Abn logo
May 1 2021 @ 08:54AM

గ్యాస్‌ లీక్.. 3 లక్షల నగదు, 22 తులాల బంగారం దగ్ధం

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌ : గ్యాస్‌లీకై ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 లక్షల నగదుతోపాటు 22 తులాల బంగారు ఆభరణాలు, ఎల్‌ఐసీ బాండ్‌లు, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతోపాటు ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొహెడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సానెం మహే‌ష్‌గౌడ్‌ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జంగారెడ్డి ఇంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. మహే‌ష్‌గౌడ్‌ గీత వృత్తితోపాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.


శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్ద పనులు ఉండడంతో భార్యా పిల్లలతో కలిసి వెళ్లాడు. 12 గంటల ప్రాంతంలో అతడి ఇంట్లో గ్యాస్‌ లీక్‌ అయింది. అదే సమయంలో విద్యుత్‌ వచ్చి పోవడంతో మంటలు అంటుకుని ఉంటాయని స్థానికులు తెలిపారు. పెంకుటిల్లు కావడంతో మంటలు త్వరగా అంటుకుని పెద్ద ఎత్తున చెలరేగాయి. గమనించిన స్థానికులు హయత్‌నగర్‌ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో వచ్చి మంటలను ఆర్పేశారు. ఇల్లు కాలి రోడ్డున పడ్డ మహే‌ష్‌గౌడ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హయత్‌నగర్‌ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

Advertisement
Advertisement
Advertisement