కొనుగోలులో జీసీసీ వెనుకబాటు

ABN , First Publish Date - 2021-01-21T06:13:52+05:30 IST

అటవీ ఉత్పత్తుల కొనుగోలులో జీసీసీ(గిరిజన సహకారం సంస్థ) వెనుకబడిందని, పార్వతీపురంతో పాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట డివిజన్‌లోనూ పనితీరు బాగాలేదని ఆ సంస్థ ఎండీ పీఏ శోభ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొనుగోలులో జీసీసీ వెనుకబాటు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎండీ శోభా


రెండు జిల్లాల్లోనూ పనితీరు మెరుగుపడాలి

ఎండీ శోభ

పార్వతీపురం, జనవరి 20 : అటవీ ఉత్పత్తుల కొనుగోలులో జీసీసీ(గిరిజన సహకారం సంస్థ) వెనుకబడిందని, పార్వతీపురంతో పాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట డివిజన్‌లోనూ పనితీరు బాగాలేదని ఆ సంస్థ ఎండీ పీఏ శోభ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతంపేట, పార్వతీపురం డివిజన్ల జీసీసీ అధికారులు, కొనుగోలు అసిస్టెంట్లు, జీసీసీ డివిజనల్‌ మేనేజర్లతో ఆమె పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు డివిజన్లలో పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైనర్‌ ఫారెస్ట్‌ ప్రొడక్ట్స్‌ (ఎంఎఫ్‌పీ) కొనుగోలుకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో సాలూరు, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం జీసీసీ డిపోల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2.82 కోట్ల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ.43 లక్షలు విలువ చేసే అటవీ ఉత్పత్తులనే కొనుగోలు చేశారని చెప్పారు. సీతంపేట డివిజన్‌ పరిధిలో రూ. 1.12 కోట్ల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం రూ. 29.5 లక్షల అటవీ ఉత్పత్తులను మాత్రమే గిరిజనుల నుంచి కొనుగోలు చేయడంపై ఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా జీసీసీ ఉత్పత్తుల విక్రయాలపైనా ఆరా తీశారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో రూ.1.50 కోట్ల జీసీసీ ఉత్పత్తులు విక్రయించాల్సి ఉండగా... ఇప్పటివరకు రూ.92.5 లక్షల ఉత్పత్తులను విక్రయించారని తెలిపారు. సీతంపేట డివిజన్‌ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన జీసీసీ ఉత్పత్తులు విక్రయించాల్సి ఉండగా.. రూ.94.5 లక్షలు విలువైన జీసీసీ ఉత్పత్తులను విక్రయించారని నిరాశ వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు, విక్రయాల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు, సిబ్బందికి ఆమె ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ మాట్లాడుతూ గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తుల కొనుగోలులో అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఐటీడీఏ ద్వారా జీసీసీ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. సమావేశంలో జీసీసీ జనరల్‌ మేనేజర్‌ (పరిపాలన) జి.చిన్నబాబు, మార్కెటింగ్‌ జీఎం సురేంద్రబాబు, విజిలెన్స్‌ అధికారి జి.గౌరీశంకర్‌, పార్వతీపురం జీసీసీ డీఎం ఎస్‌.రామ్మూర్తి, జీసీసీ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:13:52+05:30 IST