Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట పొలాల్లోకి జీడీపీ నీరు

  1. వెనుక జలాలతో 150 ఎకరాలు మునక
  2. రైతులకు రూ.50 లక్షలకు పైగా నష్టం
  3. డ్యాం ఎత్తు పెంచితే పరిస్థితి ఏమిటి..?
  4. ఆందోళనలో అన్నదాతలు


గోనెగండ్ల డిసెంబరు 3: గాజులదిన్నె ప్రాజెక్టు వెనుక భాగంలో ఉన్న రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు వెనుక జలాల్లో పంట భూములు ముంపునకు గురవుతున్నాయి. ఏళ్లు గడిచినా ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదు. ఈ ఏడాది జీడీపీలో 376.5 మీటర్ల వరకూ నీరు చేరింది. గత 20 రోజుల నుంచి 150 ఎకరాల్లో పంట భూములు మునిగి పోయాయి. మూడు దశాబ్దాలుగా జీడీపీకి వరద నీరు వచ్చిన ప్రతిసారీ ఎగువ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు అధికారుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. జీడీపీ ఎగువ ప్రాంతంలో ఉన్న ఐరన్‌బండ, ఎన్నెకండ్ల గ్రామానికి చెందిన పట్టా భూములు ప్రస్తుతం నీట మునిగాయి. దీంతో 150 ఎకరాలలో పంట చేతికి అందకుండా పోతోంది. రూ.50 లక్షల మేర పంట నష్టం జరిగింది. ప్రాజెక్టులో 377 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తే 160 ఎకరాల పట్టా భూముల్లోని పంటలు మునిగిపోతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐరన్‌బండ, ఎన్నెకండ్ల గ్రామాల రైతులకు చెందిన వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, వరి పంటలు మునిగిపోయాయి. తమకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 


డ్యామ్‌ ఎత్తు పెంచితే ఎలా..? 


గాజులదిన్నె ప్రాజెక్టులో 377 మీటర్ల వరకూ నీరు నిల్వ చేస్తేనే ఎగువ ప్రాంతంలో పంట పొలాలు వరద నీట మునిగి పోతున్నాయి. ఉన్న అరకొర భూములలో పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్న రైతులు దీనికే ఇబ్బంది పడుతున్నారు. తాజాగా డ్యామ్‌ ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం రూ.53 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు పూర్తయితే ఐరన్‌బండ, ఎన్నెకండ్ల గ్రామాల్లోని భూములన్నీ నీట మునిగిపోతాయి. అప్పుడు తమ పరిస్థితి ఏమిటని, జీవనం ఎలా గడుస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. డ్యామ్‌ ఎత్తు పెంచవద్దని కోరుతూ గోనెగండ్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం కర్నూలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.


ఇవే మునక భూములు 


డ్యాం ఎగువ ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్లు 265/1, 271, 273, 722, 134, 39, 77, 57, 44, 43, 41, 42, 125, 726, 127 భూముల్లోకి నీరు చేరుతుంది. గత ఏడాది రెవెన్యూ అధికారులు సర్యేలు నిర్వహించారు. అందులో 160 ఎకరాలు పట్టా భూమి అని, ఈ భూమి ప్రాజెక్టుకు సంబంధించినది కాదు అని తెలింది. నాలుగు రోజుల క్రితం అధికారులు సగం వరకు సర్వే జరిపారు. సర్వే పనులు పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు పంపించారని రైతులు అంటున్నారు. 


మా భూములు ఇవ్వం


ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వరద నీటిలో మునిగిపోయిన పంటలకు ప్రభుత్వం తప్పనిసరిగా పరిహారం అందజేయాలి. అంతవరకు పోరాటం చేస్తాం. డ్యామ్‌ ఎత్తు పెంచితే మా జీవితాలు అంధకారంలోకి వెళాతాయి. మాకు బతుకు దెరువు లేకుండా పోతుంది. కావున ప్రభుత్వానికి మా పంట భూములు ఇచ్చేది లేదు. గతంలోనే జీడీపీకి మూడు వేల ఎకరాలు ఇచ్చాం. ఇక ఇచ్చేందుకు మేము సిద్ధంగా లేం. 


- నజీర్‌ సాహెబ్‌, రైతు, ఐరన్‌బండ


ఉన్నతాధికారుల అదేశాల మేరకు నీటి నిల్వ


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాజులదిన్నె ప్రాజెక్టులో 377 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తున్నాం. రైతులకు సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. గత ఏడాది సర్వేలు చేసి నివేదిక అందజేశాం.


- రవికుమార్‌ ఏఈ, జీడీపీ

Advertisement
Advertisement