ఇద్దరూ ఇద్దరే..

ABN , First Publish Date - 2020-07-14T09:09:39+05:30 IST

విశ్వవ్యాప్తంగా ఉన్న పలువురు మాజీ ఆటగాళ్లు, జర్నలిస్టులు, బ్రాడ్‌కాస్టర్లతో కూడిన జ్యూరీ ఎనిమిది విభాగాల్లో గంగూలీ, ఎంఎ్‌సను వడబోశారు...

ఇద్దరూ  ఇద్దరే..

విశ్వవ్యాప్తంగా ఉన్న పలువురు మాజీ ఆటగాళ్లు, జర్నలిస్టులు, బ్రాడ్‌కాస్టర్లతో కూడిన జ్యూరీ ఎనిమిది విభాగాల్లో గంగూలీ, ఎంఎ్‌సను వడబోశారు. ఇందులో ఇంటా.. బయటా టెస్టు కెప్టెన్సీ, వన్డే కెప్టెన్సీ, కెప్టెన్‌గా బ్యాటింగ్‌ రికార్డులు, జట్టును ఎంత నాణ్యంగా మార్చి.. తర్వాతి సారథులకు అప్పగించారు? చెప్పుకోదగ్గ ఘనతలు, ఓవరాల్‌గా ఎంత ప్రభావం చూపారు.. వంటి అంశాలకు పది పాయింట్ల లోపు మార్కులు వేశారు. ఇలా అన్ని కేటగిరీలలో వచ్చిన మార్కులను కలిపితే.. ధోనీ 0.4 తేడాతో స్వల్పంగా పైచేయి సాధించాడు. అయితే, విడివిడిగా చూస్తే వన్డేల్లో ధోనీ.. టెస్టుల్లో గంగూలీలను బెస్ట్‌ కెప్టెన్లుగా తేల్చారు. అలాగే ఈ సర్వేలో అత్యుత్తమ ఆటగాళ్లను తయారుచేసిన ఘనత దాదాకు దక్కింది. మాజీ ఆటగాళ్ల ప్యానెల్‌నుంచి గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక), గౌతమ్‌ గంభీర్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌ నిర్ణేతలుగా వ్యవహరించారు. 

ఈ సర్వేలో కొన్ని అంశాలను పరిశీలిస్తే...


స్వదేశీ టెస్టుల్లో

 ధోనీ (8.2), గంగూలీ (7.4)

ఇరువురి రికార్డులు మెరుగ్గానే ఉన్నా ధోనీ తనకున్న వనరుల దృష్ట్యా ఎక్కువ కష్టపడుతూ మెరుగైన ఫలితాలు సాధించాడు. ఎందుకంటే గంగూలీకి కుంబ్లే, హర్భజన్‌ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నారు. ధోనీకి హర్భజన్‌ మాత్రమే ఉండేవాడు. దీంతో మరో స్పిన్నర్‌ కోసం అతడు  ఇబ్బందిపడుతూనే విజయాలు సాధించాడు.

 విదేశీ టెస్టుల్లో

  గంగూలీ (7.2), ధోనీ (5.5)

విదేశీ పర్యటనల్లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టును ఓడించేందుకు ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా ఉండేది. అందుకే ఇంగ్లండ్‌, ఆసీస్‌, పాక్‌ జట్లను వారి గడ్డపైనే ఓడించగలమనే నమ్మకం కలిగింది. మొత్తంగా అతడి సారథ్యంలో 28 మ్యాచ్‌ల్లో 10 విజయాలున్నాయి. అయితే ధోనీ జట్టు 30 టెస్టులు ఆడితే 15 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇందులో విజయాలు 20 శాతం ఉండగా, ఓటములు 50 శాతం ఉన్నాయి. 

 వన్డే కెప్టెన్సీ

 ధోనీ (8.1), గంగూలీ (6.8)

ఇందులో నిస్సందేహంగా ధోనీ వైపే జ్యూరీ మొగ్గు చూపింది. తన నిర్ణయాల్లో స్పష్టత ఉండడంతో పాటు సహచరులపై భరోసా కలిగి ఉండడం కూడా ధోనీ విజయాల్లో కీలక పాత్ర వహించింది. అయితే దాదాకు కూడా ధోనీకి లభించిన ఆటగాళ్లుంటే కచ్చితంగా విజయాలు సాధించేవాడన్న అభిప్రాయం వ్యక్తమైంది.

జట్టు రూపురేఖలు మార్చడం

గంగూలీ (8.6), ధోనీ (7.3)

ఈ విషయంలో దాదానే ముందుంటాడని ఇప్పటికే పలువురు అభిప్రాయపడ్డారు. జట్టుకు దూకుడు నేర్పి, కదం తొక్కించాడని పేరు తెచ్చుకున్నాడు. ఆటగాళ్ల మైండ్‌సెట్‌ను మారుస్తూ ఫలితాలు సాధించాడు. 

మెరుగైన జట్టును అందించడం

గంగూలీ (7.8), ధోనీ (7.6)

ఈ రేసు చాలా క్లిష్టంగా సాగింది. అయితే ఎంఎస్‌ కన్నా దాదానే జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలు చేపట్టిన దాదా తన హయాంలో యువరాజ్‌, హర్భజన్‌, సెహ్వాగ్‌, జహీర్‌లకు మద్దతుగా నిలిచి గేమ్‌ చేంజర్స్‌గా మార్చాడు. అయితే ధోనీ ఆటగాళ్ల్లలో భయాన్ని పోగొట్టి బెర్త్‌పై నమ్మకం కలిగించాడు. విరాట్‌ కోహ్లీ అలా రూపుదిద్దుకున్నవాడే..

మొత్తంగా ఎవరి ప్రభావమెంత?

 గంగూలీ (8.1), ధోనీ (7.9)

 ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు, జట్టును ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థాయికి తీసుకురాగా.. గంగూలీ  అద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను తయారుచేసి జట్టుకు అందించిన సారథి.

అంతేకాకుండా ఎలాంటి ప్రత్యర్థిపైనైనా గెలవగల నమ్మకాన్ని ఆటగాళ్లలో కలిగించిన నాయకుడిగా ఈ విషయంలో దాదా పైచేయి సాధించాడు.


ధోనీ కాస్త పైచేయి భారత ఉత్తమ కెప్టెన్‌ సర్వే

భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ఎవరు? అనే ప్రశ్నకు ప్రతీ అభిమాని కూడా ఠక్కున సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనీ పేర్లను సమాధానంగా చెబుతుంటారు. మరి.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌? అంటే వెంటనే చెప్పడం ఎవరికైనా కష్టమే. ఇప్పుడు ఈ సందిగ్ధతకు తెరదించేందుకు స్టార్‌ స్పోర్ట్స్‌-క్రిక్‌ఇన్ఫో ఓ సర్వే నిర్వహించింది. ప్రముఖుల అభిప్రాయాలను సేకరిస్తూ చేసిన ఆ సర్వేలో చివరకు దాదాకన్నా ‘మిస్టర్‌ కూల్‌’ కాస్త 

పైచేయిలో ఉన్నట్టు తేల్చారు..

Updated Date - 2020-07-14T09:09:39+05:30 IST