మార్కెట్లోకి త్వరలో గో ఆమృతం...

ABN , First Publish Date - 2021-12-07T19:07:49+05:30 IST

భూసారం, పుష్కలమైన పంటకు భరోసా ఇస్తూ కెమికల్ ఆధారిత పెస్టిసైడ్లకు..

మార్కెట్లోకి త్వరలో గో ఆమృతం...

ప్రయాగ్‌రాజ్: భూసారం, పుష్కలమైన పంటకు భరోసా ఇస్తూ కెమికల్ ఆధారిత పెస్టిసైడ్లకు ఉత్తరప్రదేశ్‌లోని మాణిక్‌పూర్‌కు (చిత్రకూట్) చెందిన గోశాల సరికొత్త సవాలు విసరబోతోంది. గో మూత్రం, పేడ, ప్రకృతి ప్రసాదించిన ఉత్పత్తులతో తయారు చేసిన 'గో అమృతం'ను ఈ వారంలోనే మార్కెట్‌లోకి తీసుకురానుంది. విశ్వహిందూ పరిషత్‌కు అనుబంధంగా ఉన్న గోరక్షక్ విభాగ్ వలంటీర్లు పెద్దఎత్తున బుందేల్‌ఖండ్, కాశీ, ఇతర ప్రాంతాల్లోని గోశాలల్లో ఈ 'గో అమృతం' తయారీని చేపట్టారు. భూసారాన్ని పెంచి, ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు 'గో అమృతం' ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు చెబుతున్నారు.


నేచురల్ పెస్టిసైడ్ (గో అమృతం) 200 లీటర్ల తయారీకి 20 లీటర్ల గో మూత్రం, ఐదు కిలోల పేడ, 5 కిలోల వేప ఆకులు, ఐదు కిలోల బెల్లం వాడతామని అభయ్ గోశాల కన్వీనర్ అభిషేక్ బాజ్‌పేయి తెలిపారు. భూసార సామర్థ్యాన్ని ఇది పెంచడంతో పాటు, మొక్కలు కూడా బలంగా ఎదుగుతాయని ఆయన తెలిపారు. గో అమృతం బాక్టీరియాను సమర్ధవంతంగా నిరోధిస్తుందని, పంట ఉత్పత్తిని పెంచే ఎర్త్‌వార్మ్స్‌కు మాత్రం ఎలాంటి హాని చేయదని ఆయన చెప్పారు. సహజంగా కెమికల్స్‌తో చేసిన పెస్టిసైడ్లు ఎర్త్‌వార్మ్స్‌ను చంపడమే కాకుండా, కెమికల్స్ వాడకం కారణంగా మనుషులకు కూడా హాని జరుగుతుందనే విషయం పలుమార్లు నిరూపితమైందని, గో అమృతంలో వాడే గోమూత్రం, పేడతో భూసారం, పంట ఉత్పత్తి పెరుగుతాయని చెప్పారు. మరోవైపు, విహెచ్‌పీ గో రక్షక విభాగం సైతం గ్రామాలు, బ్లాక్ స్థాయిల్లో వేలాది మంది రైతులను నేరుగా కలుసుకుని గో అమృతం సామర్థ్యాన్ని, ఉపయోగాలను వివిరిస్తోంది. గో అమృతం వినియోగానంతరం వచ్చే స్పందనను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు తెరిచి, అమ్మకాలు సాగించే ఆలోచనలో గోశాలలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో గంగా నది ఒడ్డున జరిగే మహా మేళాలో కూడా గో అమృతంపై విసృత ప్రచారానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2021-12-07T19:07:49+05:30 IST