గంజాయి కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-05-18T05:58:28+05:30 IST

మండలంలోని త్రిపురవానిపాలెం జాతీయ రహదారిపై సోమవారం గంజాయి కారు బీభత్సం సృష్టించింది.

గంజాయి కారు బీభత్సం
త్రిపురవానిపాలెం రహదారిపై ఉన్న గంజాయి కారు

మహిళను ఢీకొట్టి డివైడర్‌పైకి దూసుకుపోయి వైనం
టైర్లు పేలిపోవడంతో కారును వదిలి దుండగలు పరారీ
కత్తితో మోటారు సైకిలిస్టును బెదిరించి బైకుపై ఉడాయింపు

కశింకోట, మే 17:
మండలంలోని త్రిపురవానిపాలెం జాతీయ రహదారిపై సోమవారం గంజాయి కారు బీభత్సం సృష్టించింది. ముందుగా ఓ మహిళను ఢీకొని డివైడర్‌పెకి కారు దూసుకుపోయింది. టైర్లు పేలిపోవడంతో రోడ్డు మధ్యలోనే దుండగలు కారును విడిచిపెట్టేశారు. అనంతరం కత్తితో బెదిరించి స్థానికుడి వద్ద బైకును లాక్కొని ఎలమంచిలి వైపు ఉడాయించారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న ఇన్నోవా కారు నూతనగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న కలిగెట్ల నాగమణి (37)ని ఢీకొంది. అనంతరం త్రిపురవానిపాలెం వద్ద యూటర్న్‌ తీసుకొని ఎలమంచిలి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి దూసుకుపోయింది. టైర్లు పేలిపోవడంతో దుండగలు కారును రోడ్డు మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం అటుగా బైకుపై వెళ్తున్న అప్పారావును ఆపి కత్తితో బెదిరించి బైకును లాక్కొన్నారు. అదే బైకుపై ఇద్దరు దుండగులు ఎలమంచిలి వైపు ఉడాయించారు. స్థానికులు, పలువురు వాహనచోదకులు ఆపేందుకు ప్రయత్నించినా కత్తిని చూపించి బెదిరిస్తూ పరారీ అయ్యారు. విషయం తెలియగానే హైవే పెట్రోలింగ్‌ పోలీసులు రంగంలోకి దిగి కారును పరిశీలించగా 120 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి.

మహిళ పరిస్థితి విషమం
కారు ఢీకొనడంతో గాయపడ్డ కలిగెట్ల నాగమణి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు చికిత్స కోసం ఎన్టీఆర్‌ వైద్య యంలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు విశాఖపట్నంలో వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాగమణి చికిత్స పొందుతున్నారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-18T05:58:28+05:30 IST