Abn logo
Oct 23 2021 @ 11:57AM

భాగ్యనగరంలో గంజాయి గుప్పు.. కొత్తగా స్మగ్లింగ్‌లోకి వాళ్లొచ్చారు.. న్యూ ఇయర్‌కు భారీ ప్లాన్‌..!

  • పాన్‌షాపులు, కళాశాల ప్రాంగణాలు అడ్డా
  • కొత్తగా స్మగ్లింగ్‌లోకి హిజ్రాలు
  • అవాక్కవుతున్న పోలీసులు
  • గంజాయిపై ప్రత్యేక డ్రైవ్‌
  • విచ్చలవిడిగా విక్రయాలు


- గతంలో జేఎన్‌టీయూ క్యాంపస్‌లోనే గంజాయి విక్రయిస్తూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. గంజాయి మత్తులో కొంతమంది పోకిరీలు మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఈ కోవకు చెందినదే.


హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరంలో విస్తృతంగా గంజాయి సరఫరా జరుగుతోంది. పోకిరీలు, జులాయిలు ఇలా చాలా మంది గంజాయి కోసం వెంపర్లాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. గంజాయిని నియంత్రించే స్థాయి దాటిపోయిందని పలువురు పోలీసులు అధికారులు అంటున్నారు. పోలీసుల దాడుల్లో మైనర్లు పట్టుపడుతుండటం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.


డోర్‌ డెలివరీ..

గంజాయి స్మగ్లర్లు కొత్త అవతారం ఎత్తారు. విశాఖ ఏజెన్సీ నుంచి మేలు రకం గంజాయిని గోవాకు తరలిస్తున్నారు. అక్కడ అందుకు సమానంగా డ్రగ్స్‌ను కొనుగోలు చేసి ఆ డ్రగ్స్‌ను హైదరాబాద్‌ నగరానికి తీసుకొస్తున్నారు. గంజాయి లిక్విడ్‌, గంజాయిని గోవాలో విక్రయిస్తున్న స్మగ్లర్‌లు.. అక్కడి నుంచి చరస్‌, ఎండీఎంఏ, పిల్స్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, కొకైన్‌ వంటి డ్రగ్స్‌ను నగరానికి తెస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి తెచ్చి పరిచయస్తులకే విక్రయిస్తున్నారు. వాట్సా్‌ప్‌లో ఆర్డర్‌ తీసుకుని ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేస్తే చెప్పిన ప్రాంతానికే డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఒక్కో స్మగ్లర్‌.. ఒక్కో పేరుతో (కోడ్‌) ఆర్డర్‌ చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ కూడా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


స్పెషల్‌ డ్రైవ్‌..

గంజా ముఖ్త్‌ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా 25 రోజులుగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తూ గంజాయి సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివా్‌సతో పాటు సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌లు చేయడమే కాకుండా గల్లీ.. గల్లీ తిరిగి గంజాయి విక్రయదారులను, సరఫరాదారులను వెలికి తీస్తున్నారు. ట్రై కమిషనరేట్‌ పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి ముఠాల ఆటకట్టిస్తున్నా గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఠాలు ఇంజనీరింగ్‌, డిగ్రీ చదివే విద్యార్థులను స్మగ్లర్‌లుగా మారుస్తున్నాయి. ఒకరి ద్వారా మరొకరికి మాదకద్రవ్యాలను అలవాటు చేసి, వేలాది మంది యువతను గంజాయి వ్యసనపరులుగా మారుస్తున్నాయి. పోలీసులకు చిక్కుతున్న ముఠాల్లో విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు.

అసలు వదిలేసి.. కొసరు పట్టుకొని..

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి, ఒడిశా బార్డర్‌లలోని కొన్ని వ్యవసాయ క్షేత్రాల నుంచి తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. నగరంలో దొరికిన స్మగ్లర్లను కటకటాల్లోకి నెడుతున్న పోలీసులు ప్రధాన స్థావరాలపై దాడులు చేయడం లేదు. ఇటీవల నల్గొండ పోలీసులు చొరవ తీసుకొని విశాఖ మన్యంలో దాడులు నిర్వహించి గంజాయి పండించి విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తరహా చర్యలు చేపడితే ఫలితాలు ఉంటాయని నగరవాసులు పేర్కొంటున్నారు.


నేరస్థులపై ‘పిడి’కిలి..

గంజాయి, డ్రగ్స్‌, ఇతర మాదక ద్రవ్యాలు తయారు చేసినా, స్మగ్లింగ్‌ చేసినా ఉక్కుపాదం మోపాలని నిర్ణయించాం. నేరస్థులను కటకటాల్లోకి నెట్టిన వెంటనే వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని డీసీపీ, ఏసీపీలను ఆదేశించా. ఏయే మార్గాల గుండా మాదక ద్రవ్యాలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి, పోలీసుల కంటపడకుండా స్మగ్లర్‌లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అడ్డాలు, హాట్‌ స్పాట్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపై స్పెషల్‌ టీమ్స్‌ కసరత్తు చేస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లో మూతబడిన కంపెనీలు, గోదాములపై ప్రత్యేక దృష్టి సారించాం. - స్టీఫెన్‌ రవీంద్ర,  సైబరాబాద్‌ సీపీ.


మత్తు ట్యాబ్లెట్లు అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్‌..

అనుమతులు లేకుండా మత్తు కలిగించే ట్యాబ్లెట్లు, సిర్‌పల ను అమ్ముతున్న ఇద్దరిని హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్జల్‌సాగర్‌లో ఉండే నాదే విగ్నేష్‌(25), రాధ(21)లు మత్తు కలిగించే నైట్రోవెట్‌ - 10జి ట్యాబ్లెట్స్‌, ఈఎస్‌ కాఫ్‌ సిరప్‌ - 100 ఎంఎల్‌  మందులను అనుమతులు లేకుండా అమ్ముతున్నట్లు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నోయ రామదుర్గా భవానికి సమాచా రం అందింది. హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌, ఎస్‌ఐ విజయానంద్‌ల సహకారం తో శుక్రవారం ఉదయం అఫ్జల్‌ సాగర్‌లో దాడులు నిర్వహించారు. 186 ట్యాబ్లెట్స్‌, 22 మందు సీసాలన స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు..

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పోలీస్‌ డిపార్టుమెంట్‌ సహా సంబంధిత శాఖల అధికారులు మాదక ద్రవ్యాల కట్టడికి నడుం బిగిస్తున్నారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో ఎస్‌వోటి, సీసీఎస్‌, లా అండ్‌ ఆర్డర్‌లో కొన్ని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సీపీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కమిషనరేట్‌ పరిధిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి, డ్రగ్స్‌ ఎంటర్‌ కాకుండా ఈ ప్రత్యేక బృందాలు పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్‌, శంషాబాద్‌, బాలానగర్‌ జోన్‌లలో ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగాయి.


56 మంది అరెస్ట్‌..

గంజాయి తాగేందుకు వినియోగించే పేపర్లు, హుక్కా సామగ్రి విక్రయించే 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి పీఎ్‌స ల పరిధుల్లో  గంజాయి, మత్తుపదార్థాల నివారణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి తాగేందుకు వినియోగించే పేపర్లు విక్రయిస్తున్న 56 మంది పాన్‌ షాపు నిర్వాహకులను, హుక్కా సామగ్రి విక్రేతను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువ చేసే నిషేధిత పదార్థాలు, హుక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల కోసం 16 బృందాలను రంగంలోకి దింపినట్టు డీసీపీ తెలిపారు.


సిటీలో గంజాయి వాసన గుప్పుమంటోంది. కొనుగోలుదారులు, విక్రేతలలో కూలీల దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఉంటున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ను కట్టడి చేయడం చేయి దాటిపోతోందా అన్నట్లుగా అధికారుల్లో చర్చ జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాన్‌షాపులు, కళాశాల ప్రాంగణాలు, కాలనీల్లోని గల్లీలే అడ్డాగా స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మత్తుకు బానిసైనవారిలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

న్యూ ఇయర్‌కు భారీ ప్లాన్‌..

కొత్త సంవత్సర వేడుకలకు ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో స్మగ్లర్‌లు ఇప్పటి నుంచే మాదక ద్రవ్యాలను రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని రకాల మాదక ద్రవ్యాలను నగర శివారు ప్రాంతాల్లో తయారు చేస్తుంటారు. కొన్ని ముఠాలు పారిశ్రామిక వాడల్లో మూతపడ్డ ఫార్మా కంపెనీలు, గోదాములను అద్దెకు తీసుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకొని గుట్టుగా మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ముంబైకి చెందిన ప్రత్యేక క్రైమ్‌ పోలీసులు సైతం నగరంలో సోదాలు నిర్వహించారు. 


ఇవి కూడా చదవండిImage Caption