Abn logo
Oct 27 2021 @ 01:22AM

గంజాయి అంతానికి దిశానిర్దేశం

రాజమహేంద్రవరంలో జరిగిన సమీక్షలో పాల్గొన్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

రాజమహేంద్రవరం కేంద్రంగా వ్యూహరచన సమావేశం

ఉన్నతాధికార్లతోపాటు అన్ని జిల్లాల అధికారులు హాజరు

ఆంధ్రా, ఒడిసా బోర్డర్‌లోనే గంజాయి సాగు : డీజీపీ సవాంగ్‌

 రాజమహేంద్రవరం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీసు పంతం పట్టింది. దీనికి రాజమహేంద్రవరం కేంద్రంగా వ్యూహరచన చేశారు. ఏపీ డీజీపీ డీ గౌతమ్‌సవాంగ్‌ ఆధ్వర్యంలో మంజీరా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం గంజాయిపై వ్యూహరచన చేయడానికి  రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మన జిల్లాలోని ఏజెన్సీ, జాతీయ రహదారుల మీదుగా అనేకసార్లు గంజాయి రవాణా జరుగుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. పైగా ఒడిసా- ఆంధ్ర బోర్డర్‌లోనే అధికంగా గంజాయి సాగు జరుగుతుందనే ధృవీకరణకు వచ్చిన పోలీసులు రాజమహేంద్రవరంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడీజీపీ లాఅండ్‌ ఆర్డర్‌  ఏ రవిశంకర్‌, గ్రేహాండ్‌ ఏడీజీ ఆర్‌కే మీనా, బెటాలియన్‌ ఏడీజీ డాక్టర్‌ శంకర్‌ బ్రత బాగ్చి, సెబ్‌ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌, సెబ్‌ డీఐజీ ఎ.రమేష్‌రెడ్డి, ఏలూరు డీఐజీ  కేవీ మోహనరావు, వైజాగ్‌ డీఐజీ కేఎల్‌వీ రంగారావు, టెక్నికల్‌ సర్వీస్‌ డీఐజీ జీ పాలరాజు, పశ్చిమగోదావరి ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ,  తూర్పు ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు, వైజాగ్‌ రూరల్‌ ఎస్పీ బీ కృష్ణారావు, విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌ విక్రాంత్‌ పాటిల్‌, విజయనగరం ఎస్పీ ఎం దీపిక,     విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్మ, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ  ఐశ్వర్యరస్తోగితోపాటు 13 జిల్లాలకు సంబంధించిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, ఒడి షా బోర్డర్‌లోనే  గంజాయి సాగు జరుగుతోందని, గతంలో 3 వేల ఎకరాల వరకూ గంజాయి పంటను ధ్వంసం చేశారని, ఈసారి తాము 4,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  ఇప్పటికే సరిహద్దు రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికార్లతోకూడా చర్చించినట్టు తెలిపారు. గంజాయి వ్యాపారం కోసం ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, సాగు చేసేదెవరు, ఏఏ మార్గాల ద్వారా రవాణా అవుతోంది, రవాణాకు ఏ వర్గాలను వాడుకుంటున్నారు, ఎక్కడెక్కడికి ఇది సరఫరా అవుతోంది, ఎవరు విక్రయిస్తున్నారు, ఎవరు వాడుతున్నారనే విషయాలను ఇప్పటికే చాలావరకూ సేకరించామన్నారు. ఇక్క డ వ్యూహంతోపాటు యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. ఇక ఈ సమావేశంలో ఆయా ప్రాంతాల వారీగా సమీక్షించినట్టు సమాచారం.