తర ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు...

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన మనుబోతు.. గ్యాంగ్‌స్టర్ మృతి..

లక్నో: పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని మనుబోతు ఢీకొట్టడంతో అది తిరగబడి  ఓ గ్యాంగ్‌స్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు ఉత్తర ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ముంబై నుంచి లక్నోకి తరలిస్తుండగా మధ్య ప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద వాంటెడ్‌ లిస్టులో ఉన్న ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి శుక్రవారం ముంబై సమీపంలోని నల్లసొపోరా ప్రాంతంలో పట్టుబడ్డాడు. అతడిని తీసుకొచ్చేందుకు లక్నో పోలీసు బృందం ముంబైకి వెళ్లింది. ఆదివారం ఉదయం పోలీసులు ఖాన్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు భోపాల్‌కి 150 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.


ఇన్నోవా కారు వెనుక భాగంలో ఓ ‘‘మనుబోతు’’ (బ్లూ బుల్) ఢీ కొట్టడంతో కారు తిరగబడిందనీ.. ఈ ఘటనలో ఖాన్ తీవ్ర గాయపడ్డాడని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే వెల్లడించారు. వెంటనే అతడిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లినా... అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు నిర్దారించారని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా మరో నలుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. సోమవారం డిశ్చార్జ్ అవుతారని కమిషనర్ పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బెహ్రాయిచ్ జిల్లాకి చెందిన గ్యాంగ్‌స్టర్ ఖాన్‌పై అనేక కేసులు ఉన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని భోపాల్ పంపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం అతడి స్వస్థలానికి తరలించనున్నారు. 

Updated Date - 2020-09-28T22:18:57+05:30 IST