ఉత్కంఠగా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

ABN , First Publish Date - 2022-01-25T05:46:25+05:30 IST

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సంచలనంగా మారింది. అధిష్టానం సీల్డ్‌కవర్‌లో పంపించన పేర్లను విస్మరించి కౌన్సిలర్లు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో కౌన్సిలర్లకు చైర్మన్‌కు మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గ కేంద్రంలో అధిష్ఠానం సూచనను పాలకవర్గ సభ్యులు ధిక్కరించడం చర్చకు దారితీసింది.

ఉత్కంఠగా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక
కోఆప్షన్‌ సభ్యులను సన్మానిస్తున్న చైర్మన్‌, కమిషనర్‌

అధిష్ఠానం సూచనను పట్టించుకోని గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు

బహిర్గతమైన కౌన్సిలర్లు, చైర్మన్‌ మధ్య విభేదాలు


గజ్వేల్‌, జనవరి 24: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సంచలనంగా మారింది. అధిష్టానం సీల్డ్‌కవర్‌లో పంపించన పేర్లను విస్మరించి కౌన్సిలర్లు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో కౌన్సిలర్లకు చైర్మన్‌కు మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గ కేంద్రంలో అధిష్ఠానం సూచనను పాలకవర్గ సభ్యులు ధిక్కరించడం చర్చకు దారితీసింది. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి అధ్యక్షతన కమిషనర్‌ వెంకటగోపాల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికను నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం కాగానే పోటీలో ఉన్నవారి పేర్లను కమిషనర్‌ చదివి వినిపించారు. ఈ క్రమంలో అధిష్టానం సూచించిన నాలుగు పేర్లలో నంగునూరి విజయలక్ష్మి, షరిఫాల పేర్లను చైర్మన్‌ సూచించగా సభ్యులు బలపరిచారు. కానీ మహ్మద్‌ వసీంఖాన్‌, గుడ్డోజీ పరమేశ్వరాచారిల ఎన్నికకు మాత్రం కౌన్సిలర్లు ససేమిరా అన్నారు. వారి స్థానంలో ఇస్మాయిల్‌, గంగిశెట్టి రాజుల పేర్లను కౌన్సిలర్లు ప్రతిపాదించారు. దీంతో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ కౌన్సిలర్లతో చర్చించారు. అధిష్టానం సూచించిన వారినే ఎన్నుకోవాలని కోరారు. కానీ కౌన్సిలర్లు ఒప్పుకోకపోవడంతో గంగిశెట్టి రాజు, ఇస్మాయిల్‌ ఎన్నిక ఖాయమైంది. ఈమేరకు కమిషనర్‌ ఎన్నికైన నలుగురు సభ్యుల పేర్లను ప్రకటించారు. వారికి నియామకపత్రాలను అందజేశారు. అనంతరం కమిషనర్‌ వెంకటగోపాల్‌ నూతనంగా ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. చైర్మన్‌, పాలకవర్గ సభ్యులు శాలువాలతో సత్కరించి, అభినందించారు.


బహిర్గతమైన విభేదాలు

కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికతో కొన్నాళ్లుగా మున్సిపల్‌ పాలకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేధాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. చైర్మన్‌ రాజమౌళి ఒంటెద్దు పోకడ పోతున్నారని, ఏ విషయంలోనూ సభ్యులను సంప్రదించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల గూరించి కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని ఓ మహిళా కౌన్సిలర్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చైర్మన్‌ తీరుపై గుర్రుగా ఉన్న కౌన్సిలర్లు కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక విషయంలో దెబ్బతీశారు. అధిష్టానం సూచించినవారిలో మహిళలను మాత్రం ఎన్నుకుని పురుష సభ్యులను తిరస్కరించారు. చైర్మన్‌ తమను పట్టించుకోకపోవడంతోనే కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో తాము విభేధించామని ఓ కౌన్సిలర్‌ మీడియా సభ్యులకు తెలిపారు. 


సభ్యుల తీరుపై అధిష్ఠానం ఆగ్రహం

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సందర్భంగా తలెత్తిన ఘటనలపై అధిష్టానం, సీనియర్‌ నాయకులు గుర్రుగా ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించడంపై క్షమించరానిదని వారు ఆగ్రహంగా ఉన్నారు. అధిష్టానం తనపేరును సూచించినా పాలకవర్గ సభ్యుల మధ్య విభేదాలతోనే పక్కన పెట్టారని, అయినా తాను పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని మహ్మద్‌ వసీంఖాన్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-25T05:46:25+05:30 IST