వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకున్నా.. కంచికి చేరని గన్నవరం కథ

ABN , First Publish Date - 2020-10-16T18:21:32+05:30 IST

గన్నవరం వైసీపీలో వర్గపోరుకు తెరపడలేదా? స్వయంగా సీఎం జగన్‌ చొరవ తీసుకుని రాజీ కుదిర్చినా నాయకుల మధ్య విభేదాలు ఆగడం లేదా? ముఖ్యమంత్రి ముందు చేతులు కలిపిన ప్రత్యర్థులు

వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకున్నా.. కంచికి చేరని గన్నవరం కథ

గన్నవరం వైసీపీలో వర్గపోరుకు తెరపడలేదా? స్వయంగా సీఎం జగన్‌ చొరవ తీసుకుని రాజీ కుదిర్చినా నాయకుల మధ్య విభేదాలు ఆగడం లేదా? ముఖ్యమంత్రి ముందు చేతులు కలిపిన ప్రత్యర్థులు ఆ తర్వాత కత్తులు దూసుకుంటున్నారా? ఆయన ముందు నవ్వులు పులుముకుంటున్నా..ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారా? సీఎం రాజీ ప్రయత్నాలు ఎందుకు వికటించాయి? అక్కడ జరుగుతున్న మూడు స్తంభాలాట వెనకున్న అసలు కథపై ఏబీఎన్ ఇన్ సైడ్ స్టోరీ...


కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటాయి. నాయకుల మధ్య కుమ్ములాటలు హై టెన్షన్‌ తలపిస్తుంటాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌  వైసీపీ గూటికి చేరిన నాటి నుంచి ఇక్కడి రాజకీయం రగులుతూనే ఉంది. వంశీ రాకను ఆయన చేతిలో ఓడిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకించారు. సీఎం జగన్ నచ్చచెప్పి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఆ తర్వాత యార్లగడ్డ వెంకట్రావుకు కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ గన్నవరంలో వర్గపోరు తగ్గలేదు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ వెళ్లిన కార్యక్రమాలను యార్లగడ్డ, దుట్టా వర్గీయులు వ్యతిరేకించటం ప్రారంభించారు. అయితే యార్లగడ్డకు చెక్‌ పెట్టేందుకు దుట్టా రామచంద్రారావుతో వంశీ చేతులు కలిపారు. కానీ వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్రారావు రివర్స్‌ అయ్యారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా యార్లగడ్డతో దోస్తీ చేశారు దుట్టా. ఈ పరిణామాల తర్వాత ఎమ్మెల్యే వంశీకి.. దుట్టా, యార్లగడ్డ వర్గాలకు మధ్య అస్సలు పడటం లేదు. ఈ మూడు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ మూడు స్తంభాలాటలో అధికార యంత్రాంగం కూడా నలిగిపోతోంది. ఎవరిమాట వినాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 




ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో మరోసారి కుమ్ములాటలకు ఆజ్యం పోసింది. పోలీసుల ఆంక్షలను ఎదిరించి యార్లగడ్డ అనుచరులు నున్నలో పెద్ద ఎత్తున బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీతో కలిసి పనిచేయలేనని సీఎం జగన్‌కు ఈ విషయాన్ని ముందే చెప్పానని యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ తరుణంలో నియోజకవర్గంలో నిజమైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ దుట్టా రామచంద్రరావు..వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఆరోపించారు. దాంతో వైవీ సుబ్బారెడ్డి...ఎమ్మెల్యే వంశీ, మంత్రి కొడాలి నానిని పిలిపించి సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో వర్గపోరు శ్రుతిమించడంతో గన్నవరం పంచాయతీ సీఎం జగన్ దగ్గరికెళ్లింది. వైవీ సుబ్బారెడ్డి సైతం ఇక్కడి గొడవలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 


వైవీ సుబ్బారెడ్డి లాంటి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీకి యత్నించినా గన్నవరం పంచాయితీ కొలిక్కి రాలేదు. ఈ సమస్యకు ముగింపు ఏంటా అని అనుకుంటున్న సమయంలో పునాదిపాడులో సీఎం జగన్‌ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలు అనూహ్య మలుపు తిప్పాయి. ఇక్కడ జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. సీఎం జగన్‌కు వీడ్కోలు పలికేందుకు ఎమ్మెల్యే వంశీమోహన్, మంత్రి కొడాలి నాని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కలుద్దామని యార్లగడ్డ వెంకట్రావు వెళ్లగా..మంత్రి కొడాలి నాని ద్వారా ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పిలిపించారు ముఖ్యమంత్రి. వంశీ, యార్లగడ్డ చేతులు కలిపి మాట్లాడారు సీఎం జగన్‌. విభేదాల్లేకుండా కార్యకర్తలు ఇబ్బందిపడకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని నేతలిద్దరికీ సూచించారు. ఆ తర్వాత వంశీమోహన్ గన్నవరం ఇన్చార్జ్‌గా తానే ఉంటానని ప్రకటించారు. కానీ వంశీ, యార్లగడ్డ మధ్య సీఎం రాజీ కుదిర్చినా అది ఎంతో సేపు నిలవలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరిదారి వారిది అన్నట్లుగా ఇద్దరు వ్యవహరించారు. 



ఎమ్మెల్యే వంశీ తమకు అన్యాయం చేస్తున్నారంటూ దుట్టా, యార్లగడ్డ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే వంశీ మాత్రం తాను అందర్నీ కలుపుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాననీ.. గ్రామస్థాయిలో ఉన్న చిన్నచిన్న సమస్యలనూ పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు. పునాదిపాడు ఎపిసోడ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శిబిరానికి ఆనందాన్ని తీసుకొచ్చిందట. అదే సమయంలో యార్లగడ్డ మాత్రం రగిలిపోతున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే సాక్షాత్తు సీఎం జగన్ జోక్యం చేసుకున్నా గన్నవరంలో నాయకుల మధ్య వర్గపోరుకు అడ్డుకట్ట పడటం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారట. మొత్తంగా మూడు స్తంభాలటలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. 

Updated Date - 2020-10-16T18:21:32+05:30 IST