దాదాకు మరో యాంజియోప్లాస్టీ!

ABN , First Publish Date - 2021-01-05T07:26:05+05:30 IST

బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉడ్‌లాండ్స్‌ ఆసుపత్రి సోమవారం వెల్లడించింది. అయితే దాదాకు మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపింది...

దాదాకు మరో యాంజియోప్లాస్టీ!

  • తప్పదంటున్న డాక్టర్లు
  • త్వరలో చేయాల్సి ఉంటుందని వెల్లడి
  • రేపు ఆసుపత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్‌

కోల్‌కతా: బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉడ్‌లాండ్స్‌ ఆసుపత్రి సోమవారం వెల్లడించింది. అయితే దాదాకు మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాగా..48 ఏళ్ల గంగూలీని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వెల్లడించింది. 9 మందితో కూడిన సీనియర్‌ డాక్టర్ల బృందం సోమవారం సమావేశమై గంగూలీ ఆరోగ్యం గురించి చర్చించిందని తెలిపింది. అతడి పరిస్థితి నిలకడగా ఉందని, కానీ రాబోయే రోజుల్లో మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని నిర్ణయించిందని ఆసుపత్రి సీఈవో రుపాలీ బసు వెల్లడించారు.  గుండెనొప్పితో గంగూలీ శనివారం ఆసుపత్రిలో చేరగా హృదయనాళాల్లో మూడుచోట్ల పూడికలున్నాయని తెలుసుకున్న డాక్టర్లు  ఓ స్టెంట్‌ వేసిన విషయం విదితమే.


పరామర్శించిన అనురాగ్‌, జై షా

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా.. గంగూలీని సోమవారం పరామర్శించారు. అతడు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ‘మొదట బీసీసీఐలో ఆ తర్వాత దేశంలోని ఇతర రంగాల్లో దాదా కీలక భూమిక పోషించాల్సి ఉంది’ అని గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై బీసీసీఐ మాజీ చీఫ్‌ అయిన అనురాగ్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 


గంగూలీపై ‘రాజకీయ’ ఒత్తిడి!

రాజకీయాల్లోకి రావాలంటూ గంగూలీపై కొందరు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని అతడి సన్నిహితుడు, సీపీఎం నేత  అశోక్‌ భట్టాచార్య ఆరోపించారు ‘కొందరు గంగూలీని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బహుశా అది అతడిపై ఒత్తిడి పెంచి ఉంటుంది. సౌరవ్‌ను క్రికెట్‌ ఐకాన్‌గానే చూడాలి తప్ప రాజకీయ  వస్తువుగా చూడకూడదు’ అని దాదా కుటుంబానికి సుదీర్ఘకాల మిత్రుడైన అశోక్‌ అన్నారు.  


అన్నింటిలోనూ అవేనా..?

భట్టాచార్య వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తిప్పికొట్టారు. ‘మానసిక ఆరోగ్యం సరిగాలేని కొందరు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తారు. అందరిలాగే మేమూ అతడు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’ అని ఆయన అన్నారు. 


Updated Date - 2021-01-05T07:26:05+05:30 IST