గంజాయి జోరు

ABN , First Publish Date - 2020-11-17T06:02:11+05:30 IST

మన్యం నుంచి గంజాయి రవాణా జోరందుకుంది. ఈ నెలలో ఇప్పటివరకు ఐదు వేల కిలోలకుపైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే...వారి కళ్లు గప్పి ఇంకెంత తరలిపోయిందో....

గంజాయి జోరు
ఇటీవల డుంబ్రిగుడలో పట్టుబడిన గంజాయి (ఫైల్‌ ఫొటో)

మన్యం నుంచి యథేచ్ఛగా తరలింపు

 లాక్‌డౌన్‌ సమయంలో భారీగా కొనుగోలు చేసిన స్మగ్లర్లు

 స్థానికంగానే నిల్వ, ప్యాకింగ్‌ 

అన్‌లాక్‌ 5.0 అనంతరం దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా

 గంజాయి సాగు నిర్మూలనలో ఎక్సైజ్‌ శాఖ విఫలం

 వాహన తనిఖీలకే పరిమితమైన పోలీసులు


పాడేరు, నవంబరు 16: మన్యం నుంచి గంజాయి రవాణా జోరందుకుంది. ఈ నెలలో ఇప్పటివరకు ఐదు వేల కిలోలకుపైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే...వారి కళ్లు గప్పి ఇంకెంత తరలిపోయిందో....

ఏజెన్సీలో జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. రబీ సమయంలో విత్తే గంజాయి పంట ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేతికి వస్తుంది. కరోనా కారణంగా మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో గంజాయి రవాణాకు బ్రేకులు పడ్డాయి. దీంతో స్మగ్లర్లు మారుమూల గ్రామాల్లో గంజాయి కొనుగోలు చేసి, అక్కడే ప్యాకింగ్‌ చేసి నిల్వ చేశారు. అక్టోబరు నుంచి కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో స్మగ్లర్లు ఏజెన్సీ నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించడం మొదలెట్టారు.


పోలీసు శాఖకు పట్టదా?

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సాయుధ బలగాలు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తుంటాయి. వీరు గాలింపు జరిపే ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి సాగా కనిపించినా పెద్దగా పట్టించుకోవడంలేదు. మావోయిస్టులను ఏరివేయడం, వారి కార్యకలాపాలను కట్టడి చేయడమే తమ బాధ్యతగా భావిస్తూ గంజాయి జోలికి వెళ్లడం లేదు. సాధారణ పోలీసులు కూడా...రహదారులపై వాహనాలను తనిఖీ చేసి, గంజాయి రవాణాను అరికట్టడమే తప్ప గంజాయి తోటలపై దాడులు చేసి, ధ్వంసం చేయడం తమ పనికాదని, అది ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ బాధ్యత అని అంటున్నారు. కానీ సిబ్బంది కొరత, ఆయుధాలు లేకపోవడంతో గంజాయి తోటలపై దాడులు చేసే పరిస్థితి ఎక్సైజ్‌ శాఖలో కనిపించడంలేదు. అప్పుడప్పుడు ప్రధాన రహదారులకు సమీపంలో వున్న గంజాయి తోటలపై దాడి చేసి, మొక్కలను పీకి దహనం చేయడం తప్ప మారుమూల గ్రామాల్లో  తోటల జోలికి వెళ్లడం లేదు. దీంతో ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణా జోరుగా సాగిపోతున్నది. వాస్తవంగా పోలీసులు, ఎక్సైజ్‌ శాఖలు సంయుక్తంగా దాడులు జరిపితే గంజాయి సాగుతోపాటు రవాణాను కూడా నియంత్రించవచ్చు. కానీ ఇరు శాఖల అధికారులు  ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 


వాహనాల తనిఖీలకే పరిమితం

రహదారులపై వాహనాలను తనిఖీ చేసే సమయంలో గంజాయి పట్టుబడడం, లేదా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో దారిలో కాపుకాసి గంజాయి తరలిస్తున్న వాహనాలను పట్టుకోవడం తప్ప పోలీసులు ప్రత్యేకంగా ఎటువంటి తనిఖీలు, దాడులు, సోదాలు నిర్వహించడం లేదు. ప్రధాన రహదారులపైనా, అది కూడా రోజులో కొంత సమయం మాత్రమే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించని సమయాల్లో స్మగ్లర్లు గంజాయిని తరలిస్తున్నారు. నవంబరు నెలలో ఇంతవరకు నాలుగు వేల కిలోలకుపైగా గంజాయిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. కానీ వాస్తవంగా ఇంతకు పది రెట్లు గంజాయి తరలిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ నుంచి జి.మాడుగుల, పాడేరు మీదుగా చోడవరం, అనకాపల్లి ప్రాంతాలకు; చింతపల్లి, జీకేవీధి నుంచి నర్సీపట్నానికి; అరకులోయ, అనంతగిరి నుంచి విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతానికి వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 


రెండేళ్లుగా తోటలపై దాడుల్లేవు

ఏజెన్సీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలని నాలుగేళ్ల క్రితం ఎక్సైజ్‌ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 2017లో జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, జీకేవీధి, హుకుంపేట మండలాల్లో గంజాయి తోటలపై దాడులు చేసి, మొక్కలు పీకివేశారు. 2018లో అక్కడక్కడా తోటలను ధ్వంసం చేయగా, ఆ తరువాత రెండేళ్లుగా గంజాయి తోటల జోలికి వెళ్లలేదు. సాగు నిర్మూలనకు చర్యలు చేపడతామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించినప్పటికీ, కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేశారు. ఎక్సైజ్‌ శాఖ నిర్లిప్త ధోరణి....గంజాయి స్మగ్లర్లకు బాగా కలిసొస్తున్నది.  

Updated Date - 2020-11-17T06:02:11+05:30 IST