గెజిట్‌ అమలుపై బోర్డుల జోరు

ABN , First Publish Date - 2021-07-31T08:07:27+05:30 IST

కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం పరిధిలో ఇరు రాష్ట్రాల జల వనరుల నిర్వహణను నదీ యాజమాన్య బోర్డులు స్వీకరించే కార్యక్రమం మొదలైంది. కృష్ణా నదిపై 36, గోదావరి నదిపై 71 ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌

గెజిట్‌ అమలుపై బోర్డుల జోరు

11 మందితో గోదావరి బోర్డు సమన్వయ కమిటీ

ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు

3న హైదరాబాద్‌లో కమిటీ తొలి సమావేశం

రెండు సర్కిళ్లుగా కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు 

పర్యవేక్షణకు ఇద్దరేసి అధికారుల్ని పంపాలన్న బోర్డు

75 రోజుల్లో బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు

సెప్టెంబరు 14లోగా ఇరు రాష్ట్రాలు నిధులివ్వాలి


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం పరిధిలో ఇరు రాష్ట్రాల జల వనరుల నిర్వహణను నదీ యాజమాన్య బోర్డులు స్వీకరించే కార్యక్రమం మొదలైంది. కృష్ణా నదిపై 36, గోదావరి నదిపై 71 ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసి 15 రోజులైంది. మరో 75 రోజుల్లో అప్పగింతల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దాంతో రెండు బోర్డులు కూడా గెజిట్‌ అమలుకు కసరత్తును ముమ్మరం చేశాయి. తెలుగు రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపుతున్నాయి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ గెజిట్‌ అమలుపై 11 మంది అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.


ఈ మేరకు ఆఫీస్‌ మెమొరాండం విడుదల చేసింది. సమన్వయ కమిటీలో ఏపీ నుంచి నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశం ఆగస్టు 3న హైదరాబాద్‌లో జరగనుంది. గెజిట్‌ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చిస్తారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను అనుసరించి తెలుగు రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యల అమలు కోసం బోర్డులు లేఖలు రాస్తున్నాయి. గెజిట్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టుల కార్యకలాపాలపై నోటిఫికేషన్‌ విడుదల చేయడం కోసం తెలుగు రాష్ట్రాలు ఇద్దరేసి అధికారులను తమకు అందించాలని కృష్ణా బోర్డు లేఖలు రాసింది. కృష్ణా బోర్డు పరిధిలో ప్రాజెక్టుల పర్యవేక్షణకు 300 మంది సాగునీటి శాఖ అధికారులు/సిబ్బంది, 300 మంది సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు అవసరం అవుతారని తేల్చారు. శ్రీశైలం, దానికి ఎగువన కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం ఒక ఎస్‌ఈ సర్కిల్‌ను, నాగార్జునసాగర్‌, దానికి దిగువన కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం మరో ఎస్‌ఈ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని, ఆ ఇద్దరు అధికారుల చేతుల మీదుగానే ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్‌ ఉత్పాదన కార్యకలాపాలను చేపట్టాలని బోర్డు భావిస్తోంది. వీరి ఆధ్వర్యంలో పని చేయడానికి 10 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌లు అవసరమని, ఇందులో 9 మంది సివిల్‌, ఒకరు ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 3న హైద రాబాద్‌లో జరుగనున్న గోదావరి బోర్డు సమావేశంలో కూడా వ్యవస్థ నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 


మరో 75 రోజులే

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబరు 14న అమల్లోకి రానుంది. అంటే, తెలుగు రాష్ట్రాల నుంచి వాటి నిర్వహణను తీసుకోవడానికి ఇంకా 75 రోజులే గడువుంది. పార్లమెంటు సమావేశాలు ముగియగానే గెజిట్‌ అమలు మార్గదర్శకాలను కేంద్ర జల వనరుల శాఖ విడుదల చేసే అవకాశం ఉంది. రెండు బోర్డుల చైర్మన్లు/సభ్య కార్యదర్శులను కేంద్రం ఢిల్లీకి పిలిపించి మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఈ మార్గదర్శకాలే బోర్డుల కార్యకలాపాలకు దారి చూపనున్నాయి. అక్టోబరు 14 తర్వాత కేంద్ర పారిశ్రామిక రక్షణ బలగాలను కేంద్రం ప్రాజెక్టులపై దించనుంది. ఆ తర్వాత ప్రాజెక్టులపై ఏ పని చేయాలన్నా ఆయా బోర్డుల అనుమతి తప్పనిసరి కానుంది. 


నిధుల జమకు 45 రోజులే

కృష్ణా, గోదావరి బోర్డుల కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా తెలుగు రాష్ట్రాలు ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున వాటి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అంటే, తెలంగాణ కృష్ణా బోర్డుకు రూ.200 కోట్లు, గోదావరి బోర్డుకు రూ.200 కోట్లు ఇవ్వాలి. నిధుల కోసం బోర్డులు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. తమ వద్ద నిధులు లేవని, కేంద్రం నుంచే తీసుకోవాలని బోర్డులకు తేల్చిచెప్పాలని ఇప్పటికే తెలంగాణ నిర్ణయానికి వచ్చింది. అయితే, ఇప్పటివరకు ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పలేదు. బోర్డు కార్యాలయం చైర్మన్‌ అనుమతితో నిధులు అడిగినపుడు 15 రోజుల్లోగా జమ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కాదు కూడదు అనడానికి వీల్లేదని గెజిట్‌ చెబుతోంది.


సహకరిస్తారా?

గెజిట్‌ నోటి ఫికేషన్‌ను ఏపీ స్వాగతిస్తుండగా తెలంగాణ మాత్రం స్వాగతించనూ లేదు... వ్యతిరేకించనూ లేదు. దాంతో బోర్డులు కోరిన నిధులతో పాటు సిబ్బంది/సరంజామాను ఏపీ సమకూర్చే అవకాశాలున్నాయి. తెలంగాణ వైఖరి ఏంటనేది ఆగస్టు 3న గోదావరి బోర్డు సమావేశంతో తేటతెల్లం కానుంది. ఆ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరవుతారా? హాజరైతే గెజిట్‌పై ఏం నిర్ణయం తీసుకుంటారు? నిధుల విడుదల, సిబ్బందిని సమకూర్చడంపై ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు బోర్డుల్లో కూడా ఇద్దరు చైర్మన్లు/ఇద్దరు సభ్యులు/ఇద్దరు సభ్య కార్యదర్శులు తప్ప మిగతా వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. దాంతో బోర్డు కూర్పు విషయంలో తెలంగాణ నిర్ణయం కీలకం కానుంది. 


165 రోజుల్లో  అనుమతి తెచ్చుకోవాలి

కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్టులకు అనుమతి లేదో కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్లోనే పేర్కొనడంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ నోటిఫికేషన్‌ విడుదలైన(జూలై 16) తేదీ నుంచే ఆపేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ వెలువడిన ఆర్నెల్ల (2022 జనవరి 14) లోపు ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు సంబంధిత నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు కృష్ణా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడంతో వాటికి కేంద్ర జలసంఘం అనుమతి లభించే అవకాశాల్లేవు. కేంద్ర జలశక్తి మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోవడం తప్ప మరో దారి లేదు. విధిగా కృష్ణా బోర్డుకు డీపీఆర్‌లు సమర్పించి, అక్కడి నుంచి కేంద్ర జలశక్తి శాఖకు వెళ్లేట్లు చూసుకొని, అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇద్దరు సీఎంల పరస్పర అంగీకారంతో ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-07-31T08:07:27+05:30 IST