మత్తు.. యువత చిత్తు

ABN , First Publish Date - 2021-09-15T04:27:10+05:30 IST

మత్తు.. యువత చిత్తు

మత్తు.. యువత చిత్తు

గంజాయికి అలవాటుపడుతున్న యువకులు

నిర్మానుష్య ప్రదేశాల్లో ఏకాంతంగా గం‘జాయ్‌’

ఖమ్మం నగరంలో పాన్‌షాపులు, ఫ్లై ఓవర్లే అడ్డాలు

మానసిక క్షోభ అనుభవిస్తున్న తల్లిదండ్రులు

అమాయకులను వ్యాపారంలోకి దించుతున్న స్మగ్లర్లు

ఖమ్మం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): యువత భవి తవ్యం వ్యసనాలకు బానిసవుతోంది. మత్తుకోసం ఆరాటపడుతున్న యువత పలురకాల డ్రగ్స్‌ను ఆశ్రయిస్తోంది. కిక్కు కోసం పలు రకాల పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. రేటు ఎక్కువైనా పర్వాలేదు కాని మత్తు ఎక్కువ కావాలంటూ తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగా  గం‘జాయ్‌’కి అలవాటుపడుతున్నారు.గంజాయిని సిగరెట్లలో ఎక్కించి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఖమ్మం నగరంతోపాటు ఇతర ప్రధాన పట్టణాల్లోనూ గంజాయి విక్రయాలు, వాడకం జోరుగా సాగుతున్నాయి. మత్తుకోసం వ్యసనాల బారిన పడుతున్న యువతను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు గంజాయిని సరఫరా చేసి కాసులు సంపాదించుకుంటున్నారు. యువతకు మత్తును అలవాటు చేసితప్పుదోవ పట్టిస్తున్నారు. మెడికల్‌, ఇంజనీరింగ్‌ విద్యార్ధులతోపాటు కొందరు పేరొందిన వ్యక్తుల పిల్లలు కూడా ఈ వ్యసనాలకు అలవాటుపడి తమ భవితను గంజాయికి బానిస చేస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో ఆరేళ్లపాపపై ఓ వ్యక్తి చేసిన అఘాయిత్యం తీవ్ర సంచలనం రేపిన నేపథ్యంలో.. జిల్లాలో గంజాయి మత్తులో జోగుతున్న యువత గురించి కూడా జోరుగా చర్చ జరుగుతోంది. 

విస్తరిస్తున్న విష సంస్కృతి

కొందరు స్మగ్లర్లు గంజాయిని యువతకు అందజేసేందు కు పాన్‌షాపులను, ఫ్లైఓవర్లను అడ్డాలుగా ఎంచుకుంటున్నా రు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురం, ముస్తఫానగర్‌, మామిళ్లగూడెం, బైపాస్‌, మమత రోడ్డు లాంటి పలు ప్రాం తాలతోపాటు పలు పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలోని పాన్‌డబ్బాలను గంజాయి విక్రయాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నట్టు సమాచారం. ఆయా అడ్డాలలో ముందుగానే సిగరెట్లలో ఉన్న పొగాకు పొడిని బయటకు తీసి అందులో గంజాయి ఆకును జొప్పించి, సిగరెట్ల వారీగా రేట్లు నిర్ణయిస్తారు. తమకు తెలిసిన యువతకు మాత్రమే ఆ సిగరెట్లను విక్రయిస్తారు. కాగా కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులను, ఈజీమనీకి అలవాటు పడిన మరికొందరు యువతను ఈ వ్యాపారంలోకి దించుతున్నారు. కళాశాలల్లోకి కూడా ఈ విష సంస్కృతి విస్తరించడంతో ఒక విద్యార్థిని చూసి మరొకరు గంజాయికి అలవాటు పడిపోతున్నారు. అంతేకాదు అలా అలవాటు చేసేలా విద్యార్థులను వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. అలా దానికి బానిసైన విద్యార్థులు తమ వద్ద నగదు లేకుంటే సంబంధిత గంజాయి వ్యాపారులకు బైండోవర్‌ అయిపోతున్నారు. వారి వ్యాపారంలో భాగస్వాములుగా చేరుతున్నారు. యువత వ్యసనాన్ని ఆసరాగా చేసుకుంటున్న స్మగ్లర్లు మరికొంత డబ్బు ఆశ చూపి వారిని రవాణాకు వినియోగిస్తున్నట్టు సమాచారం. కాగా గతంలో జిల్లాలో పట్టుబడిన పలు సంఘటనల్లో పలువురు విద్యార్థులుం డటమే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

శివారు ప్రాంతాలు అడ్డాగా 

గంజాయి మత్తుకు అలవాటైన యువత పట్టణ శివారు ప్రదేశాల్లో ఏకాంతంగా దమ్ము కొట్టేందుకు సిద్ధపడుతున్నా రు. ఉదయాన్నే కళాశాలకు అని చెప్పి బయలుదేరిన విద్యార్థులు కొందరు శివారుప్రాంతాల్లో తమ స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తున్నా రు. మరికొందరు గంజా యికి అలవాటు పడిన యువత ప్రత్యేకంగా అద్దెకు గదులను తీసుకుని అందులో ఆయా పనులు ముగించు కుంటున్నారు. మరికొందరు రోడ్లపైకి వచ్చి గొడవలకు దిగు తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఖమ్మం నగరంలోని రాపర్తినగర్‌, గొల్లగూడెం రోడ్‌, అల్లీపురం రోడ్‌, వరంగల్‌ క్రాస్‌ రోడ్‌, కోదాడ క్రాస్‌రోడ్‌, గుర్రాలపాడుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు గంజాయి దమ్ముకొడుతున్నట్టు సమాచారం. బయటి ప్రాంతాలనుంచి ఖమ్మం నగరానికి వచ్చిన ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులు ఇక్కడ గదులు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఆయా విద్యార్ధుల్లో కొందరు హైదరాబాద్‌ నుంచి హుక్కాపాట్స్‌ను తీసుకువచ్చి గదుల్లో హుక్కా కొడుతున్నారు. అంతేకాదు హుక్కా ఫ్లేవర్లలో గంజాయిని కూడా కలిపి మత్తును ఆస్వాదిస్తున్నారు. 

క్షోభ అనుభవిస్తున్న తల్లిదండ్రులు.. 

గంజాయిని నిత్యం వాడటం వల్ల దానికి పూర్తిగా బాని సలవుతున్న వారు చివరికు అది లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. బానిసలుగా మారిన వారిలో యూపీరియా (ఉన్నదిలేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా... మైకంలో తేలి ఆడటం)కు గురవుతారు. దీనిని సాధారణంగా సిగరెట్లు,హుక్కాలో కలిపి మత్తును ఆస్వాదిస్తారు. దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లడం, యాంగ్జైటీకి లోనుకావడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం లాంటివి జరుగుతాయి. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, గ్రహణశక్తి కోల్పోవడం, అధిక దాహం, మలబద్ధకం, మతిభ్రమించిన వాడిలా లక్షణాలుంటాయి. కాగా తమ పిల్లలు గంజాయికి అలవాటుపడినట్టు ఇంట్లోని తల్లి దండ్రులకు తెలిసినా బయటకు చెప్పుకోలేక ఆందోళన చెందుతున్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు అలవాటు పడిన పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇప్పించినా మళ్లీ అదే బాటలో నడవడంతో  మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. అంతేనా కొందరు యువత ఇళ్లల్లో తమ తల్లిదండ్రులపైనే దాడులకు దిగే పరిస్థితి జిల్లాలో నెలకొంది. అంతేకాదు దానికి అలవా టు పడిన యువత పోలీసులను సైతం లెక్కచేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. వారు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేస్తారన్న భావనలో కొందరు యువత ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, శివార్లలో నిఘాపెంచి గంజాయి దమ్ముకొడుతున్న యువకు లకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-09-15T04:27:10+05:30 IST