జీడీపీ వృద్ధి మైనస్‌ 7.3శాతం

ABN , First Publish Date - 2021-06-01T06:06:59+05:30 IST

మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదైంది. కొవిడ్‌ కారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.5 నుంచి 9 శాతం వరకు ఉండొచ్చని...

జీడీపీ వృద్ధి మైనస్‌ 7.3శాతం

  • 2020-21 ఆర్థిక సంవత్సరం
  • అంచనాలకు భిన్నంగా  
  • ఆదుకున్న నాలుగో త్రైమాసికం
  • 40 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పతనం  
  • రూ.10 లక్షల కోట్ల నష్టం 
  • ఎన్‌ఎ్‌సఓ వెల్లడి 


న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదైంది. కొవిడ్‌ కారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.5 నుంచి 9 శాతం వరకు ఉండొచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సహా పలు సంస్థలు అంచనా వేశాయి. అయితే అంచనాలకు భిన్నంగా 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020 -21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదైందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎ్‌సఓ) వెల్లడించింది. 2019-20లో వృద్ధి రేటు 4 శాతంగా ఉంది. లాక్‌డౌన్ల ఎత్తివేతతో గత ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు కావడం కలిసివచ్చింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అనుకున్న స్థాయిలో పతనం కాలేదు. అక్టోబరు -డిసెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 0.5 శాతంగా ఉంది. 


నష్టం రూ.10 లక్షల కోట్లు

దాదాపు నలభై ఏళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్‌ స్థాయికి పడిపోయింది. 1979-80 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 5.2 శాతంగా నమోదైన తర్వాత మళ్లీ ఈ స్థాయిలకు పడిపోవటం ఇదే మొదటిసారి. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరం రూ.145 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ 2020-21లో రూ.135 లక్షల కోట్లకు పడిపోయింది. భారత  జీడీపీ మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయికి చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 10 నుంచి 11 శాతం మేర నమోదు కావాల్సి ఉంటుంది. 

అయితే కొవిడ్‌ రెండో ఉధృతి నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే వినియోగం గణనీయంగా పడిపోయింది. నిరుద్యోగమూ 14 శాతం దాటి ఏడాది గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప, జీడీపీ వృద్ధి రేటు పెద్దగా పెరిగే  అవకాశాలు కనిపించడం లేదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



ద్రవ్య లోటు 9.3 శాతం 

కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు జీడీపీలో 9.3 శాతం (రూ.18,21,461 కోట్లు)గా నమోదైంది. సవరించిన 2020- 21 బడ్జెట్‌ అంచనాల కంటే ఇది 0.2 శాతం తక్కువ. పన్ను వసూళ్లు అంచనాలకు మించి వసూలు కావడం ఇందుకు ప్రధాన కారణం. అందుబాటులో ఉన్న తాత్కాలిక అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.16,89,720 కోట్లు అందాయి. బడ్జెట్‌ అంచనాల కంటే ఇది 5.5 శాతం ఎక్కువ. కొవిడ్‌ ప్రభావం తగ్గి, గత ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడం ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. 

Updated Date - 2021-06-01T06:06:59+05:30 IST