త్వరలోనే ‘చెత్త పన్ను’!

ABN , First Publish Date - 2021-06-21T09:10:50+05:30 IST

ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా.. విమర్శలు వచ్చినా.. ‘మా దారి మాదే’ అన్నట్లుగా పురపాలక శాఖ వ్యవహరిస్తోంది.

త్వరలోనే ‘చెత్త పన్ను’!

ప్రజాందోళనను పట్టించుకోని సర్కారు.. వచ్చే నెల 8న ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ షురూ

ఆ వెంటనే పట్టణ ప్రజలపై పన్ను భారం! 

ప్రతి ఇల్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి ఏడాదికి దాదాపు రూ.750 కోట్లు వసూళ్లు 

సమాయత్తమవుతున్న పురపాలక శాఖ 

కరోనా విపత్కాలంలోనూ ప్రజలపై బాదుడు 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా.. విమర్శలు వచ్చినా.. ‘మా దారి మాదే’ అన్నట్లుగా పురపాలక శాఖ వ్యవహరిస్తోంది. త్వరలోనే పట్టణ ప్రజలపై ‘చెత్త పన్ను’ భారం మోపేందుకు సమాయత్తమవుతోంది! వచ్చే నెల 8వ తేదీన రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం ప్రారంభం కాగానే పురపాలక శాఖ ఆదేశాల మేరకు పట్టణ స్థానిక సంస్థలు చెత్త పన్ను వసూళ్లకు శ్రీకారం చుట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మున్సిపల్‌ కమిషనర్ల సారఽథ్యంలో ఆ దిశగా ముందుకు కదులుతున్నట్లు సమాచారం. కాగా ఆస్తి విలువ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటు ప్రతి ఇల్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి నెలనెలా ముక్కు పిండి వసూలు చేయాలనుకుంటున్న ‘చెత్త పన్ను’ వద్దని రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు జరిగాయి.


ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో పలు సంఘాలు, అసోసియేషన్ల ప్రజాగ్రహాన్ని, పట్టణ వ్యవహారాల్లో నిపుణులైన వారి అభిప్రాయాలను తోసిరాజని చెత్త పన్ను విధించేందుకు ఈ శాఖ సిద్ధమవుతోంది. పట్టణ ప్రాంతాలను అద్దాల్లా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్లాప్‌’ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ఊదరగొడుతోంది. అన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరించడమే కాకుండా వాటిని పర్యావరణహితంగా తరలించడమే ప్రధాన ధ్యేయంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ కొన్ని నగరాలకే పరిమితమైన ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణను విస్తరింపజేయనున్నట్లు చెబుతోంది. 


భారీ వసూళ్లకు స్కెచ్‌!?

‘క్లాప్‌’ పథకం ద్వారా పట్టణ వాసుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగవుతాయని పేర్కొంది. దీనికోసం వందలాది కోట్ల రూపాయల వ్యయంతో ఎలకా్ట్రనిక్‌ హైడ్రాలిక్‌ టిప్పర్లు, డంపర్లు తదితరాలను కొనుగోలు చేసేందుకు యత్నాలు జోరుగా చేస్తోంది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ శాఖ ఉన్నతాధికారులు కొంతకాలంగా ‘క్లాప్‌’పైనే దృష్టి కేంద్రీకరించారు. వినడానికి ఇదంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. పట్టణ ప్రజలపై వందలాది కోట్ల రూపాయల భారం పొంచి ఉంది! ఈ పథకం అమలుకు పట్టణ స్థానిక సంస్థలు వెచ్చించే సమస్త వ్యయాన్నీ ప్రజల నుంచే సమకూర్చుకోవాల్సి ఉంది. వ్యర్థాల సేకరణ, వాటిని డంపింగ్‌ యార్డులకు తరలించడం, పర్యావరణహితంగా వాటిని పునర్వినియోగించుకోవడం.. వంటి వాటికి అయ్యే ఖర్చంతా ప్రజలే భరించాల్సి ఉంటుంది!


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు కోటిన్నరమంది పట్టణ వాసులు ఏడాదికి దాదాపు రూ.750 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా! ‘క్లాప్‌’ అమలుకయ్యే  ఖర్చులు పెరిగినప్పుడల్లా (ఏటా 5 శాతానికి తగ్గదని అంచనా) చెత్త పన్ను కూడా పెరుగుతూ పోతుంది! ‘నిబంధనలు అతిక్రమిస్తే’ విధించే జరిమానాలు అదనం. వెరసి ఇది అంతకంతకూ జేబులను ఖాళీ చేసే ‘బృహత్తర పథకం’గా నిలవబోతోందనే విమర్శలు వస్తున్నాయి. 


ఇళ్లు, వాణిజ్య సంస్థల నుంచి.. 

వ్యర్థాల సేకరణ సేవా రుసుం (చెత్త పన్ను) వసూళ్లు మొదలైతే పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉండే కుటుంబాలు కూడా నెలకు రూ.60 నుంచి రూ.120 మధ్యన చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలైతే కేటగిరీని బట్టి నెలకు రూ.100 నుంచి రూ.10,000 వరకూ వసూలు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.


రోడ్ల పక్కన ఉండే చిరుతిండ్ల బండ్ల నుంచి స్టార్‌ హోటళ్లు, బార్లు, సినిమా థియేటర్లు, ఆస్పత్రులు, ఫంక్షన్‌ హాళ్లు, ల్యాబొరేటరీలు.. వంటి 54 వ్యాపారాలను వాణిజ్య కేటగిరీగా గుర్తించి, వాటి నుంచి ఎంతమేరకు చెత్త పన్ను వసూలు చేయాలో పురపాలక శాఖ నిర్దేశించింది.. కరోనా విపత్కాలంలో ఉపాధి అవకాశాలు కోల్పోయి, వ్యాపారాలు లేక కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, చెత్త పన్ను వసూలు చేయాలన్న నిర్ణయం తగదంటూ అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవ, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా చెత్తపన్ను భారం మోపేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. 


‘చెత్తపన్ను’పై ఉధృతంగా పోరు

పౌరసంఘాలతో కలసి ఉద్యమిస్తాం 

ఏపీ పట్టణ పౌరసమాఖ్య నిర్ణయం

29, 30న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన 


విజయవాడ (గవర్నర్‌పేట), జూన్‌ 20: ప్రజలపై పన్నుల భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పౌర సంఘాలతో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదే శ్‌ పట్టణ పౌర సమాఖ్య నిర్ణయించింది. సమాఖ్య రాష్ట్ర సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్లీన్‌ ఏపీ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల జేబులను ఖాళీ చేసే పని చేపట్టిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని విమర్శించారు. ఇందుకు నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపల్‌ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని తెలిపారు.


చెత్తపన్నును ప్రజలు స్వాగతిస్తున్నారని చెబుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్తపన్నుపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం కావాలన్నారు. పట్టణాల్లో నివసిస్తున్న 50 లక్షల కుటుంబాలపై చెత్తపన్ను రూపంలో ఏడాదికి రూ.500 కోట్లు, ఐదు లక్షల మంది చిన్న, మధ్యతరగతి వ్యాపారులపై రూ.250 కోట్లు భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-06-21T09:10:50+05:30 IST