జీడీపీ -23.9 శాతం

ABN , First Publish Date - 2020-09-01T06:38:21+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షుభిత స్థితిలో ఉంది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతం క్షీణించగా మౌలిక వసతుల విభాగంలోని ఎనిమిది కీలక రంగాలు వరుసగా ఐదో నెల కూడా భారీ తిరోగమనాన్ని నమోదు చేశాయి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా భారీగా తగ్గడంతో విత్తలోటు పోటెత్తింది...

జీడీపీ   -23.9 శాతం

  • ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారీ పతనం
  • 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షుభిత స్థితిలో ఉంది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతం క్షీణించగా మౌలిక వసతుల విభాగంలోని ఎనిమిది కీలక రంగాలు వరుసగా ఐదో నెల కూడా భారీ తిరోగమనాన్ని నమోదు చేశాయి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం కూడా భారీగా తగ్గడంతో విత్తలోటు పోటెత్తింది.  


వృద్ధిరేటు ఢమాల్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రై మాసికంలో భారత్‌ భారీ ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. త్రైమాసికంలో అధిక సమయం లాక్‌డౌన్లు అమల్లో ఉండటంతో జీడీపీ వృద్ధి రేటు -23.9 శాతం క్షీణతను నమోదుచేసింది. ఒక్క వ్యవసాయ రంగమే కారుచీకటిలో కాంతికిరణంగా నిలిచింది. తయారీ, నిర్మాణం, సేవల రంగాలు భారీ క్షీణతలో పయనించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధిరేటు 5.2 శాతం ఉంది. స్థిర ధరల ప్రకారం తొలి త్రైమాసికంలో జీడీపీ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రూ.35.35 లక్షల కోట్ల నుంచి రూ.26.90 లక్షల కోట్లకు దిగజారిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రకటించింది. 1980 తర్వాత జీడీపీ ఈ స్థాయిలో పతనం కావటం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఒక త్రైమాసికంలో వృద్ధి రేటు ఈ స్థాయిలో కుప్పకూలటం కూడా ఇదే మొదటిసారి. 


  1. తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) 39.3 శాతం క్షీణించగా.. నిర్మాణ రంగం లో -50.3 శాతం, గనుల రంగంలో -23.3 శాతం క్షీణత నమోదైంది. 
  2. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసులు -47 శాతం క్షీణించాయి. రియల్‌ ఎస్టేట్‌ ప్రొఫెషనల్‌ సర్వీసులు -5.3 శాతం క్షీణించాయి. 
  3. విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, యుటిలిటీ  విభాగాలు 7 శాతం క్షీణత నమోదు చేశాయి.
  4. వ్యవసాయ రంగం ఒక్కటే స్థూలంగా 3.4 శాతం అదనపు విలువను జోడించింది.


జూలైలోనూ ఇన్‌ఫ్రా తిరోగమనమే..

మౌలిక వసతుల రంగానికి అత్యంత కీలకంగా భావించే ఎనిమిది రంగాలు జూలై నెలలో కూడా భారీ క్షీణతను నమోదు చేశాయి. ప్రధానంగా ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్‌ రంగాల్లో ఉత్పత్తి భారీగా క్షీణించింది. ఎనిమిది కీలక రంగాలు జూలైలో 9.6 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది జూలైలో ఈ రంగాల వృద్ధి 2.6 శాతం ఉంది. ఒక్క ఎరువుల రంగం మాత్రం 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. మౌలిక రంగంలో ప్రతికూల వృద్ధి నమోదు కావడం వరుసగా ఇది ఐదో నెల. కాగా ఏప్రిల్‌-జూలై నెలల మధ్య కాలంలో మౌలిక రంగాల క్షీణత -20.5 శాతం ఉంది. 


అదుపు తప్పిన విత్త లోటు

లాక్‌డౌన్లు, రెవెన్యూ వసూళ్ల క్షీణతతో   తొలి త్రైమాసికంలో విత్త లోటు 103.1 శాతానికి చేరిపోయింది. ప్రభుత్వం ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న విత్త లోటు పరిమాణం రూ.7.96 లక్షల కోట్లు (జీడీపీలో 3.5 శాతం) కాగా జూలై చివరికి రూ.8,21,349 కోట్లకు దూసుకుపోయింది.  రెవెన్యూ వసూళ్లు రూ.2,27,402 కోట్లు కాగా మొత్తం వ్యయం రూ.10,54,2019 కోట్లుగా ఉంది. 


Updated Date - 2020-09-01T06:38:21+05:30 IST