కమ్మేస్తున్న గంజాయి మత్తు

ABN , First Publish Date - 2021-10-25T04:39:34+05:30 IST

ఇటీవల కాలంలో పలువురు విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు.

కమ్మేస్తున్న గంజాయి మత్తు
గంజాయి పొట్లాన్ని చూపుతున్న సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీలక్ష్మి(ఫైల్‌)

విద్యార్థులకు వల వేస్తున్న విక్రయదారులు

50, 100 గ్రాముల పొట్లాలలో అమ్మకం

గుర్తించడంలో విఫలమవుతున్న తల్లిదండ్రులు

కళాశాల యాజమాన్యాలకు తెలిసినా.. పట్టించుకోని వైనం

భవిష్యత నాశనమవుతుందంటున్న వైద్యులు


నెల్లూరు(క్రైం) అక్టోబరు 24 : ఇటీవల కాలంలో పలువురు విద్యార్థులు గంజాయి మత్తుకు  బానిసలవుతున్నారు. విక్రయదారులు కూడా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు చేస్తున్నారు. కొంతకాలం క్రితం సెబ్‌ అధికారులు జిల్లాలో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్న సమయంలో నిందితులు విద్యార్థులకు గంజాయిని చిన్నచిన్న పొట్లాలు చేసి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. గతంలో చిన్నబజారు పోలీసులు డ్రగ్‌ రాకెట్‌ను అదుపులోకి తీసుకొని విద్యార్థులకు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు తేల్చారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, మెడికల్‌ విద్యార్థులు మత్తుకు ఎక్కువ బానిసలుగా మారుతున్నారు. కళాశాల యాజమాన్యాలకు ఈ విషయం తెలిసినా తల్లిదండ్రులకు విషయం తెలిపి మిన్నకుండిపో తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు మత్తుకు బానిసలవుతున్నారనే విషయాన్ని గుర్తించడంలో విఫలమ వుతున్నారు.  దీంతో విద్యార్థుల భవిష్యత నాశనం అవుతున్నదని వైద్యులు పేర్కొంటున్నారు.


బానిసలుగా మారుతూ..


విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్న సమయంలో స్నేహి తులు, క్లాస్‌మెట్స్‌, క్రీడల్లో పరిచమయ్యే వ్యక్తుల ద్వారా మత్తుకు అలవాటు పడుతున్నారు. అందుబాటు ధరల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న గంజాయికు  బానిసలుగా మారుతున్నారు. విద్యార్థుల కోసం అన్నట్లుగా విక్రయదారులు 50, 100 గ్రాముల  పొట్లాలలో గంజాయిను ప్యాక్‌ చేస్తూ రూ.100 నుంచి రూ.200 వరకు ఓ పొట్లాన్ని విక్రయిస్తున్నారు. విద్యార్థులు సిగరెట్‌లలో గంజాయి పొడిని కలుపుకొని పీలుస్తూ దానికి బానిసలు గా మారుతున్నారు. ఇక అక్కడ నుంచి మత్తు పదార్ధాలైన ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, బ్రౌనషుగర్‌, హెరాయిన వంటి వాటి రుచి చూసేందుకు ఇతర రాషా్ట్రల వైపు అడుగులు వేస్తున్నారు.


విద్యార్థులకు వల వేస్తూ...


గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను విక్రయించేవారు విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటూ, వారికి వల వేస్తున్నారు. విద్యార్థులు క్రికెట్‌ ఆడేసమయంలో, సినిమా లకు వచ్చినప్పుడు, కళాశాలలకు డుమ్మా కొట్టి నదులు, చెరువుల వద్ద ఈత కొడుతున్నప్పుడు, కేఫ్‌లలో సిగరెట్లు తాగుతున్న సమయంలో, బార్లు, బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నప్పుడు వారిని గమనిస్తున్న విక్రయ దారులు వారితో మాటలు కలుపుతున్నారు. మొదట ఉచితంగా కొంత గంజాయిని, మత్తు పదార్ధాన్ని ఇచ్చి ఇవి సేవిస్తే వస్తే ఆనందమే వేరంటూ తియ్యటి మాటలు చెబుతున్నారు. ఇలా నిదానంగా విద్యార్థులను మత్తుకు అలవాటు చేస్తూ ఆ తర్వాత అధిక ధరలకు వాటిని విక్రయిస్తున్నారు. 


ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడండి


విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్ధాలకు బానిసలైతే ఈ లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు.

మత్తుకు అలవాటు పడిన తర్వాత గతంలో లాగా వారి వ్యవహార శైలి ఉండదు.

ఇళ్లకు వచ్చిన వెంటనే కళ్లు ఎర్రగా అలిసిపో యినట్లు ఉండటం, ఎక్కువుగా చిరాకు పడటం చేస్తారు. 

కోపం ఎక్కువుగా రావడం, తమపై తాము నియంత్రణ కోల్పోవడం, చేతికి ఏది దొరికితే దాన్ని వస్తువులు పగుల గొట్టడం చేస్తారు.

సరిగా నిద్రపోకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవడం... వంటి లక్షణాలు తమ పిల్లలకు ఉంటే తల్లిదండ్రులు జాగ్రత్త  పడాలి.



 ఎంతోమందికి కౌన్సెలింగ్‌ ఇచ్చా...


గంజాయికి బానిసలైన ఎంతోమంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చా.  మత్తుకు బానిసైన వారు ఏకాగ్రతను కోల్పోతారు. వారిపై వారికి నియంత్రణ ఉండదు. విద్యార్ధులు మత్తుకు బానిసలయ్యారని గుర్తిస్తే వారిని ఒక్కసారిగా నియంత్రణ చేసేందుకు ప్రయత్నించ కూడదు. అసలు ఎలా మత్తుకు అలవాటు పడ్డారో తెలుసుకోవడం, కౌన్సెలింగ్‌ల ద్వారా జరగబోయే నష్టాల ను వివరించడం చేస్తూ ఆ అలవాటు నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలి. 

- డాక్టర్‌ సురేష్‌బాబు, మానసిక వైద్యనిపుణులు


Updated Date - 2021-10-25T04:39:34+05:30 IST