గ్యాస్‌ మంట

ABN , First Publish Date - 2022-03-23T05:29:33+05:30 IST

రోజురోజుకూ ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తరచూ పెంచేస్తోంది.

గ్యాస్‌ మంట

- సామాన్యునిపై సర్కారు బాదుడు

- సిలిండర్‌పై మరోసారి రూ.50 పెంపు

- గ్రామాల్లో అటకెక్కనున్న సిలిండర్‌లు

- రవాణా చార్జీల పేరిట తప్పని అదనపు దోపిడీ


కామారెడ్డి, మార్చి 22: రోజురోజుకూ ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తరచూ పెంచేస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100కుపైగా పెరుగగా సబ్సిడీ గ్యాస్‌ ధర మరోసారి రూ.50 పెంచేయడంతో ప్రస్తుతం రూ.1002కి  చేరింది. ఇలా వంటగ్యాస్‌ ధర తరచూ పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను ఆందోళన పరుస్తున్నాయి. దీనికి తోడు  రవాణా చార్జీల పేరిట గ్యాస్‌ డిస్ర్టిబ్యూటర్‌లు అదనపు డబ్బులు వసూలు చేస్తుండడంతో  ప్రస్తుతం సామాన్యుడు ఒక సిలిండర్‌కు రూ.1020 నుంచి 1050 వరకు చెల్లించాల్సి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు అదనపు వసూళ్లతో వంట గ్యాస్‌ సిలిండర్‌ సామాన్యులు మోయలేనంత బరువెక్కుతోంది. 

నెలలో వ్యవధిలోనే భారీగా పెంపు

కేంద్ర ప్రభుత్వం నెలల వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భారీగా పెంచింది. గత సంవత్సరం నుంచి సిలిండర్‌ ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ప్రతీసారి గ్యాస్‌ ధర పెంపుపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఇలా నెలల వ్యవధి కాలంలోనే వంటగ్యాస్‌ ధరను పెంచడం మంచిది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వంటగ్యాస్‌ ధర మండిపోతుందని కొనుగోలు చేసిన గ్యాస్‌ సిలిండర్‌ను పొదుపుగా వాడుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇలాంటి తరుణంలో గ్యాస్‌ సిలిండర్‌లను ఉపయోగించలేని పరిస్థితి కేంద్రప్రభుత్వం తీసుకువస్తుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ ధర పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. దీంతో వంటలు చేసుకునేందుకు కట్టెలపొయ్యే దిక్కవుతుందని ప్రజలు వాపోతున్నారు.

రవాణా చార్జీల పేరిట అదనపు దోపిడీ

జిల్లాలో గ్యాస్‌ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్‌ ఏజెన్సీలు 5 కిలో మీటర్ల పరిధిలో ఉచితంగా డోర్‌ డెలివరీ చేయాలి. 30 కిలో మీటర్ల లోపు రూ.10లు, అంతకు ధర పెంచినప్పుడల్లా రవాణా చార్జీలు రూ.5 నుంచి పది వరకు పెంచుకుంటూపోతున్నారు. కొన్ని ఏజెన్సీలు డోర్‌ డెలివరీ చేయలేమని తమ వద్దకే వచ్చి తీసుకెళ్లాలని షరతులు పెడుతున్నారు. దీంతో వినియోగదారులు అవసరం కొద్ది అదనంగా సొమ్ము చెల్లించి గ్యాస్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో సిలిండర్‌ను డెలవరీ చేయాలంటే డెలవరీ బాయ్‌ సిలిండర్‌కు రూ.20 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం ఎల్‌పీజీ గ్యాస్‌ ధర రూ.1002 డెలివరి బాయ్‌ చార్జీలు కలుపుకుంటే రూ.1050కి చేరుతోంది. ఇలా గ్యాస్‌ ధరలు పెరగడంతో వినియోగించలేని పరిస్థితి ఎదురవుతుందని వినియోగదారులు పేర్కొంటున్నారు.

పల్లెలో అటకెక్కనున్న సిలిండర్లు

గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు వినియోగాన్ని తగ్గించేందుకు దీపం పథకం, ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో సబ్సిడీపై గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చారు. అడవుల రక్షణ, మహిళల అనారోగ్యం దృష్ట్యా ఈ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు కనెక్షన్‌లు తీసుకున్నాక ధరలు పెంచుతూ వారు మోయలేనంత భారం మోపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వారం రోజులు కష్టపడి సంపాదించిన కూలి డబ్బులను సిలిండర్‌కే వెచ్చిస్తే మిగతా అవసరాలు ఎలా తీరుతాయో అర్థం కావడం లేదని మహిళలు అంటున్నారు. పెరుగుతున్న ధరలతో మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేట్టుంది

- సుజాత, గృహిణి, కామారెడ్డి

కట్టెల పొయ్యితో ఇబ్బందులు తలెత్తుతాయని దీపం పథకం కింద సిలిండర్‌లను అందజేసిన ప్రభుత్వం రోజురోజుకూ గ్యాస్‌ ధరలను పెంచడంతో మోయలేని భారంగా తయారవుతోంది. దీని వల్ల గతంలో ఉన్న కట్టెల పొయ్యే దిక్కయ్యేటట్టుంది. రూ.400ల నుంచి ప్రస్తుతం రూ.1000 వరకు ధరలు పెరగడంపై మా లాంటి సామాన్యులకు ఇబ్బందులు తప్పెట్టు లేవు.


పేదలకు మోయలేని భారం

- కవిత, గృహిణి, కామారెడ్డి

ఇప్పటికే నిత్యావసర వస్తువులు, నూనె ధరలు భగ్గుమంటుండగా ఇప్పుడు వంట గ్యాస్‌ పెంచడం మాలాంటి పేదలకు మోయలేని భారమే. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంను పట్టించుకోకుండా ఇష్టారీతిన ధరలు పెంచి ప్రజలకు పెనుభారం మోపడం తగదు. ఇప్పటికే డెలివరీ బాయ్‌లు రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తుండగా ఇప్పుడు ఈ తరహాలో పెంపుదలతో మాలాంటి వారికి కష్టంగా మారుతోంది.


ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలి

- రాజేందర్‌, కామారెడ్డి

ప్రభుత్వం నెలల వ్యవధిలోనే ఈ తరహాలో గ్యాస్‌ ధరలను పెంచడం సామాన్యులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్‌ సబ్సిడీని ఇచ్చి ఆదుకోవాలి. ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలి. 

Updated Date - 2022-03-23T05:29:33+05:30 IST