Advertisement
Advertisement
Abn logo
Advertisement

గర్భగుడి చుట్టూ కందకం-.. కులం!!

వరుసగా నాలుగు మంచిమాటలకు అర్హత కలిగిన ముఖ్యమంత్రులు ఎప్పుడైనా ఉన్నారా? పైకి అంగీకరించడం కష్టం అనుకుంటే, కనీసం మనసులో అయినా అనుకున్నామో లేదో తెలియదు. అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మెరిపించిన నాయకులు లేకపోలేదు. ఆ మేరకు విమర్శల నుంచి మినహాయింపు ఇస్తామేమో కానీ, పెదవి విప్పి ప్రశంసించడం కష్టం. అటువంటిది, కలైంజర్ టీవీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీద నాలుగు మంచి మాటలు మాట్లాడమంటే, ఒప్పుకోవడం కష్టమేమీ అనిపించలేదు. అతను మునుపు ఎట్లా ఉన్నాడో, రేపు ఎట్లా ఉండబోతాడో ఏమీ తెలియదు. ముంచుకు వచ్చిన పరిస్థితులు అతడికి సాపేక్ష యోగ్యతను పెంచాయి తప్ప, అంతకుమించి ఆశించడానికి ఏమీ ఉండకపోవచ్చు.


తనని అదే పనిగా పొగిడి సభా సమయం వృథా చేయవద్దని స్టాలిన్ తన పార్టీ శాసనసభ్యులను హెచ్చరించారన్న వార్త పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో పాఠకులను బాగా ఆకట్టుకుంది. అధికార రాజకీయాలలో ప్రశంస, ప్రశంసను ఆనందించే ధోరణి అధికంగా ఉంటాయి. స్టాలిన్ నిజంగా ప్రశంసాప్రియత్వాన్ని అధిగమించాడో లేదో తెలియదు కానీ, తన ప్రతిష్ఠను పెంచుకునే వరుస చర్యలలో భాగంగా, ఈ హెచ్చరిక కూడా చేశాడు. మన మీడియాలో వివక్షలు, రాగద్వేషాలు ఎంతగా అంతర్భాగమై ఉంటాయంటే, స్టాలిన్ ఇతర నిర్ణయాలకు ఇంతటి ప్రచారం రాలేదు. నిజానికి, ఎక్కువగా మాట్లాడుకోవలసినవీ, చర్చించవలసినవీ ఆ నిర్ణయాలే.


ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అని పిలవనని, సమాఖ్య ప్రభుత్వమని వ్యవహరిస్తానని డిఎంకె ప్రభుత్వం చెప్పినప్పుడే, కొత్త రకం చర్చలకు, చర్యలకు దారితీసే ధోరణి నూతన నాయకత్వంలో ఉన్నదన్న సూచన లభించింది. సిద్ధాంతవాదిగా, ప్రజానాయకుడిగా తనకు సొంతంగా తగినంత ప్రతిష్ఠ లేనందున, పెరియార్, అన్నాదురై దగ్గర నుంచి కరుణానిధి తొలిఅడుగుల దాకా స్టాలిన్ పదే పదే ఆలంబన చేసుకుంటున్నాడు. అందుకు కావలసిన వెన్నుదన్ను ఏదో ఆ పార్టీ వ్యవస్థలో ఉన్నట్టున్నది. నూతన విద్యావిధానాన్ని సూత్రబద్ధంగా వ్యతిరేకించడం, ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకున్నవారికి వృత్తి విద్యాసంస్థలో రిజర్వేషన్ కల్పించడం, ప్రజారంగంలో పనిచేస్తున్న మేధావులను, కార్యకర్తలను నిరంకుశ చట్టాల ద్వారా కేంద్రం ఎడతెగని నిర్బంధంలో ఉంచడాన్ని నిలకడగా వ్యతిరేకించడం, తాజాగా రైతు వ్యతిరేక చట్టాలపై శాసనసభలో తీర్మానం చేయించడం అందరి దృష్టినీ తమిళనాడు మీదకు మళ్లించాయి. గుడులలో అర్చనలు చేయించేటప్పుడు భక్తులు మంత్రాలు తమిళంలో చదవాలని కోరేందుకు అవకాశం కల్పించడం కూడా ఆసక్తికరమైది. వీటన్నిటి కంటె కీలకమయినది, దీర్ఘకాలంగా అమలుకాకుండా నిలిచిపోయిన బ్రాహ్మణేతర అర్చకుల నియామకాల విషయంలో సాహసంతో నిర్ణయం తీసుకోవడం. దేవాలయాలలో బ్రాహ్మణాధిపత్యం పెరియార్ మనసులో ముల్లులా మిగిలిపోయిందని, ఆ ముల్లును తీసేయాలని కరుణానిధి 1970ల మొదట్లోనే ప్రయత్నించారు. న్యాయవ్యవస్థ ఆనాడు సహకరించలేదు. 2006లో మరోసారి ప్రయత్నించారు. పూర్తిగా సానుకూలత లభించలేదు కానీ, ఒక దారి కనిపించింది. ఆగమశాస్త్ర ప్రకారం శిక్షణ పొందితే, ఏ కులం వారినైనా అర్చకులుగా నియమించుకునే అవకాశం లభించింది. అర్చకులకు శిక్షణ కోసం ఒక విద్యాసంస్థను నెలకొల్పి, మొదటి విడతగా 206 మందికి శిక్షణ ఇస్తే, వారిలో ఒక్కరంటే ఒక్కరికి పన్నెండేళ్ల పాటు ఏ నియామకమూ లేదు. పెరియార్ బాధను తొలగించలేదన్న తన తండ్రి బాధను స్టాలిన్ తొలగించే ప్రయత్నం చేశారు. మొదటి విడతగా ఒక మహిళ, కొందరు దళితులతో సహా 75 మంది బ్రాహ్మణేతరులకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటికీ, ఆ ప్రక్రియ ఏ ఆటంకమూ లేకుండా ముందుకు వెడుతుందని కాదు, శిక్షణ పొందినవారిని ఎక్కడ ఏ విధినిర్వహణలో నియమిస్తారు, ప్రధాన ఆలయాల్లోనా చిన్న గుడులలోనా వంటి ప్రశ్నలకు ఇంకా ఆస్కారం ఉంటుంది. కాకపోతే, ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా మధుర మీనాక్షి ఆలయంలో ముగ్గురు బ్రాహ్మణేతరులను అర్చకులుగా తీసుకున్నారు.


దేవాలయాల్లో దళితులను, శూద్రులను అర్చకులుగా తీసుకోవాలనే డిమాండ్ ఎందుకు? ఎందుకంటే, కులవ్యవస్థలో అన్నిటికంటె పై మెట్టులో ఉన్న కులానికి, సామాజిక ఆధిక్యాన్ని కల్పిస్తున్న వాటిలో అర్చకత్వం, పౌరోహిత్యం కూడా ఉన్నాయి. ఆ వృత్తులను ప్రజాస్వామ్యీకరించగలిగితే కుల తారతమ్యాలు బలహీనపడతాయి. భగవంతుడికి భక్తుడికి మధ్య వ్యవహరించగలిగేవారు, అంకిత భావం కలిగి ఉండి, శాస్త్రవిధి తెలిసి ఉంటే సరిపోతుంది కానీ, కుల అర్హతలెందుకు? ‘‘...ఉన్నత విద్య, ఉపాధి, ఆర్థికశక్తి దళితులకు భౌతిక ప్రతిపత్తిని పెంచుతాయి, వాటి ద్వారా క్రమంగా సామాజిక ప్రతిపత్తి కూడా ఎప్పటికో మారవచ్చు, మారకున్నా భౌతిక నష్టమేమీ లేదు. అట్లా కాక, దేవాలయ ప్రవేశం వంటి నినాదాల వల్ల దళితులకు ఏమి ప్రయోజనం, ఏ ప్రతిపత్తి మారుతుంది?’’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒకసారి ప్రశ్నించారు. కేవలం దేవాలయాలలోకి ప్రవేశమే అయితే, ప్రయోజనమేమీ లేదని, అది అసమానత్వాన్ని, చాతుర్వర్ణ వ్యవస్థను, కులాన్ని నిర్మూలించడానికి చేసే పోరాటంలో మొదటి అడుగు అయితే దాని గురించి ఆలోచిస్తామని ఆయన దేవాలయ ప్రవేశ బిల్లుపై గాంధీజీతో జరిగిన చర్చలో చెప్పారు. దేవాలయాల్లో దళితుల ప్రవేశానికి అంబేడ్కర్ కూడా సత్యాగ్రహం నిర్వహించి, సవర్ణ సమాజం స్పందన ఎట్లా ఉంటుందో సహచరులకు అర్థమయ్యేట్టు చేశారు. ఆ తరువాత ఆయన దేవాలయ ప్రవేశ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అంబేడ్కర్ చెప్పిన కుల నిర్మూలన ప్రయాణంలో ఆలయ ప్రవేశం తొలి అడుగు అయి ఉంటే, ఆలయాలలో అర్చకులుగా దళితులు నియమితులు కావడం బహుశా మరొక మజిలీ అయి ఉండేది. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాల కంటె కూడా, ఆలయ గర్భగుడిలో దళిత అర్చకుడు, సమానత్వ ఆదర్శాలకు గీటురాయి.


తిరుమల తిరుపతి దేవస్థానం 200 మంది దళితులను ఎంపిక చేసి మూడు నెలల పాట అర్చక శిక్షణ ఇచ్చింది కానీ, వారిని దళితులు అధికంగా నివసించే ప్రాంతాలలో నూతనంగా నిర్మించే ఆలయాలలో పూజారులుగా నియమిస్తామని చెప్పింది. దేశంలో సవర్ణులకు ప్రధాన దైవ క్షేత్రాలుగా  ఉన్న చోట బ్రాహ్మణేతర అర్చకులు ఎక్కడా కనిపించరు. విశ్వహిందూ పరిషత్తు వారు కూడా హిందువుల మధ్య అసమానతలను తొలగించే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా 5000 మంది దళితులకు అర్చకులుగా శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నారు. శిక్షణ పొందినవారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వారున్నారట. వారు ఎక్కడెక్కడ అర్చకులుగా ఉన్నారో వివరాలు తెలియవు. అయోధ్య రామాలయం నిర్మాణానికి 1989లో జరిగిన శిలాన్యాస కార్యక్రమాన్ని కామేశ్వర్ చౌపల్ అనే దళితుడి చేత చేయించారు. 1964లో ఏర్పడిన పరిషత్ హిందువుల ఐక్యతకు కుల అసమానతలు కారణమని గుర్తించి, హిందువులందరూ సోదరులే, అస్పృశ్యులెవరూ లేరంటూ 1969లో ఉడిపి మహాసభలో పీఠాధిపతుల చేత ప్రకటన చేయించింది. దురదృష్టవశాత్తూ, ఈ యాభై ఏళ్ల కాలంలో కులం సమసిపోలేదు. దళితులపై అత్యాచారాలను సమర్థించే మతగురువులను కూడా చూస్తున్నాము. విహెచ్‌పి కూడా ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి, హిందువులలో ఉన్న సాంఘిక జాడ్యాలను తొలగించే కృషి చేసి ఉంటే ఐక్యత మరింత మెరుగుగా సాధించేదేమో? లోకంలోని మరే దైవం కన్నా అయోధ్య లోని శ్రీరాముడు న్యాయానికి ప్రతీకగా కనిపిస్తాడని ఆలయ నిర్మాణ ఆరంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరి, రామాలయంలో సామాజిక న్యాయం సంగతేమిటన్న ప్రశ్న రావాలి కదా? వెనుకబడిన కులానికి చెందిన ప్రధానమంత్రి ఆలయ కార్యక్రమానికి సారథ్యం వహించారు నిజమే, కానీ, రాముడిని అర్చించే పూజారులలో శూద్రులు ఉన్నారా, దళితులు ఉంటారా? అని సామాజిక శాస్త్రవేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. ఈ ప్రశ్న కమ్యూనిస్టులు, ఉదారవాదులు ఎందుకు వేయడం లేదని ఆయన నిలదీశారు.


అయోధ్యనే కాదు, యాదాద్రి విషయంలోనూ ఈ ప్రశ్న రావాలని ఐలయ్య అంటున్నారు. దళిత బంధు పథకం అన్నారు సరే కానీ, యాదాద్రిలో ఒక శూద్రుడినో, దళితుడినో అర్చకులుగా ఎందుకు నియమించరు? అని ఆయన ఈ మధ్య ఒక జూమ్ చర్చలో అడిగారు. ఆ సామాజిక స్థాయి కల్పిస్తే, పదిలక్షలు అవే సమకూరతాయని, సమాజ స్వరూపంలోనే మౌలిక మార్పు వస్తుందని ఆయన అభిప్రాయం. ఆయన అడిగినా, కులనిర్మూలనవాదులందరూ అడిగినా, ఎందుకు ఇంకా గర్భగుడులు కులతత్వంలో ఉన్నాయన్న ప్రశ్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే, సమాజంలో చర్చను రేపేదే. కానీ, ఎవరో ఒకరు ఇటువంటి విస్ఫోటక ప్రశ్నలు వేయకపోతే, మన సామాజిక న్యాయ ఆదర్శాల డొల్లతనం బయటపడేది ఎట్లా?


ఇతర ముఖ్యమంత్రులతో పోల్చి స్టాలిన్‌ను ఎట్లా అంచనా వేస్తారని కలైంజర్ టీవీ యాంకర్ అడిగాడు. తమిళ నాయకుడి ముందు మన తెలుగు ముఖ్యమంత్రులను చిన్నబుచ్చడం మంచిది కాదని మొదట అనిపించింది. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు కదా? ఇండియా టుడే వాడు చెప్పాడని కాదు కానీ, తెలుగు నాయకుల రేటింగ్ మరీ పడిపోయింది!

కె. శ్రీనివాస్

Advertisement
Advertisement