ఆక్వాచెరువులో ఓఎన్జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌

ABN , First Publish Date - 2021-05-09T07:43:00+05:30 IST

అల్లవరం-గోపాయిలంక సమీపంలోని మామిడితోట ప్రాంతంలో గోపాయిలంకకు చెందిన రైతు చిట్నీడి వేణుకు చెందిన ఆక్వా చెరువులో శుక్రవారం సాయంత్రం ఓఎన్జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయింది.

ఆక్వాచెరువులో ఓఎన్జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌
అల్లవరంలో ఆక్వా చెరువులో గ్యాస్‌ పైపులైను లీకేజీని పరిశీలిస్తున్న తహశీల్దార్‌.

అల్లవరం, మే 8: అల్లవరం-గోపాయిలంక సమీపంలోని మామిడితోట ప్రాంతంలో గోపాయిలంకకు చెందిన రైతు చిట్నీడి వేణుకు చెందిన ఆక్వా చెరువులో శుక్రవారం సాయంత్రం ఓఎన్జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయింది. కాలం చెల్లిన పాత పైపులను మార్చకుండా ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్లకు నిరాటంకంగా గ్యాస్‌ సరఫరా చేస్తోంది. బోడసకుర్రు శివారు దేవర్లంకలో పాశర్లపూడి జీసీ ఎస్‌కు ఆక్వా చెరువుల్లో వేసిన పాత పైపులైను నుంచి గ్యాస్‌ లీకైంది. ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు వెళ్లి  పైపులైన్‌ నుంచి గ్యాస్‌ సరఫరాను నిలిపివేసి లీకేజీని అదుపులోకి తెచ్చారు. అయితే పైపులో ఉన్న కొద్ది పాటి గ్యాస్‌ మాత్రం శనివారం సాయంత్రం వరకు ఎగదన్నుతూనే ఉంది. తహశీల్దార్‌ ఎస్‌.అప్పారావు గ్యాస్‌ లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్యాస్‌ లీకేజీని పూర్తిగా అదుపు చేశామని, ఎటువంటి ప్రమాదం లేదని, పైపులైన్‌ పాడైనచోట మరమ్మతులు చేపడతామని ఓఎన్జీసీ సిబ్బంది తెలిపారు. ఆక్వా చెరువుల కింద నుంచి వెళ్లిన గ్యాస్‌ పైపులైన్లు తరచూ లీకవుతున్నా ఓఎన్జీసీ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కొబ్బరి తోటల్లో కూడా గ్యాస్‌ లీకేజీలు బయటపడ్డాయి. 

Updated Date - 2021-05-09T07:43:00+05:30 IST