Abn logo
Apr 15 2021 @ 07:00AM

అరకు నుంచి ఆగ్రాకు లారీ గంజాయి సప్లయ్ చేస్తూ...

  • ఇద్దరి అరెస్ట్‌ 
  • 200 కిలోల గంజాయి, రూ 15వేల నగదు స్వాధీనం

హైదరాబాద్‌ : అరకు నుంచి ఆగ్రాకు లారీలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌ భరత్‌పూర్‌కు చెందిన దేవేందర్‌సింగ్‌(45), ఉత్తరప్రదేశ్‌లోని హత్రా్‌సకు చెందిన లారీ డ్రైవర్‌ పి.రవీంద్రకుమార్‌ పండిత్‌(40), ఆగ్రాకు చెందిన యాదవ్‌(35) స్నేహితులు. యాదవ్‌ గంజాయి సరఫరా వ్యాపారం చేసేవాడు. ఇతడికి విశాఖలోని అరకు ప్రాంతానికి చెందిన హరితో పరిచయమైంది. హరి అరకులో ఉంటూ ఆగ్రాలో ఉన్న యాదవ్‌కు గంజాయిని కిలో రూ.2వేలకు విక్రయించేవాడు. తరచూ దక్షిణాది రాష్ట్రాలకు లోడ్‌లు తీసుకువెళ్లే లారీలను గుర్తించిన యాదవ్‌.. సదరు లారీ డ్రైవర్లు, ఓనర్లతో మాట్లాడి డ్రైవర్‌ సీటు వెనుక ప్రత్యేక క్యాబిన్‌ తయారు చేయించేవాడు.

గంజాయిని ఆ క్యాబిన్‌లో ఉంచి రవాణా చేసేవారు. యాదవ్‌ తరపున దేవేందర్‌సింగ్‌, రవీంద్రలు గంజాయిని అరకు నుంచి హైదరాబాద్‌ మీదుగా ఆగ్రాకు తరలించేవాడు. ఆగ్రా చేరిన గంజాయిని యాదవ్‌ కిలో రూ.10 వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. అందులోని కొంతభాగాన్ని దేవేందర్‌, రవీంద్రలకు ఇచ్చేవాడు. ఇలా పలుమార్లు అరకు నుంచి గంజాయిని తరలించారు. పక్కా సమాచారంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, హయత్‌నగర్‌ పోలీసులతో కలిసి తనిఖీలు ప్రారంభించారు. రాజస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ లారీ (ఆర్‌జే05 జీఏ 3951)లో గం జాయి తరలిస్తున్న దేవేందర్‌ సింగ్‌, రవీంద్రకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. లారీలోని ఉంచిన 200 కిలోల గంజాయి, రూ.15వేల నగదు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement